మంత్రిపై బీఆర్ఎస్ నేత ఫైర్
-ఆత్మీయత లేని సమ్మేళనాలకు అర్థం లేదు
-జెండా మోసిన కార్యకర్తలను పక్కన పెడుతున్నారు
-మంత్రి పదవి వెలగబెట్టి ఏం లాభం
-ఇంద్రకరణ్ రెడ్డి పై బీఆర్ఎస్ నేత శ్రీహరి రావు ఆగ్రహం
BRS leader fire on Minister Indrakaran Reddy :ఆత్మీయత లేని సమ్మేళనాలకు అర్థం లేదనీ, జెండా మోసిన కార్యకర్తలను పక్కన పెడుతున్నారనీ బీఆర్ఎస్ నేత శ్రీహరి రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి లక్ష్యంగా లేఖ విడుదల చేశారు. రెండు సార్లు కూడా ముఖ్యమంత్రి ఆశీస్సులతో కేబినెట్ మంత్రిగా అధికారం దక్కినా, పార్టీ జెండాను మోసిన కార్యకర్తలను పక్కన పెట్టారని అన్నారు. ఉద్యమకాలంలో అక్రమంగా పెట్టిన కేసుల వల్ల ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నమై అష్టకష్టాలు పడుతున్న నాయకులు, ఉద్యమ కారులను మంత్రి ఏనాడు పట్టించుకోలేదన్నారు. కనీసం తమ కష్టసుఖాలను చెప్పుకోవడానికి కూడా అవకాశం ఇవ్వలేదన్నారు. ఎన్నికలు దగ్గర పడగానే ‘ఆత్మీయ సమ్మేళనాలు అంటే సరిపోతుందా? అని ఆ లేఖలో ప్రశ్నించారు.
ఆత్మీయత తెలంగాణ ఆత్మ అని ఆత్మీయత నటించకూడదనీ, ఆచరించాలనీ హితవు పలికారు. మీరు ఒక్కరే కాదు, ప్రజల సమస్యలను పరిష్కరించాలని తపనపడే కార్యకర్తలు కూడా పార్టీకి క్షేత్రస్థాయిలో నాయకులే అని మంత్రికి స్పష్టం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నించడం పార్టీ కార్యకర్తల బాధ్యత, కార్యకర్తలు ఆ బాధ్యతను నిర్వర్తించాలంటే నాయకుడికి, కార్యకర్తలకు మధ్య నిరంతర సత్సంబంధాలు ఉండాలన్నారు. కార్యకర్తలే ఏ పార్టీకైనా మూలస్తంభాలు. ఎన్నికల ఏరు దాటగానే ‘అవసరం తీరిపోయింది. కదా’ అని కార్యకర్త అనే తెప్పను మరిచిపోవడం భావ్యం కాదు. దాని ప్రభావం తదుపరి వచ్చే ఎన్నికల మీద పడదా ? అని నిలదీశారు.
2018 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన మన పార్టీ ఆరు నెలలు తిరిగే లోపే లోక్సభ ఎన్నికల్లో నిర్మల్ నియోజకవర్గంలో మూడవ స్థానానికి పడిపోవటానికి బాధ్యులు ఎవరు? అని ఈ సందర్భంగా ప్రశ్నించారు. పార్టీ జెండా మోసిన అసలైన నాయకులు, ఉద్యమకారులకు ప్రభుత్వ నామినేటెడ్ పదవుల్లో గాని, క్షేత్ర స్థాయిలో వచ్చే వివిధ పదవుల్లో గాని అవకాశం కల్పించలేదని అవేదన వ్యక్తం చేశారు. ఏనుగు తొండాలను, తోకలను మాత్రమే నింపుతుంటే సరిపోతుందా? ‘పార్టీ కోసం పని చేసిన వారందరికి అవకాశాన్ని బట్టి ప్రాతినిధ్యం కల్పించాలి’ అన్న కేసిఆర్ ఆదేశాలను తుంగలో తొక్కారని అన్నారు. నేను, నా ఏనుగు బృందం బాగుంటే చాలు అనుకుంటే ఇంకా చెల్లదు. పార్టీ కార్యకర్తలను,నాయకులను పట్టించుకోకపోతే మీరు మంత్రి పదవి వెలగబెట్టి ఏం లాభం? అన్నారు. హోదా ఉన్నన్ని రోజులు మీరు మాత్రమే అధికారాన్ని అనుభవించి, ఎన్నికలు దగ్గరికి రాగానే కార్యకర్తల మీద ప్రేమానురాగాలను ఒలకపోస్తే, గత వలసపాలకులకు మీకూ తేడా ఏముందనీ దుయ్యబట్టారు.
ఎన్నికలప్పుడు కేసిఆర్ సందేశాన్ని గడప గడపకూ తీసుకెళ్లిన కార్యకర్తల వల్లే గెలిచామన్న సంగతిని మీరు మరవకూడదనీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి గుర్తు చేశారు. పార్టీ అభ్యర్థులు మారవచ్చు, కార్యకర్తలు-ప్రజలు శాశ్వతం అని గుర్తు పెట్టుకోవాలన్నారు. మీరు కార్యకర్తల బాధలు వినరు, కనీసం వారిని పలకరించరు. అధికారం, అవకాశం ఉండి కూడా మీరు ఎవరికీ ఏమి చేయరు. కేసీఆర్ పెద్దఎత్తున చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పక్కన పెట్టి, మీరు ఏ ఇతర అంశాల మీద ఎక్కువగా దృష్టి పెట్టారో అందరూ గమనిస్తున్నారనీ ఎద్దేవా చేశారు. ఎన్నికలు దగ్గర పడగానే ఇప్పుడు ఆత్మీయ సమ్మేళనాలు అంటున్నారు. ఆత్మీయత అనేది మీ గుండెలో లేదు, మీ నాయకత్వంలో నిజాయితీ లేదనీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ ఆత్మీయ సమ్మేళనాలు ఎన్నికల మేళాలే తప్ప ఇంకేమీ కావనీ దుయ్యబట్టారు. కృత్రిమ ఆత్మీయత పులుముకొని, ఒక్కసారి అలుముకోగానే’అన్న మారిపోయాడురా’ అనుకునేంత అమాయకులు ఇక్కడ ఎవరూ లేరనీ అన్నారు. ఇది ఆత్మాభిమానపు కోటలు కట్టుకున్న నిర్మల్ గడ్డ అని గుర్తు చేశారు. ఇక్కడ ఉన్నది ఉద్యమకారులు, నిలువెల్లా పౌరుషం నిండిన తెలంగాణ బిడ్డలు అని మరువ వద్దన్నారు. చరిత్ర ఎందరినో మోసింది, ఎన్నిటినో చూసింది, జాతకాలను తిరగరాసింది, కాగల కార్యం తానే తీర్చిందన్నారు. చరిత్ర ఎవరినీ వదిలిపెట్టదు. చరిత్రకు ఎవరూ అతీతులు కారన్నారు. చీకటి పోయి వెలుతురు రావడం పాతనీరు పోయి కొత్తనీరు రావడం అనివార్యమన్నారు. ప్రవాహం ప్రకృతి ధర్మం..కార్యకర్తలే మూలం ప్రజలే మన బలం అంటూ శ్రీహరిరావు ఆ లేఖలో పేర్కొన్నారు.