స‌వాళ్లు విసురుతారు. సైలెంట్ అవుతారు..

-ఒక‌రిపై ఒక‌రు ఆరోప‌ణ‌లు చేసుకుంటున్న నేత‌లు
-ఆరోప‌ణ‌ల‌కే ప‌రిమితం... నిజాలు వెల్ల‌డించ‌ని వైనం
-దూకుడు పెంచిన ప్ర‌తిప‌క్షాలు
-ఇన్నాళ్లు మౌనం.. మాట‌ల్లో వేగం
-అధికార పార్టీ నేత‌లే టార్గెట్‌
-ఆరోప‌ణ‌లు.. ప్ర‌త్యారోప‌ణ‌ల‌తో హీటెక్కుతున్న పాలిటిక్స్‌

వేస‌వి ఇంకా ప్రారంభం కాలేదు. కానీ ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లాల్లో మాత్రం రాజ‌కీయాలు హీట్ పెంచుతున్నాయి. ఉన్న‌ట్టుండి ప్ర‌తిప‌క్షాలు స్వ‌రం పెంచాయి. నేత‌లు మాట‌ల తూటాలు పేల్చుతున్నారు. అధికార పార్టీ నేత‌ల అక్ర‌మాలు, క‌బ్జాలు, భూ దందాలు, అవినీతి, అరాచ‌కాలపై పెద‌వి విప్పుతున్నారు. విమ‌ర్శ‌ల ధాటితో అధికార పార్టీ అంత‌ర్మ‌థ‌నంలోకి వెళ్లినా… న‌ష్ట నివార‌ణ‌కు కౌంట‌ర్ అటాక్ చేస్తున్నారు. ఒకచోట బీజేపీ, మ‌రోచోట కాంగ్రెస్ టీఆర్ఎస్ టార్గెట్‌గా ముందుకు సాగుతున్నాయి. పేరు మోసి నేత‌ల‌ను, తెరిచిన పుస్త‌కం అని చెప్పుకునే కితాబుల్లోని పేజీల‌ను లెక్క‌పెడుతున్నారు. అయితే కేవ‌లం ఆరోప‌ణ‌లు మాత్ర‌మే చేస్తున్న నేత‌లు వాటిని మాత్రం నిరూపించ‌డం లేదు.

నిర్మ‌ల్ జిల్లాలో మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డిపై ఏఐసీసీ కార్య‌క్ర‌మాల నిర్వ‌హ‌ణ క‌మిటీ చైర్మ‌న్ ఏలేటీ మ‌హేశ్వ‌ర్‌రెడ్డి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేస్తున్నారు. చ‌నాక కోరాట బ్యారేజీ, స‌ద‌ర్‌మాట్ ప్రాజెక్టు అర్హ‌త లేని కంట్రాక్ట‌ర్ల‌కు ఇచ్చి బినామీ పేర్ల‌తో ప్ర‌జ‌ల సొమ్ము జేబుల్లో వేసుకుంటున్నారని తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. అలాగే 1500 ఎక‌రాల భూ క‌బ్జా చేశార‌ని, ఆ చిట్టా త‌న వ‌ద్ద ఉంద‌ని ప్ర‌క‌టించారు. నిర్మ‌ల్ చెరువుల క‌బ్జాలు, మంత్రి అండ చూసుకుని రెచ్చిపోతున్న క్యాడ‌ర్ అరాచ‌కాలు, మున్సిప‌ల్ వైస్ చైర్మ‌న్ అత్యాచార ఘ‌ట‌న‌ను ఆయ‌న తెర‌పైకి తెచ్చే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. అంతేకాకుండా, జ‌డ్పీ చైర్‌ప‌ర్స‌న్ భ‌ర్త దివ్య గార్డెన్ వ‌ద్ద ప్ర‌భుత్వ భూములు క‌బ్జా చేశార‌ని ఆరోపించారు మ‌హేశ్వ‌ర్‌రెడ్డి. దీనంత‌టికీ మంత్రి రివ‌ర్స్ కౌంట‌ర్ ఇచ్చారు. నిర్మ‌ల్‌లో కాంగ్రెస్ స‌భ అట్ట‌ర్ ఫ్లాఫ్ అయ్యింద‌ని దుయ్య‌బ‌ట్టిన మంత్రి.. రెండు సార్లు జనం ఛీ కొట్టిన ఇంకా బుద్ధి రాలేద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

