కష్టాలు వింటూ.. కన్నీళ్లు తుడుస్తూ..
-దారి పొడవునా అడుగడుగున బ్రహ్మరథం
-జోరుగా సాగుతున్న భట్టి విక్రమార్క పాదయాత్ర
-కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతున్న సీఎల్పీ నేత
Bhatti Vikramarka: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కొనసాగుతున్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్రకు జనం అడుఅడుగునా జనం బ్రహ్మరథం పడుతున్నారు. భట్టి సైతం గ్రామాల్లో ప్రజల సమస్యలు వింటూ వారికి భరోసా ఇస్తూ ముందుకు సాగుతున్నారు. ఆయన పాదయాత్ర విజయవంతం అవుతుండటంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం కనిపిస్తోంది.
కాంగ్రెస్ పార్టీ అధికారమే లక్ష్యంగా పాదయాత్ర చేపట్టిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర దిగ్విజయంగా ముందుకు సాగుతోంది. ఈనెల 16న ఇచ్చోడ మండలం పిప్పిరి నుంచి మొదలైన భట్టి విక్రమార్క పాదయాత్ర మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గంలో కొనసాగుతోంది. పాదయాత్ర పొడవునా ఆయా గ్రామాల ప్రజలు, కాంగ్రెస్ శ్రేణులు తరలివచ్చి స్వాగతం పలుకుతున్నారు. ప్రజలు పాదయాత్రలో భట్టి విక్రమార్క అడుగులో అడుగులు వేస్తూ కదం తొక్కుతున్నారు.
ఇక భట్టి విక్రమార్క ప్రజలను కలిసి వారితో మాట్లాడేందుకు మొగ్గుచూపుతున్నారు. వారి సమస్యలు వింటూ వారికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పిస్తున్నారు. గ్రామాల్లో సమస్యలను వింటూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వాటిని పరిష్కరిస్తామన్న భరోసా ప్రజలకు కల్పిస్తున్నారు. గ్రామాల్లో తాగునీటి సమస్య, ఇండ్ల సమస్యలను ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సొంతింటి కల నెరవేరుస్తామని రూ. 5 లక్షలు ఇస్తామని చెబుతున్నారు.
ఇక రైతుల విషయానికి వస్తే రుణమాఫీ చేస్తామన్న బీఆర్ఎస్ ప్రభుత్వం చేయడం లేదని తాము అధికారంలోకి వచ్చిన వెంటనే రూ. 2 లక్షల వరకు ఉన్న పంటరుణాలు మాఫీ చేస్తామని బాస చేస్తున్నారు. గ్యాస్ సిలిండర్ రూ. 500 కే అందచేస్తామని మహిళలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. గిరిజనులకు సంబంధించి పోడు సమస్య సైతం పరిష్కరిస్తామని భట్టి విక్రమార్క ప్రజలకు హామీ ఇస్తున్నారు. ఇలా ప్రధాన సమస్యలు అన్నింటిని ప్రస్తావిస్తూ ముందుకు సాగుతున్న ఆయనకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు.
ఆయన యాత్ర విజయవంతం అవుతుంటంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం కనిపిస్తోంది. ఆ పార్టీకి జవసత్వాలు కల్పించడంలో సీఎల్పీ నేత పాత్రపై నాయకులు ఆనందంగా ఉన్నారు.