గంట దావత్‌కే సస్పెన్షన్‌.. మరి కేసీఆర్ సంగతేంటి?

మాజీ సీఎం కేసీఆర్ టార్గెట్ గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి విరుచుకుపడ్డారు. సిద్దిపేటలో జరిగిన బహిరంగ సభలో కేసీఆర్ ఫాంహౌస్ బసపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా బెల్లంపల్లి వన్ టౌన్ పోలీసుల సస్పెన్షన్ ఘటనను ఉదహరిస్తూ.. గులాబీ బాస్ తీరుపై తీవ్ర స్థాయిలో సెటైర్లు వేశారు. డ్యూటీలో ఉండి గంటసేపు దావత్ చేసుకున్న పోలీసులను సస్పెండ్ చేస్తే.. ఎమ్మెల్యేగా గెలిచి ఏళ్ల తరబడి ఫాంహౌస్‌కే పరిమితమైన కేసీఆర్‌పై ఎలాంటి చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.

బెల్లంపల్లి వన్ టౌన్ పోలీసులు విధుల్లో ఉండి ఫాంహౌస్‌లో బర్త్‌డే పార్టీ చేసుకోవడం, ఆ తర్వాత ఉన్నతాధికారులు వారిపై సస్పెన్షన్ వేటు వేయడంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఈ విషయంలో తమ అధికారులు తీసుకున్న చర్యలు సరైనవేనని, వారు చేసింది వందశాతం కరెక్టేనని సీఎం స్పష్టం చేశారు. రికార్డుల్లో సంతకాలు పెట్టి, విధులకు డుమ్మా కొట్టి ఫాంహౌస్‌కు పోయి డ్యాన్సులు వేసినందుకే వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకున్నారని గుర్తుచేశారు.

అయితే, ఇదే క్రమంలో మాజీ సీఎం కేసీఆర్‌ను టార్గెట్ చేస్తూ రేవంత్ రెడ్డి విమర్శనాస్త్రాలు సంధించారు. కేవలం ఒక్కరోజు.. అది కూడా ఒక గంట సేపు ఫాంహౌస్‌లో పార్టీ చేసుకుంటేనే పోలీసులపై వేటు పడిందని, మరి అసెంబ్లీలో ఎమ్మెల్యేగా సంతకం పెట్టి మూడేండ్ల నుంచి ఫాంహౌస్‌లోనే దావత్ చేసుకుంటున్న కేసీఆర్‌ను ఏం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడాన్ని, ప్రజా సమస్యలను గాలికి వదిలేసి ఫాంహౌస్‌కే పరిమితం అవ్వడాన్ని ఎండగడుతూ సీఎం చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.

You might also like