స్టెపులేస్తే తిప్పలే..

మనకు ఆనందం అనిపిస్తే… స్నేహితులతో కలిస్తే.. పార్టీలు, ఫంక్షన్లు అయితే… మన కాలు ఆగమన్నా ఆగదు… చిందేయాల్సిందే… అది ఎక్కడైనా కామన్… కానీ, ఇక్కడ మాత్రం కాదు.. ఇక్కడ స్టెప్పేస్తే చాలు.. తిప్పలు తప్పవు.. అదేంటి అక్కడేమైనా ప్రత్యేక రూల్ ఉందా…? అంటే అదేం లేదు… కానీ, ఇక్కడింతే….

పెండ్లిళ్లు, పేరాంటాలు, ఫంక్షన్లు. పార్టీలు ఇలా ఏదైనా సరే డీజే ఉండాల్సిందే… డాన్స్ చేయాల్సిందే.. ముఖ్యంగా ఉద్యోగాలు చేస్తూ శారీరకంగా, మానసికంగా నిత్యం ఇబ్బందులు పడే వారికి ఇలాంటి సందర్భాలు ఖచ్చితంగా మనసుకు ఆనందం ఇవ్వడమే కాకుండా సేదతీరే అవకాశం ఇస్తాయి.. దీంతో చాలా మంది పార్టీలకు వెళ్తుంటారు.. అక్కడ మందేసి చిందేయడం… రోజువారీ రోటీన్లకు వ్యతిరేకంగా ప్రశాంతంగా గడపడం సర్వసాధారణం… అయితే బెల్లంపల్లిలో అలా చేస్తే మాత్రం చిక్కుల్లో పడటం ఖాయం… అన్నిచోట్లా సర్వసాధారమైన విషయం ఇక్కడ మాత్రం ఎందుకు కాదంటే…? దానికీ ఒక కారణం ఉంది….

బెల్లంపల్లిలో ఏది జరిగినా సంచలనమే… అనే నానుడి ఉంది… అది అక్షర సత్యం కూడా. మూడు రోజుల కిందట బెల్లంపల్లి వన్ టౌన్కు చెందిన పోలీసులు ఓ ప్రైవేటు ఫాం హౌస్లో రెయిన్ డ్యాన్స్ చేశారు. మందు తాగుతూ, చిందేశారు. ఇంత వరకు బాగానే ఉంది. అయితే, వారు తమ విధులు మరిచి మరీ డాన్స్లు చేశారని, ఇది దారుణమంటూ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది… మరి ఇంత జరిగాక మీడియా ఊరుకుంటుందా…? ఉతికి ఆరేశారు.. మీడియాలో వరుస కథనాలు రావడంతో పోలీస్ బాస్ సైతం ఫైర్ అవ్వడం కొందరిని కమిషనరేటు అటాచ్ చేయడం.. మరికొందరిపై చర్యలు తీసుకోవడం చకచకా జరిగిపోయాయి…

గత ఏడాది ఆగస్టులో కూడా బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ పీఏ ప్రసాద్ నడిరోడ్డుపై డ్యాన్స్ చేయడం కలకలం సృష్టించింది. ఆయన రోడ్డుపై మాస్, డిస్కో స్టెప్పులు చేస్తూ హల్చల్ చేశారు. ఈ వీడియో కూడా తెగ వైరల్ |అయ్యింది.. ఇది కూడా వివాదాస్పదం అయ్యింది. ఒక బాధ్యాతాయుతమైన పదవిలో వ్యక్తి బహిరంగ ప్రదేశంలో నడిరోడ్డుపై డాన్స్ చేయడం ఏమిటని పలువురు దుయ్యబట్టారు. అతనిపై ఎమ్మెల్యే చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్లు కూడా వినిపించాయి. అయితే, ఎమ్మెల్యే గడ్డం వినోద్కు ప్రసాద్కు ఉన్న సాన్నిహిత్యంతో అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు..

ఈ రెండు ఘటనల్లో అసలు వీడియోలు ఎలా బయటకు వచ్చాయనే దానిపై విచారణ జరగడం గమనార్హం. ఎమ్మెల్యే పీఏకు సంబంధించిన ఘటనలో వేరే పార్టీకి చెందిన వారే వాటిని వైరల్ చేశారనే ప్రచారం సాగింది. మరోవైపు పోలీసుల పార్టీకి సంబంధించి ఎవరు లీక్ చేశారనేది తెలియడం లేదు. కొందరు గిట్టని వారే వైరల్ చేశారని కొందరు చెబుతుండగా, ఆ పార్టీలో పాల్గొన్నవారే స్టేటస్ పెట్టుకున్నారని అది కాస్తా వైరల్ అయ్యిందనే కొందరు చెబుతున్నారు…

ఏది ఏమైనా ఈ డీజే స్టెప్పులు బెల్లంపల్లి వాళ్లకు అచ్చిరావడం లేదు. ఇక నుంచి ఏదైనా పార్టీ చేసుకుంటే అక్కడికి సెల్ఫోన్లకు అనుమతి లేదని బోర్డులు పెట్టాల్సి వస్తుందేమో చూడాలి మరి

You might also like