మావోయిస్టుల డంప్ లభ్యం
-ధృవీకరించని ఖాకీలు
-అన్నల కోసం గాలిస్తున్న పోలీసులు
Police found the dump of Maoists: కొద్ది రోజులుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అన్నల కోసం వేట సాగుతోంది. మావోయిస్టుల సంచారం పెరిగిందని పోలీసులకు సమాచారం అందిన నేపథ్యంలో నాలుగు జిల్లాల్లోని అటవీ ప్రాంతాల్లో పోలీసులు కూంబింగ్ ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలోనే పోలీసులకు డంప్ లభ్యమైన్నట్లు సమాచారం. అయితే దీనిని పోలీసులు ధృవీకరించడం లేదు.
మావోయిస్టుల కదలికల నేపథ్యంలో ఆయా జిల్లాల పోలీసు బలగాలు అప్రమత్తం అయ్యాయి. అటవీ ప్రాంతాలపై పోలీసులు పూర్తి స్థాయిలో నిఘా పెట్టారు. ఐదురోజులుగా జల్లెడ పడుతున్నారు. పోలీసు సిబ్బందితో పాటు అదనపు బలగాలు సైతం మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో గాలిస్తున్నాయి. ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి అడవులు, మంచిర్యాలలోని ప్రాణహిత తీరంతో పాటు నిర్మల్ జిల్లా దస్తూరాబాద్, కడెం, పెంబి, ఖానాపూర్, మామడ, సారంగాపూర్ తదితర ప్రాంతాల్లో ఈ కూంబింగ్ సాగుతోంది.
ఈ నేపథ్యంలోనే ఆదిలాబాద్ జిల్లా బోథ్ అటవీ ప్రాంతంలో నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు మావోయిస్టుల డంప్ దొరికినట్లు సమాచారం. మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలోని కైలాష్ టెక్ది ప్రాంతంలో నక్సలైట్ల కదలికలు ఉన్నట్లు తెలియడంతో గురువారం ఉదయం 3 గంటల ప్రాంతంలో బోథ్ CI నైలునాయక్ పోలీసులతో కలిసి కూంబింగ్ నిర్వహించారు. ఈ క్రమంలో ఇక్కడ డంప్ లభ్యమైనట్లు తెలుస్తోంది. అయితే కేవలం గ్రనేడ్ మాత్రమే లభ్యం అయ్యిందని పోలీసు వర్గాల సమాచారం. అయితే దీనిని పోలీసులు అధికారికంగా ధృవీకరించడం లేదు. ఏది ఏమైనా బోథ్ ప్రాంతంలో అలజడితో అటవీ ప్రాంతంలో ఉన్న గ్రామాల ప్రజలు ఎప్పుడు ఏమైతుందో అని భయపడుతున్నారు