రుజువు చేస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా
-అవినీతికి తావు లేకుండా పనిచేస్తున్నా
-బీజేపీ వాళ్ల కోసం పిచ్చి ఆసుపత్రులు రెడీగా ఉన్నాయి
-మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి సవాల్
Minister Indrakaran Reddy is angry with BJP leaders: తాను నిర్మల్ మున్సిపాలిటీ ఉద్యోగాల విషయంలో పీహెచ్సీ వర్కర్ల నుంచి ఒక్క రూపాయి తీసుకున్నా రాజకీయాల నుంచి తప్పుకుంటానని, మీరు నిరూపించకుంటే రాజకీయాల నుంచి తప్పుకుంటారా…? అని మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి బీజేపీ నేతలకు సవాల్ విసిరారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దమ్ముంటే డబ్బులు తీసుకున్నది ఎవరో..? పది రోజుల్లో రుజువు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలకు సేవ చేసేందుకే రాజకీయాల్లో ఉంటున్నామని ఈ సందర్భంగా వెల్లడించారు.
ఒకరిపై ఒకరు రాజకీయ విమర్శలు చేసుకోవడం సహజమే అన్నారు. కానీ గతంలో ఎన్నడూ లేనివిధంగా ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, మహిళలు, చిన్న పెద్ద, అనే తేడా లేకుండా బీజేపీ నేతలు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. నిర్మల్ సభలో సీఎం, ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటన్నారు. వారిలా మేము తిట్టదలుచుకోలేదని, మాకు సంస్కారం ఉందన్నారు.
అభివృద్ధి పై విమర్శలు చేయండి.. ఫలానా వ్యక్తికి ప్రభుత్వ పథకాలు రాలేదని చూపించండి తప్పులేదు కానీ, వ్యక్తిగత దూషణలు ఏ మేరకు సమంజసమని మంత్రి ప్రశ్నించారు. అది కూడా అన్ పార్లమెంటరీ మాటలు మాట్లాడటం వారి దిగజారుడుతనానికి పరాకాష్ట అని అల్లోల ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్మల్ లో పాదయాత్ర సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడిన భాషను ఎవరు మాట్లాడరని అన్నారు. డీ వన్ పట్టాలపై నిర్మల్ ఎమ్మార్వో శంకర్ ఉద్యోగం పోయిన విషయం మీకు తెలవదా…? అని మంత్రి ప్రశ్నించారు. ఎంపీ సోయం బాబూరావు గాల్లో మాట్లాడే వ్యక్తి అని అన్నారు.
తెలంగాణ రాష్ట్రంలోని ప్రాజెక్టులకు, దేవాలయాలకు నిధులు ఇవ్వలేదని మంత్రి గుర్తు చేశారు. ప్రతి విషయంలో తెలంగాణకు బీజేపీ అన్యాయం చేస్తోందన్నారు. ప్రాంతాల వారీగా సమస్యలు మాట్లాడాలి కానీ స్థానిక లీడర్లను తిడుతూ చప్పట్లు కొట్టించుకోవడం తప్ప పాదయాత్రలో ఏమీ లేదని ఇంద్రకరణ్‌రెడ్డి ఎద్దేవా చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నిర్మల్ కు ఏం చేశాడో చెప్పాలని ఆయన ప్రశ్నించారు.
గడిచిన ఎనిమిది సంవత్సరాల కాలంలో రాష్ట్రంలో, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, నిర్మల్ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి కండ్ల ముందు కనిపించ లేదా? అని మంత్రి అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందో ప్రజలకు తెలుసు. తెలంగాణకు బీజేపీ ఏం చేసిందో చెప్పే ధైర్యం ఆ పార్టీ నాయకులకు ఉందా?. కేంద్రంలో, రాష్ట్రంలో బీజేపీ నాయకులు తెలంగాణకు ఏం చేశారో చెప్పాలని? ఇంద్రకరణ్‌రెడ్డి నిలదీశారు. రైల్వే లైన్ ఏర్పాటు ఏమైందన్నారు. భారతీయ జనతా పార్టీకి చిత్తశుద్ధి ఉంటే కేంద్రాన్ని ఒప్పించి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజల చిరకాల వాంఛ నెరవేర్చాలన్నారు.
నిర్మల్ లో సైన్స్ సెంటర్ & ప్లానెటోరియం ఏర్పాటుకు నిధులు ఇవ్వాలని అడిగితే కేంద్రాన్ని కోరితే నిధులు ఇచ్చారా? అని మంత్రి ప్రశ్నించారు.వేలాది మందికి ఉపాది చూపే సీసీఐ పునరుద్ధరణకు ఎలాంటి సహాయసహకారాలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కేంద్రానికి ఎన్ని లేఖలు రాసిన ఉలుకుపలుకు లేదని దుయ్యబట్టారు. దక్షిణ భారతదేశంలో ఉన్న ఏకైక బాసర సరస్వతీ అమ్మవారి క్షేత్ర అభివృద్ధికి ప్రసాద్ పథకం ద్వారా నిధులు మంజూరు చేయాలని ఎన్నిసార్లు అడిగిన కేంద్రం నుంచి సమాధానం లేదన్నారు.