తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి గా సందీప్
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కొత్త వ్యవహారాల ఇంచార్జిగా (AICC In-charge) బీఎం సందీప్ (B. M. Sandeep)ని నియమించారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆదేశాల మేరకు బీఎం సందీప్‌ను తెలంగాణ ఏఐసీసీ ఇంచార్జిగా ఏఐసీసీ అధికారికంగా ప్రకటించింది.
తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల్లో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అనూహ్య మార్పులు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు తెలంగాణ ఏఐసీసీ ఇన్‌ఛార్జ్‌గా కొనసాగిన మీనాక్షి నటరాజన్‌ను ఆ బాధ్యతల నుంచి తప్పించి, ఆమె స్థానంలో కర్ణాటకకు చెందిన సీనియర్ నేత బి.ఎం. సందీప్ ను నూతన తెలంగాణ ఇన్‌ఛార్జ్‌గా నియమిస్తున్నట్లు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని అధిష్టానం స్పష్టం చేసింది.మీనాక్షి నటరాజన్ కొన్నాళ్లుగా అందుబాటులో లేరు.
కర్ణాటకలోని చిక్కమగళూరు ప్రాంతానికి చెందిన బి.ఎం. సందీప్ కుమార్, కాంగ్రెస్ పార్టీ సంస్థాగత వ్యవహారాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న నేతగా గుర్తింపు పొందారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సొంత రాష్ట్రానికి చెందిన నాయకుడు కావడంతో పాటు, జాతీయ స్థాయిలో ఏఐసీసీ కార్యదర్శిగా మహారాష్ట్ర సహా కీలక రాష్ట్రాల వ్యవహారాలను పర్యవేక్షించిన అనుభవం ఆయనకు ఉంది. ముఖ్యంగా తెలంగాణ రాజకీయాలు, ఇక్కడి నాయకత్వం ఆయనకు కొత్తేమీ కాదు. గతంలోనే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించిన సంస్థాగత బాధ్యతలను నిర్వహించడంతో పాటు టీపీసీసీ కమిటీల కూర్పులో ఆయన కీలకంగా వ్యవహరించారు.
ఇటీవల తెలంగాణ కాంగ్రెస్‌లో సీనియర్ నేతలు, మంత్రుల మధ్య నెలకొన్న అంతర్గత విభేదాలు, నామినేటెడ్ పదవుల భర్తీలో జాప్యంపై ఏఐసీసీ దృష్టి సారించింది. మీనాక్షి నటరాజన్ రాజ్యసభ సభ్యత్వం కూడా తెలంగాణ నేతల వల్లే చేజారిపోయిందన్న భావన ఉంది. తర్వాత ఉన్నత విద్య కోసం ఆమె విదేశాలకు వెళ్లారు. దీంతో పార్టీలో క్రమశిక్షణను కాపాడటంతో పాటు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి, టీపీసీసీ సంస్థాగత విభాగానికి మధ్య బలమైన వారధిగా పనిచేసే సమర్థవంతమైన నేత కోసం అధిష్టానం అన్వేషించింది. సౌమ్యుడిగా, అందరినీ కలుపుకుపోయే తత్వం ఉన్న నేతగా పేరున్న సందీప్‌ను పూర్తిస్థాయి ఇన్‌ఛార్జ్‌గా నియమించడం ద్వారా రాష్ట్ర పార్టీలో గ్రూపు రాజకీయాలకు చెక్ పెట్టవచ్చని హైకమాండ్ భావిస్తోంది.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, నామినేటెడ్ పదవుల భర్తీ, అలాగే ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో పార్టీ యంత్రాంగాన్ని పరుగులు పెట్టించడం బి.ఎం. సందీప్ ముందున్న ప్రధాన సవాళ్లు. మీనాక్షి నటరాజన్ స్థానంలో బాధ్యతలు చేపట్టనున్న ఆయన, తెలంగాణ కాంగ్రెస్ నేతల మధ్య సఖ్యతను పెంచి పార్టీని మరింత బలోపేతం చేయడంలో ఏ మేరకు విజయవంతమవుతారో వేచి చూడాలి.