భార‌త్ బిల్లు క‌డుతోన్న పాకిస్థాన్

పహల్గామ్‌ ఉగ్రదాడి అనంతరం సింధు జలాల ఒప్పందం అమలును భారత్‌ నిలిపివేయడంతో పాటు, ఆ ఒప్పందానికి సంబంధించిన మధ్యవర్తిత్వ ప్రక్రియ కూడా బహిష్కరించింది. దీంతో శాశ్వత మధ్యవర్తిత్వ న్యాయస్థానం (PCA)లో పాకిస్థాన్‌ దాఖలు చేసిన కేసు కొనసాగించేందుకు భారత్‌ చెల్లించాల్సిన వాటా ఖర్చును కూడా పాకిస్థానే భరిస్తోంది.

సింధు జలాల ఒప్పందం ప్రకారం వివాదాల పరిష్కారానికి అయ్యే వ్యయాన్ని ఇరు దేశాలు సమానంగా భరించాలి. అయితే భారత్‌ విచారణలో పాల్గొనకపోవడంతో, కేసు నిలిచిపోకుండా ఉండేందుకు ఇస్లామాబాద్‌ తన వాటాతో పాటు భారత్‌ వాటా కూడా చెల్లిస్తోంది. ఇప్పటికే ఈ ప్రక్రియ కోసం సుమారు 6 లక్షల అమెరికన్‌ డాలర్లు (దాదాపు రూ.5.2 కోట్లు) వెచ్చించినట్లు నివేదికలు సూచిస్తున్నాయి. విచారణ కొనసాగిన కొద్దీ ఈ వ్యయం మరింత పెరిగే అవకాశం ఉంది.

ఈ వివాదం కిషన్‌గంగా, రాట్లే జలవిద్యుత్‌ ప్రాజెక్టులకు సంబంధించినది. ఈ ప్రాజెక్టులు సింధు జలాల ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్నాయని పాకిస్థాన్‌ ఆరోపిస్తూ PCAను ఆశ్రయించింది. అయితే ఇది సాంకేతిక అంశమని, ఇలాంటి వివాదాలను మధ్యవర్తిత్వ న్యాయస్థానం కాకుండా తటస్థ నిపుణుడే పరిశీలించాలని భారత్‌ మొదటి నుంచీ వాదిస్తోంది. ట్రైబ్యునల్‌ చట్టబద్ధతను కూడా భారత్‌ అంగీకరించడం లేదు.

అంతర్జాతీయ మధ్యవర్తిత్వ నిబంధనల ప్రకారం ఒక పక్షం విచారణకు హాజరు కాకపోయినా ట్రైబ్యునల్‌కు అధికార పరిధి ఉందని భావిస్తే విచారణ కొనసాగించవచ్చు. ఈ నిబంధనల ఆధారంగానే PCA పాకిస్థాన్‌ పిటిషన్‌పై విచారణను కొనసాగిస్తోంది. అయితే ఆ ట్రైబ్యునల్‌ తీర్పులను తాము గుర్తించబోమని భారత్‌ ఇప్పటికే స్పష్టం చేసింది. ఇప్పటికే తీవ్ర ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్న పాకిస్థాన్‌ ఐఎంఎఫ్‌ సహాయ ప్యాకేజీపై ఆధారపడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో మధ్యవర్తిత్వ ప్రక్రియ మొత్తం ఖర్చును ఒంటరిగా భరించాల్సి రావడం ఆ దేశంపై అదనపు ఆర్థిక భారంగా మారింది.

Get real time updates directly on you device, subscribe now.

You might also like