రేపు కాదు.. ఎల్లుండి..
-సీఎం కేసీఆర్ రేపటి కొండగట్టు పర్యటన వాయిదా
-ఎల్లుండి వెళ్లనున్న ముఖ్యమంత్రి
-భక్తుల రద్దీ దృష్ట్యా పర్యటనలో మార్పు
KCR: ముఖ్యమంత్రి కేసీఆర్ రేపటి కొండగట్టు పర్యటన వాయిదా పడింది. ఆయన మంగళవారం కాకుండా, బుధవారం వెళ్లనున్నారు. మంగళవారం కొండగట్టులో పెద్ద ఎత్తున భక్తులు ఉంటారు. ఆ రద్దీ నేపథ్యంలో ఆయన కొండకు వెళ్తే ఇబ్బందులు తలెత్తుతాయనే భావనతో పర్యటన బుధవారానికి వాయిదా వేసుకున్నారు. ఎల్లుండి కొండగట్టుకు వెళ్లనున్న సీఎం ఆలయ అభివృద్దికి సంబంధించిన పనులపై చర్చించనున్నారు. కొండగట్టు అభివృద్ధికి రూ. 100 కోట్లు ఇస్తామన్న ముఖ్యమంత్రి ఆ మేరకు జీవో సైతం జారీ చేశారు.
కొండగట్టు దేవస్థానం అభివృద్ధి, ఆలయంలో చేపట్టాల్సిన పునఃనిర్మాణ పనులపై ప్లాన్ రూపొందించేందుకు ప్రముఖ ఆర్కిటెక్ ఆనంద్ సాయి ఆదివారం కొండగట్టుకు వెళ్లారు. ఆలయ అభివృద్దిపై ఆనంద్ సాయి మాస్టర్ ప్లాన్ సిద్దం రూపొందించనున్నారు. యాదాద్రి ఆలయ పునః నిర్మాణ పనులు, ఆలయ గోపురాల డిజైన్స్ రూపొందించింది కూడా ఆనంద్‌సాయినే. 40 ఎకరాల్లో కొండగట్టు ఆలయాన్ని అత్యద్భుతంగా తీర్చిదిద్దాలని అధికారులకు సీఎం దిశానిర్దేశం చేస్తారు. సీఎం పర్యటన నేపధ్యంలో కొడిమ్యాల మండలం నాచుపల్లి జేఎన్టీయు కాలేజీలో హెలిప్యాడ్ ను సిద్ధం చేశారు. జేఎన్టీయు కాలేజీ నుంచి కొండగట్టు ఆలయానికి ముఖ్యమంత్రి రోడ్డు మార్గంలో వెళ్తారు.