భ‌విష్య‌త్తు భ‌యాన‌కం..

సింగ‌రేణిపై బ‌కాయిల బండ‌ - రూ. 15 వేల కోట్ల మేర బొగ్గు, విద్యుత్తు బిల్లులు - చెల్లింపులు చేయ‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం -  బ్యాంకుల చుట్టు తిరుగుతున్న అధికారులు

మంచిర్యాల – సింగ‌రేణి సంస్థ భ‌విష్య‌త్ ప్ర‌మాదంలో ప‌డింది. వేల కోట్ల బ‌కాయిలు చెల్లించాల్సి సంస్థ‌లు వాటిని ప‌ట్టించుకోవ‌డం లేదు. ముఖ్యంగా తెలంగాణ ప్ర‌భుత్వం చెల్లించాల్సి బ‌కాయిలు చెల్లించ‌డం లేదు. అది సంస్థ‌కు గుదిబండ‌గా మారుతోంది. దీంతో సంస్థ కుదేల‌య్యే ప‌రిస్థితికి చేరుకుంది. ప్ర‌తి నెలా చెల్లింపుల కోసం అధికారులు బ్యాంకుల చుట్టూ దేహీ అని తిర‌గాల్సిన ప‌రిస్థితి నెల‌కొంది. దీనిపై స్పందించాల్సిన కార్మిక సంఘాలు క‌నీసం నోరు మెద‌ప‌డం లేదు.

రాష్ట్రంలో అతిపెద్ద ప్రభుత్వరంగ సంస్థ సింగరేణి క్రమంగా ఆర్థిక‌ సంక్షోభంలో కూరుకుపోతోంది. రెండు దశాబ్దాలుగా లాభాలు తప్ప నష్టాలు ఎరగని ఈ కంపెనీపై కొన్నేళ్లుగా బకాయిల భారం పెరిగిపోతోంది. తెలంగాణ జెన్ కో, ట్రాన్స్ కో నుంచి ఏకంగా 15 వేల కోట్లకు పైగా రావాల్సి ఉంది. సింగ‌రేణి సంస్థ బొగ్గుతో పాటు విద్యుత్ ఉత్ప‌త్తి చేస్తోంది. బొగ్గును వివిధ రాష్ట్రల విద్యుత్తు కేంద్రాల‌తో పాటు రాష్ట్రనికి చెందిన తెలంగాణ జెన్‌కోకు కూడా స‌ర‌ఫ‌రా చేస్తోంది. అదే విధంగా విద్యుత్ ను రాష్ట్ర గ్రిడ్‌కు అనుసంధానం చేస్తోంది. వీటికి డ‌బ్బులు చెల్లించాల్సిన ఆయా సంస్థ‌లు వాయిదాలు వేస్తూ వ‌స్తున్నాయి. ఈ క్ర‌మంలోనే పెద్ద ఎత్తున బ‌కాయిలు పేరుకుపోయాయి. దీనిని రాష్ట్ర ప్ర‌భుత్వం ఏ మాత్రం ప‌ట్టించుకోవ‌డం లేదు. మూడేండ్లుగా సంస్థ ఆర్థిక‌ పరిస్థితి అంతకంతకూ దిగజారుతోంది.

 

పేరుకుపోతున్న బకాయిలు..

సింగరేణి ఏటా 60 మిలియన్ల ట‌న్నులకు పైగా బొగ్గు ఉత్పత్తి చేస్తోంది. ఎన్టీపీసీ పాటు వివిధ రాష్ట్రాల్లోని థర్మల్ పవర్ స్టేషన్ల‌కు ఈ బొగ్గు స‌ర‌ఫ‌రా చేస్తోంది. ఇందులో 17 నుంచి 20 మిలియన్ టన్నుల బొగ్గు కేవలం తెలంగాణ జెన్ కోకు అందిస్తోంది. తాను కూడా సొంతంగా జైపూర్ పవర్ ప్లాంట్ ద్వారా విద్యుత్‌ ఉత్పత్తి చేసి రాష్ట్ర గ్రిడ్ కు సరఫరా చేస్తోంది. సంస్థ నుంచి బొగ్గు కొనుగోళ్ల‌కు సంబంధించి తెలంగాణ జెన్కో నుంచి దాదాపు రూ. 4 వేల‌ కోట్లు, పవర్ కొనుగోళ్ల‌కు సంబంధించి తెలంగాణ ట్రాన్స్ కో నుంచి రూ. 6 వేల‌ కోట్ల మేర‌కు సింగ‌రేణికి రావాల్సి ఉంది. ఇక ఏపీ జెన్ కో రూ . 600 కోట్లు బకాయి పడింది. ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లోని విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాల నుంచి ఏకంగా రూ. వెయ్యి కోట్లకు పైగా రావాల్సి ఉంది. సింగరేణి బొగ్గుపై ఆధారపడి సౌత్ ఇండియాలో నాలుగు వేలకు పైగా చిన్న, పెద్ద ప‌రిశ్ర‌మ‌లు నడుస్తున్నాయి. మొత్తంగా సంస్థకు రూ.15 వేల కోట్ల వరకు బకాయిలు రావాల్సి ఉందని అధికారులే చెబుతున్నారు. అదే స‌మ‌యంలో జైపూర్లోని సింగరేణి థర్మల్ ప‌వ‌ర్ ప్లాంట్ లో కొత్త యూనిట్ల ఏర్పాటు కోసం సంస్థ ఏకంగా రూ. 800 కోట్ల అప్పు చేసింది. ఇందుకోసం 12శాతం వడ్డీ కడుతోంది.

