నేను మోతీషా ఆత్మ‌ను మాట్లాడుతున్నా…

న‌మ‌స్తే సార్‌.. నేను గుర్తున్నానా… నాలుగు రోజుల కింద‌ట వ‌డ‌దెబ్బ‌తో చ‌నిపోయా.. నా శ‌వాన్ని సైతం తీసుకువెళ్లేందుకు అంబులెన్స్ సోద‌రుడు రూ.80 వేలు డిమాండ్ చేస్తే అన్ని డ‌బ్బులు లేక న‌న్ను అక్క‌డే వ‌దిలేసి వెళ్లాడు. నేనే మోతీషాను.. నా ఆత్మఘోష కొంచం ఓపిక చేసుకుని చ‌ద‌వండి… బ‌తికున్న వాడి గురించే ప‌ట్టించుకోవ‌డం లేదు..ఇక చ‌చ్చిన వాడి గురించి ఏం వింటామంటారా..? నా ఆత్మఘోష వింటే చాలా మంది పేద‌లు బ‌తికే అవ‌కాశం ఉంటుంది.. నాలాంటి పేద‌ల శ‌వాల‌కు గౌర‌వంగా అంత్య‌క్రియ‌లు జ‌రిగే ఆస్కారం ఉంటుంది…

మొద‌ట‌గా నేను మొర పెట్టుకునేది క‌లెక్ట‌ర‌మ్మ‌కి.. అమ్మా.. మంచిర్యాల ప్ర‌భుత్వ ఆసుప‌త్రి ద‌గ్గ‌ర అంబులెన్స్‌ల దోపిడీ చాలా దారుణంగా ఉంది. ఆసుపత్రి వద్ద ఎక్కడా కూడా అంబులెన్సుల‌కు సంబంధించి ఇంత వ‌సూలు చేయాల‌ని ధరల పట్టిక ప్రదర్శించడం లేదు. దూరాన్ని బట్టి కిరాయి ఖరారు చేసి పట్టికలను ప్రదర్శించే పక్షంలో మోసాలు కొంతవరకు అరికట్టవచ్చు. కానీ అది జ‌ర‌గ‌డం లేదు. దీంతో అంబులెన్స్ న‌డిపేవారు ఇష్టారాజ్యంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఈ వ్యవస్థలో జరిగే మోసాలకు అడ్డుకట్ట వేసే నియంత్రణ వ్యవస్థ లేదు. అధికారులు వీటి నియంత్రణకు చర్యలు తీసుకోవాల్సి ఉన్నా అమలుకు నోచుకోవడంలేదు.

పోలీసు సార్లు మీరు ప‌ట్టించుకోక‌పోతే ఖ‌చ్చితంగా నాలాంటి చాలా మంది పేదల ప్రాణాలు గాలిలో క‌లిసిపోతాయి. ఇష్టారాజ్యంగా అడ్డ‌గోలుగా దోచుకుంటున్నారు. మీరు ప‌ట్టించుకోని అంబులెన్స్ డ్రైవ‌ర్ల‌పై చ‌ర్య‌లు తీసుకోక‌పోతే వారి దోపిడి అలాగే కొన‌సాగుతుంది. వారందరినీ పిలిచి ఓ మీటింగ్ పెట్టండి. వారి సూచ‌న‌లు చేయండి. విన‌క‌పోతే చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని హెచ్చరించండి. మీరు చెబితే ఖ‌చ్చితంగా వింటారు.

అంబులెన్స్ డ్రైవ‌ర్ అన్న‌లు మీకు కూడా ఒక విన్న‌పం.. సామాన్యులు, పేద ప్ర‌జ‌ల ద‌గ్గ‌ర దోపిడీ చేసి మీరు సంపాదిస్తే అది మీకు, మీ కుటుంబానికి మంచిది కాదు. మీ పిల్ల‌ల‌కు సైతం ఏదో రూపంలో అది శాపంలా తాకుతుంది. మీకు కూడా కుటుంబం గ‌డ‌వాలి.. భార్యా, పిల్ల‌ల‌ను పోషించుకోవాలి. ఖ‌చ్చితంగా క‌ష్టానికి త‌గిన ఫ‌లితం తీసుకోవాల్సిందే. కానీ, అధికంగా వ‌సూలు చేస్తే అది మంచిది కాదు. మీరే ఆలోచించుకోండి.

ఇక చివ‌ర‌గా నా శ‌వానికి అంత్య‌క్రియ‌లు చేసి స‌గౌర‌వంగా సాగ‌నంపిన మంచిర్యాల ఆసుప‌త్రి సూప‌రిండెంట్ సార్ అర‌వింద్ గారికి, ముస్లిం ముస్లిం యూత్ వెల్ఫేర్ క‌మిటీ స‌భ్యులు సలీంఎండీ షారుఖ్, ఫిరోజ్,పర్వేజ్ ఉద్దీన్,మోషిన్,జహీర్ అన్న‌లంద‌రికీ ధ‌న్య‌వాదాలు. ప‌విత్ర రంజాన్ మాసంలో ఉప‌వాసంలో ఉండి కూడా హిందూ సంప్ర‌దాయ ప్ర‌కారం అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించిన మీ అంద‌రికీ పేరుపేరునా పాదాభివంద‌నాలు తెలుపుకుంటూ… సెల‌వు

Get real time updates directly on you device, subscribe now.

You might also like