అతివలకు అమ్మ‌గా సఖి

వేధింపులకు గురైన మహిళలకు సహాయం - 24 గంటలపాటు సేవలు - అందుబాటులో టోల్‌ఫ్రీ నంబర్‌ 181

అతివల పాలిట అమ్మగా మారింది సఖి కేంద్రం. మహిళలకు రక్షణ కల్పించే కవచంలా పని చేస్తోంది. హింస, వేధింపుల నుంచి బయట పడేలా భరోసా కల్పిస్తోంది. లైంగిక వేధింపులకు గురైన బాలికలు, యువతులకు అండగా నిలిచి… వారిలో మనో ధైర్యాన్ని నింపి కొత్త జీవితం ప్రారంభించేలా సాయపడుతోంది. మానసిక స్థితి సరిగ్గా లేని మహిళలకు వైద్యం సాయంలో తోడుగా ఉంటోంది.

మారిన కాల పరిస్థితులు… ఊసే లేకుండా పోయిన ఉమ్మడి కుటుంబాల నేపథ్యంలో కాపురాలు గాల్లో దీపంలా మారుతున్నాయి. చిన్న చిన్న అంశాలకే విడిపోయే దాకా తెచ్చుకుంటున్నారు. కేవలం భార్యభర్తలకే కాదు లైంగిక వేధింపులకు గురైన మహిళలు, బాలికలు బయటకి చెబితే పరువు పోతుందేమోనని లోలోన కుమిలి పోతుంటారు. ఇలాంటి వారందరికీ పరిష్కార కేంద్రంగా నిలుస్తోంది సఖి కేంద్రం. మహిళలకు ఎదురయ్యే అన్ని రకాల సమస్యలను పరిష్కరించే వేదికగా నిలుస్తోంది. అమ్మలా అండగా నిలుస్తోన్న మంచిర్యాల‌ సఖి కేంద్రంపై నాంది ప్ర‌త్యేక క‌థ‌నం…

నిత్యం ఎక్కడో ఒకచోట మహిళలు, యువతులపై దాడులు, వేధింపులు, గృహహింస, అత్యాచారం, హత్యలు జరుగుతూనే ఉన్నాయి. మహిళలపై జరుగుతున్న అరాచకాలను అరికట్టేందుకు ‘సఖి’ సహాయాన్ని అందిస్తూ అండగా నిలుస్తోంది. మహిళా చట్టాలపై అవగాహన కల్పించడంతో పాటు గ్రామాల వారీగా కమిటీలను ఏర్పాటు చేసి వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపుతోంది. తమపై దాడులు జరుగుతున్నా బయటకు చెప్పుకోలేనివారు సఖి కేంద్రానికి సమాచారం అందిస్తే వారి వివరాలను గోప్యంగా ఉంచి సహాయాన్ని అందిస్తోంది. మహిళల్లో మనోధైర్యం పెంపొందించేలా చర్యలు తీసుకోవడంతో పాటు న్యాయ సలహాలు, పోలీసు, వైద్యసహాయం అందిస్తున్నారు.

 

2019లో సఖి కేంద్రం ఏర్పాటు..

మహిళలకు అండగా నిలిచేందుకు మంచిర్యాల జిల్లా కేంద్రంలో 2019 ఏప్రిల్ 1న సఖి కేంద్రాన్ని ప్రారంభించారు. పోకిరీల ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు షీ టీమ్‌తో పాటు ప్ర‌భుత్వం సఖి ద్వారా కూడా సేవలు అందిస్తోంది. చిన్నపిల్లల నుంచి పండు ముసళ్ల వరకు సఖి కేంద్రం సమస్య పరిష్కరిస్తోంది. అత్తామామలు, భార్యాభర్తల గొడవలు, యువతుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తోంది. ఐదురోజుల పాటు ఆశ్రయం కూడా కల్పిస్తోంది. లైంగిక వేధింపులు, గృహ హింస, బాల్య వివాహాలు, ఆడపిల్లల అమ్మకం, పనిచేసే చోట వేధింపులు, తదితర సమస్యలతో బాధపడుతున్న వారికి న్యాయం జరిగేలా చేస్తోంది.

