దూసుకెళ్తోంది..

-బొగ్గు రవాణాలో 40 శాతం వృద్ధి
-ఉత్ప‌త్తిలో 33 శాతం వృద్ది
-ఓబీ వెలికితీత‌లో 20 శాతం వృద్ది
-విద్యుత్‌ టర్నోవర్‌ లో 19 శాతం వృద్ధి
-సింగరేణి సోలార్‌ ద్వారా ఇప్పటికి 239 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ ఉత్పత్తి
-ఇదే స్ఫూర్తితో ప‌నిచేస్తూ ముందుకు వెళ్దాం : సీఅండ్ఎండీ శ్రీ‌ధ‌ర్‌

సింగ‌రేణి ప్ర‌తినిధి : ఈ ఆర్థిక సంవత్సరంలో సింగరేణి అద్భుత ప్ర‌గ‌తితో దూసుకువెళ్తోంది. గతేడాది తో పోల్చి చూస్తే ఫిబ్రవరి నెలాఖరు నాటికి గణనీయమైన వృద్ధి సాధించింది. గతేడాది ఫిబ్రవరి నాటికి 425 లక్షల టన్నుల బొగ్గు రవాణా చేసిన సింగరేణి ఈ ఏడాది 40 శాతం వృద్ధి తో 595 లక్షల టన్నుల బొగ్గు రవాణా చేసింది. గతేడాది ఫిబ్రవరి నాటికి సింగరేణి 442 టన్నుల బొగ్గు మాత్రమే ఉత్పత్తి చేయగా ఈ ఏడాది అదే కాలానికి 33 శాతం వృద్ధితో 586 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించింది. ఓవర్‌ బర్డెన్‌ వెలికితీతలో కూడా కంపెనీ గతేడాది సాధించిన 288 లక్షల క్యూబిక్‌ మీటర్ల ఓబీపై 20 శాతం వృద్ధి తో 346 లక్షల క్యూబిక్‌ మీటర్ల ఓవర్‌ బర్డెన్ తొలగించింది.

ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేందుకు నెల రోజుల సమయం ఉన్న నేపథ్యంలో అన్ని ఏరియాలు బొగ్గు ఉత్పత్తి, రవాణా లో పోటాపోటీగా తమ సత్తా చాటుతున్నాయి. గత ఏడాదితో పోల్చితే భారీ యంత్రాల‌ వినియోగం, ఓఎంఎస్‌ కూడా గణనీయంగా పెరిగింది. ఈ సందర్భంగా సీఅండ్‌ఎండీ ఎన్‌.శ్రీధర్‌ ఒక ప్రకటన విడుద‌ల చేశారు. సింగరేణి కార్మికులందరూ నిర్దేశిత లక్ష్యాలు సాధించడానికి మంచి ఉత్పాదకత, భద్రత, నాణ్యత పాటిస్తూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

సింగరేణి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం కూడా మంచి వృద్ధి రేటు నమోదు చేసింది. ఫిబ్రవరి మాసాంతానికి గతేడాది 6,703 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ ను ఉత్పత్తి చేసిన ఎస్టీపీపీ 26 శాతం వృద్ధి తో 8,459 మిలియన్‌ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేసింది. గత ఏడాది ఫిబ్రవరి నాటికి 2,964 కోట్ల రూపాయల విద్యుత్‌ అమ్మకాలు జరప‌గా, 19 శాతం వృద్ధి తో ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి 3,523 కోట్ల రూపాయల విద్యుత్‌ అమ్మకాలు జరిపింది. కాగా, సింగరేణి వ్యాప్తంగా 8 చోట్ల ఏర్పాటు చేసిన సింగరేణి సోలార్‌ ప్లాంట్ల ద్వారా ఇప్పటి వరకు 239 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ ను ఉత్పత్తి చేశారు.

దీనిపై సీఅండ్‌ఎండీ ఎన్‌.శ్రీధర్‌ సింగరేణి విద్యుత్‌ సంస్థల పనితీరుపై హర్షం వ్యక్తం చేశారు. ఇదే విధంగా పని చేస్తూ మరింత వృద్ధిని సాధించాలని పిలుపునిచ్చారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like