ఇక ఆదిలాబాద్ విష‌యానికి వ‌స్తే ఇక్క‌డ కూడా వార్ సాగుతోంది. ఎమ్మెల్యే జోగు రామ‌న్న సెకండ్ ఎపిసోడ్ ఎప్పుడు అంటూ జ‌నం ఆశ‌గా ఎదురుచూస్తున్నారు. టీఆర్ఎస్ కౌన్సిల‌ర్లు, వారి కుటుంబ స‌భ్యులు, ఎమ్మెల్యే అనుచ‌రుల బాగోతంపై క‌య్యం పెట్టిన బీజేపీ జిల్లా అధ్య‌క్షుడు పాయ‌ల శంక‌ర్ వేడి రాజేశారు. నిత్యం ఎక్క‌డో ఒక చోట టీఆర్ఎస్ నేత‌ల‌కు భూ క‌బ్జాలు, ఇల్లీగ‌ల్ దందాల‌కు సంబంధించిన అంశాల‌పై ఆరోప‌ణ‌లు చేస్తున్నారు. ఇక ఎమ్మెల్యే జోగు రామ‌న్న తానేం త‌క్కువ కాదంటూ కౌంట‌ర్ ఇస్తున్నారు. బీజేపీ కార్యాల‌యానికి ఇచ్చిన భూమిని అమ్ముకున్నావ‌ని, నువ్వు పార్టీలో ఉండేది తెలియ‌దు.. బీఎస్పీలో క‌లిసేది తెలియ‌దంటూ పాయ‌ల్ శంక‌ర్‌పై ప్ర‌తిదాడి చేశారు. ప‌ది రోజుల్లో సెకండ్ ఎపిసోడ్ ఉంటుంద‌ని ఎమ్మెల్యే మీడియా ముఖంగా ప్ర‌క‌టించారు. అయినా ఇప్ప‌టి వ‌ర‌కు ఏం చెప్ప‌లేదు. దీంతో ఈ సెకండ్ ఎపిసోడ్ ఎప్పుడు అనేది ప్ర‌జ‌లు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.

మంచిర్యాల ప‌రిస్థితి కూడా కౌంట‌ర్‌.. ఎన్‌కౌంట‌ర్‌లా కొన‌సాగుతోంది. ఇక్క‌డ మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగ‌ర్ రావు, ఎమ్మెల్యే న‌డిపెల్లి దివాక‌ర్‌రావు మ‌ధ్య మాట‌ల యుద్ధం న‌డుస్తోంది. ఎమ్మెల్యే దివాక‌ర్‌రావు పెద్ద ఎత్తున ఆస్తులు కూడ బెట్టుకున్నార‌ని ప్రేంసాగ‌ర్ దుయ్య‌బ‌ట్టారు. ఆ డ‌బ్బులు ఎక్క‌డివ‌ని ప్ర‌శ్నించారు. దానికి సంబంధించిన మొత్తం చిట్టా త‌న ఉంద‌ని స్ప‌ష్టం చేశారు. అదే స‌మ‌యంలో ప్రేంసాగ‌ర్ రావు భూ క‌బ్జా కోర‌ని, పెద్ద ఎత్తున అప్పులు చేశార‌ని ఎమ్మెల్యే కౌంట‌ర్ ఇచ్చారు. ఈ విష‌యంలో ఇద్ద‌రి మ‌ధ్య వాగ్వావాదం నేప‌థ్యంలో త‌ను చ‌ర్చ‌కు సిద్ధ‌మ‌ని స‌మ‌యం, ఎక్క‌డ చ‌ర్చ చేద్దామో..? చెప్పాల‌ని మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగ‌ర్ రావు స‌వాల్ విసిరారు.

ఇలా నేత‌లు ఒక‌రిపై ఒక‌రు ఆరోప‌ణ‌లు చేసుకుంటూ మీ చిట్టా మా వ‌ద్ద ఉంద‌ని స‌వాళ్లు విసురుతున్నారు. చ‌ర్చ‌కు సిద్ధ‌మంటూ తొడ‌లు చ‌రుస్తున్నారు. కానీ ఎవ‌రూ కూడా బ‌య‌ట‌కు రావ‌డం లేదు. ఆ చిట్టాలేవో బ‌య‌ట పెడితే తాము ఎవరికి ఓట్లు వేయాలో తేల్చుకుంటామ‌ని ప్ర‌జ‌లు ఎదురు చూస్తున్నారు.. కానీ ప్ర‌జ‌ల ఆశ‌లు నెర‌వేరేట‌ట్టు క‌నిపించ‌డం లేదు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like