 

ఉమెన్‌ హెల్ప్‌లైన్‌ నంబర్‌ 181

వేధింపులకు గురవుతున్న మహిళలకు న్యాయం చేసేందుకు సఖి కేంద్రం సేవలు అందిస్తోంది. అందులో భాగంగానే ఉమెన్‌ హెల్ప్‌లైన్‌ పేరిట టోల్‌ఫ్రీ నంబర్‌ 181 ఏర్పాటు చేసింది. ఇబ్బందులు పడుతున్న మహిళలు టోల్‌ఫ్రీ నంబర్‌ 181కు సమాచారం అందిస్తే సహాయం అందిస్తోంది. ఎవరైనా అక్కడినుంచి రాలేని పరిస్థితిలో ఉంటే వారికోసం ప్రత్యేకంగా వాహనం ఏర్పాటు చేసి కేంద్రానికి తీసుకువస్తారు. 24 గంటల పాటు ఈ కేంద్రంలో సిబ్బంది అందుబాటులో ఉంటారు.

 

కేసుల పరిష్కారంలో ముందంజ..

2019 ఏప్రిల్ 1 నుంచి ఇప్పటివరకు 703 కేసులు నమోదయ్యాయి. వీటిలో 594 కేసులను పరిష్కరించగా 109 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. 533 మందికి కౌన్సెలింగ్‌ నిర్వహించారు. 120 మందికి న్యాయసేవ, 75 మందికి వైద్య సహాయం, 40 మందికి పోలీసు సహాయం అందించారు. 190 మందికి షెల్ట‌ర్ ఇచ్చారు. ఇందులో కోర్టు కేసుల‌కు సంబంధించి ఆరు న‌మోదు చేశారు. వెల్‌క‌మ్ కిట్లు సైతం 43 అందించారు. పెద్ద ఎత్తున అవగాహన కల్పించినట్లు సఖి కేంద్రం నిర్వాహకులు అజ్మీర శ్రీ‌ల‌త వెల్ల‌డించారు.

 

విస్తృతంగా ప్రచారం

సఖీ కేంద్రం సభ్యులు అందిస్తున్న సేవలపై జిల్లాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. కళాశాలలు, పాఠశాలలు, గ్రామాలు, అంగన్‌వాడీ కేంద్రాలు, మహిళా సమైక్య సంఘాల సభ్యులకు మహిళా చట్టాలపై అవగాహన కల్పిస్తూ మహిళలను చైతన్యం చేస్తున్నారు. గ్రామాల్లో వాల్‌పోస్టర్లు, కరపత్రాల ద్వారా ప్రచారం చేస్తున్నారు. మహిళలకు తమ హక్కులతో పాటు తమను తాము ఏవిధంగా రక్షించుకోవాలనే అంశాల గురించి వివరిస్తున్నారు. అయితే ఈ ప్ర‌చారం మ‌రింత‌గా సాగితే చాలా మంది మ‌హిళ‌ల‌కు ఉప‌యోగంగా ఉంటుంద‌ని ప‌లువురు చెబుతున్నారు.

 

  • సద్వినియోగం చేసుకోవాలి
    ఇబ్బందుల్లో ఉన్న మ‌హిళ‌ల‌కు స‌ఖి కేంద్రం ద్వారా ర‌క్ష‌ణ క‌ల్పిస్తున్నాం. దాడులకు గురైన వారికి ఉచితంగా న్యాయ సలహాలు, పోలీసు, వైద్యసహాయం అందిస్తున్నాం. బాధితుల‌కు ఆశ్ర‌యం క‌ల్పించి వారి స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించి పంపిస్తున్నాం. మారుతున్న ప‌రిస్థితుల‌కు అనుగుణంగా ప్ర‌జ‌ల్లో చైత‌న్యం తెచ్చేలా కార్య‌క్ర‌మాలు రూపొందిస్తున్నాం. బాధితులను తీసుకురావడానికి ఒక వాహనం కూడా ఏర్పాటు చేశాం. వేధింపులకు గురవుతున్న మహిళలు, యువతులు సఖి కేంద్రం సేవలను సద్వినియోగం చేసుకోవాలి.
    – అజ్మీర శ్రీ‌ల‌త‌, సీఏ స‌ఖి సెంట‌ర్‌, మంచిర్యాల

Get real time updates directly on you device, subscribe now.

You might also like