దేవాదాయ శాఖలో కొత్త శకం..
Telangana Endowments Department:తెలంగాణ దేవాదాయ శాఖ చరిత్రలో తొలిసారిగా భారీ స్థాయిలో ఉద్యోగాల నియామకాలు చేపట్టింది. హైదరాబాద్‌లోని రవీంద్రభారతి వేదికగా నిర్వహించిన కార్యక్రమంలో దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha) 191 మంది ఉద్యోగులకు నియామక ఉత్తర్వులు అందజేశారు. రాష్ట్రవ్యాప్తంగా 47 దేవాలయాలకు ఎంపికైన అర్చకులు, వేదపండితులు పలు విభాగాలకు చెందిన సిబ్బంది నియామకాలు చేపట్టారు. తెలంగాణ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనూ ఇంత పెద్ద ఎత్తున దేవాదాయ శాఖలో ఉద్యోగ నియామకాలు జరగడం ఇదే తొలిసారి అని మంత్రి తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ, దేవాలయ ఉద్యోగం అనేది కేవలం ఉపాధి కాదని, భగవంతునికి సేవ చేసే పవిత్ర బాధ్యత అని అన్నారు. “భక్తసేవే భగవత్సేవ” అనే భావనతో భక్తులకు నాణ్యమైన సేవలు అందించడమే ఉద్యోగుల లక్ష్యంగా ఉండాలని సూచించారు. దేవాదాయ శాఖ చరిత్రలో నిలిచిపోయే ఈ కార్యక్రమం అధికారుల సమిష్టి కృషి ఫలితమని పేర్కొన్నారు.
అర్చకులు, ఇతర ఉద్యోగుల సంక్షేమ నిధి ట్రస్ట్ ద్వారా ఉద్యోగులకు మరిన్ని సంక్షేమ ప్రయోజనాలు అందిస్తున్నామని మంత్రి వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రధాన దేవాలయాల్లో ప్రత్యేక సందర్భాల్లో ఆధ్యాత్మిక, ధార్మిక, పురాణ ప్రవచనాలు నిర్వహించేందుకు త్వరలో ఉత్తర్వులు జారీ చేస్తామని తెలిపారు. అలాగే పనితీరు ఆధారంగా దేవాలయాల అన్ని విభాగాల ఉద్యోగులకు అవార్డులు ప్రదానం చేయనున్నట్లు ప్రకటించారు.
రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావంతో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా త్వరలో అన్ని దేవాలయాల్లో వరుణయాగాలు నిర్వహిస్తామని మంత్రి తెలిపారు. సమృద్ధిగా వర్షాలు కురిసి ప్రజలు సుభిక్షంగా ఉండాలని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్(Endowments Department Principal Secretary Shailaja Ramaiyar), డైరెక్టర్ హనుమంతరావు, ధార్మిక సలహాదారు గోవింద హరి, సిటా డైరెక్టర్ విజయ రాఘవాచార్యులు, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.