భ‌క్తి యజ్ఞం.. కోటి దీపోత్స‌వం..

నేటి నుంచే భక్తి టీవీ కోటి దీపోత్సవం!

“చీకటి పారదోలేది వెలుగు… అజ్ఞానాన్ని హరించేది దీపం. పవిత్ర కార్తీక మాసంలో ఆ పరమశివుడికి, శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైనది ఈ దీపారాధనే. మన ఇంట్లో ఒక్క దీపం వెలిగిస్తేనే మనసుకు ఎంతో ప్రశాంతత కలుగుతుంది.. అలాంటిది ఏకంగా ‘కోటి దీపాలు’ ఒకే చోట దేదీప్యమానంగా వెలుగులు విరజిమ్ముతుంటే.. ఆ దృశ్యం ఎలా ఉంటుంది…? అక్షరాలా భూలోక కైలాసాన్నే తలపిస్తుంది కదూ! సరిగ్గా అలాంటి అద్భుత ఘట్టానికే హైదరాబాద్ నగరం మరోసారి వేదికగా మారింది. కన్నుల పండువైన ఆధ్యాత్మిక సంబరం ఎలా జరగబోతోంది…? ఆ మహా యజ్ఞం విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం…”

భారతీయ సనాతన ధర్మానికి నిలువెత్తు అద్దం.. భక్తి, ఆధ్యాత్మికతల మేలు కలయిక.. ఈ కోటి దీపోత్సవం. కార్తీక మాసపు పవిత్ర ఘడియల్లో, ఎన్టీఆర్ స్టేడియం వేదికగా కోటి దీపాలు సాక్షాత్కరించనున్నాయి. భక్తి టీవీ, నరేంద్ర చౌదరి గారి నేతృత్వంలో జరుగుతున్న ఈ అద్భుత ఆధ్యాత్మిక మహా యజ్ఞం 14వ వసంతంలోకి అడుగుపెడుతోంది. భారతీయ హిందూ ధర్మాన్ని ఇంటింటికీ తీసుకువెళ్తున్న ఈ మహత్తర ఘట్టంపై మన ప్రత్యేక కథనం.

మన భారతీయ జీవన విధానంలో ఆధ్యాత్మికత అనేది అంతర్భాగం. ధర్మం, సేవ, భక్తి.. ఈ మూడు విలువలను నిత్య చైతన్యవంతంగా భావితరాలకు అందించాలనే ఉదాత్త సంకల్పమే భక్తి టీవీ నిర్వహిస్తున్న ‘కోటి దీపోత్సవం’. 2012లో ‘లక్ష దీపోత్సవం’గా భక్తిశ్రద్ధలతో మొదలైన ఈ ప్రయాణం.. దేదీప్యమానంగా వెలుగులు విరజిమ్ముతూ నేడు 14వ ఏట అడుగుపెడుతోంది. ఈ బృహత్తర యజ్ఞాన్ని భక్తి టీవీ అధినేత నరేంద్ర చౌదరి తన భుజస్కంధాలపై వేసుకుని, మనసా వాచా కర్మణా అప్రతిహతంగా కొనసాగిస్తున్నారు. నేటి ఆధునిక యుగంలో సనాతన విలువలను భక్తులకు చేరువ చేసే అతిపెద్ద వేదికగా ఈ వేడుక మారిందనడం అతిశయోక్తి కాదు.

‘తమసోమా జ్యోతిర్గమయ’.. అజ్ఞానపు చీకట్లను పారద్రోలి జ్ఞానపు వెలుగుల వైపు నడిపించమని ఈ ఉపనిషత్తు వాక్యం చెబుతోంది. ఇదే వాక్యాన్ని ఆత్మగా చేసుకుని కోటి దీపోత్సవం ముందుకు సాగుతోంది. సనాతన ధర్మంలో దీపం కేవలం వెలుతురు మాత్రమే కాదు.. శాంతికి, ఐక్యతకు సజీవ ప్రతీక. అందుకే కార్తీక మాసంలో దీపారాధనకు అంతటి ప్రాముఖ్యత ఉంది. ముక్కోటి దేవతలను ఆవాహన చేస్తూ.. ఒకే ప్రాంగణంలో, లక్షలాది మంది భక్తులు ఒకేసారి దీపాలు వెలిగిస్తుంటే ఆ అద్భుత దృశ్యం మాటలకందనిది. పవిత్ర శివనామస్మరణతో మార్మోగే ఆ ఆవరణలో.. కోటి దీపాలు ప్రసరించే వెలుగులు ఆధ్యాత్మిక శక్తికి దర్పణంలా నిలుస్తాయి. భక్తుల హృదయాల్లో భక్తి జ్వాలలను రగులుస్తాయి.

తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, యావత్ దేశంలోనే అత్యంత నియమనిష్టలతో నిర్వహించే ఆధ్యాత్మిక సంబరంగా ఈ దీపోత్సవం ఖ్యాతి గడించింది. ఈ ఏడాది కూడా అదే నిబద్ధతతో సర్వం సిద్ధమైంది. నవంబర్ 14వ తేదీ.. అంటే నేటి నుంచి నవంబర్ 30 వరకు ఏకబిగిన 17 రోజుల పాటు హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియం ఈ మహాద్భుతానికి వేదిక కాబోతోంది. ఈ కన్నులపండువలో పాల్గొనేందుకు నగర వాసులతో పాటు తెలంగాణ, ఏపీ రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలిరానున్నారు. అలాగే దేశ నలుమూలల నుంచి పీఠాధిపతులు, మఠాధిపతులు, సాధు పుంగవులు, ప్రవచనకర్తలు విచ్చేసి ఈ మహా యజ్ఞాన్ని విజయవంతం చేయనున్నారు. కోటి దీపాల వెలుగులో వికసించే జ్ఞానాన్ని, ప్రశాంతతను ఆస్వాదించడానికి కోట్లాది మంది భక్తులు సిద్ధంగా ఉన్నారు.

“మాటలకు అందని మహదానందాన్ని, వర్ణించలేని ఆధ్యాత్మిక అనుభూతి ఇచ్చే మహా యజ్ఞం ఈ కోటి దీపోత్సవం. యావత్ దేశం నలుమూలల నుంచి విచ్చేసిన పీఠాధిపతులు, మఠాధిపతుల సమక్షంలో… లక్షలాది మంది భక్తులు ఒకే చోట చేరి ఒకేసారి దీపాలు వెలిగిస్తున్న ఆ క్షణాలు.. ప్రతి ఒక్కరి హృదయంలో భక్తి జ్వాలలను రగిలిస్తాయి”

You might also like