సింగరేణి లాభాల బోనస్‌గా రూ.368 కోట్లు
-2021-22లో టర్నోవర్ రూ.26,607 కోట్లు
-సంస్థ లాభాలు 1,227 కోట్లు
-30 శాతం లాభాల బోనస్‌గా ప్రకటించిన ముఖ్యమంత్రి
-అక్టోబర్ 1న కార్మికులకు చెల్లింపు
368 crore as Singareni profit bonus:
సింగరేణి 2021-22 లో రికార్డు స్థాయిలో 26,607 కోట్ల రూపాయల టర్నోవర్ ను సాధించింది. మొత్తం టర్నోవర్ పై పన్నులు విధించడానికి ముందుకు 1,722 కోట్ల రూపాయల లాభాలను ఆర్థించినట్లు సీఅండ్ ఎండి శ్రీధర్ తెలిపారు. సింగరేణి సంస్థ బొగ్గు, విద్యుత్ అమ్మకాల ద్వారా సాధించిన టర్నోవర్ పై నికర లాభాలు రూ.1,227 కోట్లుగా తెలిపారు. గత ఏడాది పన్నుల రూపంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రూ. 3,596 కోట్లను చెల్లించినట్లు వెల్లడిరచారు.
అక్టోబర్ 1న లాభాల వాటా చెల్లింపు
సింగరేణి లాభాల్లో కార్మికులకు 30 శాతం వాటాను ఇవ్వాలని ముఖ్యమంత్రి నిర్ణయించినట్లు వెల్లడిరచారు. గత ఏడాది కంటే ఒక శాతం పెంచుతూ సింగరేణి కార్మికులకు లాభాల వాటాను దసరా కానుకగా ప్రకటించిన ముఖ్యమంత్రికి ఈ సందర్భంగా కార్మికులందరి తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ ఏడాది లాభాల వాటాగా కార్మికులు రూ.368 కోట్లను అందుకోనున్నారని వివరించారు. దాదాపు 44 వేల మంది ఉద్యోగులకు లాభాల వాటాను అక్టోబర్ 1న (శనివారం) చెల్లించనున్నట్లు ప్రకటించారు.
2021-22 లో సింగరేణి సంస్థ రికార్డు స్థాయిలో 650 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి, 655 లక్షల టన్నుల రవాణా చేసిందన్నారు. సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం ద్వారా 88.08 మిలియన్ యూనిట్ల విద్యుత్ ను గ్రిడ్ కు సరఫరా చేసినట్లు వివరించారు. అలాగే ఈ ఏడాది నిర్దేశించుకున్న 70 మిలియన్ టన్నుల ఉత్పత్తి లక్ష్యానికి ప్రతీ ఒక్కరూ పునరంకితమై పనిచేయాలని పేర్కొన్నారు.
స్వరాష్ట్రంలో అద్భుత ప్రగతి
తెలంగాణా రాకపూర్వం 2013-14లో 504 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసిన కంపెనీ 2021-22 నాటికి 29శాతం వృద్ధితో 650 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసింది. 2013-14లో 479 లక్షల టన్నుల బొగ్గు రవాణా చేసిన కంపెనీ 2021-22 నాటికి 37 శాతం వృద్ధితో 655 లక్షల టన్నుల రవాణా జరిపింది. 2013-14లో 11,928 కోట్ల రూపాయలుగా ఉన్న అమ్మకాలు 123 శాతం వృద్ధితో గత ఏడాదికి 26,607 కోట్ల రూపాయలకు చేరుకున్నాయి. లాభాలు కూడా గణనీయంగా, గరిష్ఠంగా 193 శాతానికి పెరిగాయి. 2013-14లో 419 కోట్ల రూపాయల నికర లాభం సాధించగా, 2021-22 నాటికి 1,227 కోట్ల రూపాయల లాభాలను ఆర్జించగలిగింది.