కూతురు ప్రేమించిందని పరువు హత్య
“ఉదయం లేచి చూసేసరికి కూతురు ఉరికి వేలాడుతూ కనిపించింది.. పెళ్లి ఇష్టం లేక ఆత్మహత్య చేసుకుందని తండ్రి కన్నీరుమున్నీరయ్యాడు. అందరూ నిజమే అనుకున్నారు. కానీ.. మృతి చెందిన నాలుగు గంటల్లోపే అంత్యక్రియలు పూర్తి చేయడం, సంప్రదాయానికి విరుద్ధంగా దహనం చేయడం పోలీసుల్లో అనుమానం రేపింది. ఆరా తీస్తే.. కన్నతండ్రే కిరాతకుడని తేలింది. ఆదిలాబాద్ జిల్లా ఉమ్రిలో జరిగిన ఈ పరువు హత్య వెనుక అసలు నిజాలేంటంటే”…
ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం ఉమ్రిలో పరువు హత్య కలకలం సృష్టించింది. నిశ్చితార్థం జరగాల్సిన ఆ ఇంట్లో విషాదం నెలకొంది. ప్రేమ వ్యవహారమే ఈ దారుణానికి కారణమని పోలీసులు నిర్ధారించారు. ఉమ్రి గ్రామానికి చెందిన అడే కైలాస్ – సుమిత్ర దంపతుల కుమార్తె కళ్యాణి (18)కి ఈ నెల 25న నార్నూర్కు చెందిన యువకుడితో నిశ్చితార్థం జరగాల్సి ఉంది. అయితే ఈ నెల 23న ఉదయం తల్లిదండ్రులతో పాటు కళ్యాణి, మరో బాలుడు కలిసి పత్తి ఏరేందుకు చేనులోకి వెళ్లారు. కొద్దిసేపటికే కడుపునొప్పిగా ఉందని కళ్యాణి ఇంటికి తిరిగి వచ్చింది.
సాయంత్రం ఇంటికి వచ్చిన తల్లిదండ్రులు కళ్యాణి దిగులుగా ఉండటాన్ని గమనించి ప్రశ్నించారు. తండ్రి కైలాస్ గట్టిగా నిలదీయడంతో, తనకు ప్రేమ సంబంధం ఉన్నట్లు కళ్యాణి చెప్పింది. దీంతో ఆగ్రహించిన తండ్రి.. మంగళవారం వేకువజామున సుమారు 3 గంటల సమయంలో అందరూ నిద్రించిన తర్వాత కూతురి గదిలోకి వెళ్లి గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం విషయం బయటపడకుండా ఉండేందుకు మృతదేహాన్ని మరో గదిలోకి తీసుకెళ్లి, చున్నీతో ఉరేసుకున్నట్లు చిత్రీకరించాడు.
ఉదయం 5 గంటలకు నిద్రలేచిన తల్లి.. కూతురు విగతజీవిగా వేలాడుతూ కనిపించడంతో కేకలు వేసింది. చుట్టుపక్కల వారు చేరుకుని తొలుత ఆత్మహత్యగా భావించారు. అయితే మృతి చెందిన కొన్ని గంటల్లోనే హడావిడిగా అంత్యక్రియలు పూర్తి చేయడం పలు అనుమానాలకు దారితీసింది. సంప్రదాయం ప్రకారం పెళ్లికాని యువతి మరణిస్తే ఖననం చేయాల్సి ఉండగా, దహనం చేయడంపై స్థానికంగా చర్చ మొదలైంది.
అనుమానాస్పద మృతిపై సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తండ్రి కైలాస్ను అదుపులోకి తీసుకుని విచారించగా.. పరువు పోతుందనే కారణంతో తానే కూతురిని హత్య చేసినట్లు అంగీకరించినట్లు సీఐ తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.