 

చెల్లించే పన్నులు మాత్రం యథాతథం..

బకాయిల పరిస్థితి ఇలా ఉంటే సింగరేణి నుంచి రావాల్సిన పన్నులను మాత్రం వార్షిక సంవ‌త్స‌రం రాక ముందే ప్రభుత్వాలు రాబట్టుకుంటున్నాయి. పన్నులు, డివెడెంట్లు, రాయల్టీల రూపంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సింగరేణి ప్రతి ఏటా రూ.7 వేల కోట్లకు పైగా చెల్లిస్తోంది. గడిచిన ఐదేళ్ల కాలంలో రాష్ట్ర సర్కారుకు రూ.14 వేల‌ కోట్లు, కేంద్ర ప్రభుత్వానికి రూ.16 వేల‌ కోట్లు చెల్లించింది. ప్రాజెక్టు ప్రభావిత ప్రాంతాల అభివృద్ది కోసం ‘డిస్ట్రిక్ట్‌ మినరల్‌ ఫండ్’కింద మూడేళ్ల కాలంలో రూ . 2 వేల కోట్ల వ‌ర‌కు సింగరేణి చెల్లించింది. కోల్ బెల్ట్ ప‌రిధిలోని ఎమ్మెల్యేలకు ఏటా రూ.2 కోట్లనిధులు అందజేస్తోంది. కొద్ది రోజుల కింద‌ట‌ సీఎం సహాయనిధికి రూ.40 కోట్ల విరాళం అందించింది.

 

బ్యాంకుల చుట్టూ తిరుగుతున్న అధికారులు..

సింగరేణి సంస్థకు కార్మికులు, ఉద్యోగుల వేతనాలు చెల్లించేందుకు ప్రతినెలా రూ.250 కోట్లు అవసరం. పన్నులు, లెవీలు, కోల్ తవ్వకాలకు అవసరమయ్యే ముడి సరుకులకు, యంత్రాలు సరఫరా చేసే సంస్థలకు, ఓపెన్ కాస్టు గనుల్లో ఓబీ పనులు చేసే కాంట్రాక్ట‌ర్ల‌కు ఎప్పటికప్పుడు చెల్లింపులు చేయాలి. కానీ ఆర్థిక‌ ఇబ్బందుల నేపథ్యంలో తాజాగా ఉద్యోగులకు వేతనాలు చెల్లించలేని పరిస్థితి నెలకొంది. దీని కోసం సింగ‌రేణి బ్యాంకుల చుట్టూ తిర‌గాల్సిన దుస్థితి. వ‌డ్డీ ఎవ‌రు త‌క్కువ‌కు ఇస్తే వారి ద‌గ్గ‌ర నుంచి డ‌బ్బులు తీసుకుంటామ‌ని సీఅండ్ఎండీ శ్రీ‌ధ‌ర్ ప్ర‌క‌ట‌న సైతం విడుద‌ల చేశారు. అంటే అటు రావాల్సిన బ‌కాయిలు ప‌క్క‌న పెట్టి ఇటు అప్పుల కోసం తిర‌గాల్సిన దుస్థితి కేవ‌లం ఈ సంస్థ‌లోనే ఉంద‌ని కార్మికులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

 

ఖాయిలా దిశ‌గా సింగ‌రేణి..
గ‌తంలో సింగ‌రేణి గ‌తంలో బీఐఎఫ్ఆర్ ప‌రిధిలోకి వెళ్లింది. 1989-97 సంవత్సరం నాటికి సింగరేణి సంస్థ ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారి బీఐఎఫ్‌ఆర్‌ పరిధికి వెళ్లింది. 1996-97 నాటికి సంస్థ 1200 కోట్ల నష్టాల్లో కూరుకుపోయింది. అయితే కార్మికుల త‌మ సంస్థ‌ను కాపాడుకోవాల‌ని చేసిన కృషి వ‌ల్ల తిరిగి లాభాల ప‌ట్టింది. దేశ చ‌రిత్ర‌లోనే బీఐఎఫ్ఆర్ ప‌రిధిలోకి వెళ్లిన సంస్థ సింగ‌రేణి ఒక్క‌టే కావ‌డం గ‌మ‌నార్హం. ఇలా ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్న సంస్థ తిరిగి ఖాయిలా బాట ప‌ట్టే ప్ర‌మాదం ఉంద‌ని కార్మికులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఇంత జ‌రుగుతున్నా ఈ విష‌యంలో కార్మిక సంఘాలు తీసుకుంటున్న చ‌ర్య‌లు శూన్యం. అడ‌పాద‌డ‌పా ప‌త్రికా స‌మావేశాలు పెట్టి మాట్లాడ‌టం త‌ప్ప వారు ఏ మాత్రం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని కార్మికులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

 

 

 

 

 

 

 

 

 

Get real time updates directly on you device, subscribe now.

You might also like