అసంతృప్తి నిజం… రాజీనామా అబద్ధం..
-అంతర్గత విషయాలు అందరం చర్చించుకుంటామని వెల్లడి
-రాజీనామా వార్తలను ఖండించిన ఏలేటీ మహేశ్వర్‌రెడ్డి
ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్ ఏలేటీ మహేశ్వర్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ తీరు పట్ల అసంతృప్తిగా ఉన్నారు. ఏఐసీసీ కార్యక్రమాల గురించి తనకు సమాచారం ఇవ్వడం లేదని మహేశ్వర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఆయన రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్కం ఠాగూర్‌తో భేటీ అయ్యారు. అటు భేటీ కాగానే ఆయన రాజీనామా చేస్తున్నట్లు వార్తలు వెలువడ్డాయి. ఆయన పార్టీ మారుతున్నట్టుగా ప్రచారం జరిగింది. దీంతో కాంగ్రెస్ సీనియర్ నేతలు అంతా ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేశారు.
మాణిక్కం ఠాగూర్‌తో భేటీ తర్వాత మహేశ్వర్‌రెడ్డినే విలేకరులతో మాట్లాడారు. పార్టీలో చోటుచేసుకుంటున్న పరిణామాలపై అంతర్గతంగా చర్చిస్తానని తెలిపారు. తాను ఎన్నో ఏండ్లుగా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నానని, పార్టీలో క్రమశిక్షణగల సైనికుడిని అని చెప్పుకొచ్చారు. అయితే ఇంత చెప్పిన మహేశ్వర్ రెడ్డి ఆయన అసంతృప్తితో లేను అని మాత్రం చెప్పలేదు. విలేకరులు అడిగిన ప్రశ్నకు తాము కూర్చుని మాట్లాడుకుంటామని మాత్రం అన్నారు.
అయితే ఆయన రాజీనామా వార్తలను మాత్రం ఖండించారు. తాను కాంగ్రెస్‌లోనే కార్యకర్తగా కొనసాగుతానని పేర్కొన్నారు. గతంలో మహేశ్వర్ రెడ్డి పార్టీ మారతారనే ప్రచారం సాగింది. అయితే ఆ ప్రచారాన్ని మహేశ్వర్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ పార్టీలో అందరికీ స్వేచ్ఛ ఉంటుందన్నారు. పన్నుల భారం పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై భారాలు మోపుతుందని విమర్శించారు. కేంద్రం, రాష్ట్రం కూడా నిరుద్యోగులను మోసం చేస్తున్నాయని మండిపడ్డారు. ఎన్నికల హామీలను కూడా అమలు చేయడం లేదని విమర్శించారు.