సింగరేణిపై వెనకడుగు అందుకేనా..?
సింగరేణి ఎన్నికలపై ప్రభుత్వం వెనకడుగు ఎందుకు వేసింది…? టీబీజీకేఎస్, యాజమాన్యం ద్వారా ఎన్నికలు జరగకుండా పరోక్షంగా ఎందుకు అడ్డుపడింది….? తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం నేతల అవినీతి, అరాచకం… వారిపై ఉన్న వ్యతిరేకత తమ పుట్టి ముంచుతుందని ముఖ్యమంత్రి భావించారా..? ఇంతకీ అధినేత ఆలోచన ఏంటి..? ఆయన తీసుకున్న నిర్ణయం వెనక అసలు కథేంటి…? సింగరేణి ఎన్నికల వాయిదాపై ‘నాందిన్యూస్’ ప్రత్యేక కథనం..
అనుకున్న విధంగానే సింగరేణి ఎన్నికలు వాయిదా పడ్డాయి. యాజమాన్యం, తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఎన్నికలపై కోర్టుకు వెళ్లడంతో ఎన్నికల విషయంలో సందిగ్ధత నెలకొంది. కోర్టు ఆదేశాల నేపథ్యంలో ఆగస్టులో ఎన్నికలు జరుగుతాయని అంతా భావించారు. కేంద్ర కార్మిక శాఖ అధికారులు సైతం 24న ఎన్నికల షెడ్యూల్ విడుదల చేస్తామని స్పష్టం చేశారు. సింగరేణి ఎన్నికలు రెండేళ్ల కాలపరిమితితో కాకుండా, నాలుగేండ్ల పరిమితి ఉండాలని టీబీజీకేఎస్ కోర్టును ఆశ్రయించింది. సింగరేణి సైతం కోర్టుకు వెళ్లింది. దీనిపై అక్టోబర్ 5న విచారణ చేపట్టనున్నట్లు కోర్టు స్పష్టం చేసింది. ఆ సమయంలో అసెంబ్లీ ఎన్నికలకు ముహూర్తం ఉంటుంది. దీంతో ఆ సమయంలో ఎన్నికలు జరిగే అవకాశమే లేదని పలువురు స్పష్టం చేస్తున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం కావాలనే ఎన్నికలను వాయిదా వేయించేలా ఎత్తుగడ వేసిందనే విషయం స్పష్టం అవుతోంది.
సింగరేణిలో జరిగే ఎన్నికలు మినీ అసెంబ్లీ ఎన్నికలుగా భావిస్తారు. ఈ ప్రాంతాల్లో ఉన్న రాజకీయ నాయకులు, ఆయా పార్టీల అనుబంధ సంఘాల నేతలు రంగంలో ఉంటారు. సింగరేణి ఎన్నికల్లో ఫలితాలు అసెంబ్లీ ఎన్నికలపై ప్రభావం చూపుతాయి. దీంతో అన్ని పార్టీలు తమ సర్వశక్తులు ఒడ్డి పోరాడతాయి. ఇక్కడ గెలిస్తే ఆ ప్రభావం సింగరేణి విస్తరించిన ఆరు జిల్లాల్లోనే కాకుండా, రాష్ట్రవ్యాప్తంగా దాని ప్రభావం పడుతుందని, అసెంబ్లీ ఎన్నికల్లో సైతం తాము గెలవచ్చన్న భావన అన్ని పార్టీల్లోనూ ఉంటుంది. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు సర్వశక్తులు ఒడ్డి సింగరేణి ఎన్నికల్లో గెలిచేందుకు ప్రయత్నాలు చేస్తాయి.
తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం నేతల పుణ్యమా అని సింగరేణి ఎన్నికల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం విముఖత చూపుతోంది. ఇక్కడి నేతల అవినీతి పెద్ద ఎత్తున పెరిగిపోయింది. కారుణ్య నియామాకాల దగ్గర నుంచి కార్మికుల బదిలీల వరకు, క్వార్టర్ల కౌన్సెలింగ్ ఇలా అన్ని రకాలుగా ఎక్కడ చూసినా లంచాలు లేనిదే పనికావడం లేదు. కారుణ్య నియామాకాల్లో రూ. 6 లక్షల నుంచి రూ. 8 లక్షల వరకు వసూళ్లు చేస్తున్నారు. ఇందులో టీబీజీకేఎస్ నేతలే నేరుగా పైరవీలు చేస్తున్నారు. ఇక బదిలీల విషయానికి వస్తే అందినకాడికి దోచుకుంటున్నారు. ఒక్కో ఏరియాలో ఒక్కో రేటు చొప్పున వసూలు చేస్తున్నారు. క్వార్టర్ల కౌన్సెలింగ్‌లో సైతం నాయకులు చెప్పిందే వేదం. వారు చేసిందే చట్టం అన్నవిధంగా గనులపై పరిస్థితులు నెలకొన్నాయి.
ఇక, మహిళా కార్మికుల పట్ల తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం నాయకులు వ్యవహరిస్తున్న తీరు కూడా పెద్ద ఎత్తున వివాదాలకు దారి తీసింది. ఈ మధ్య కాలంలో మహిళా ఉద్యోగుల సంఖ్య పెద్ద ఎత్తున పెరిగింది. అయితే, అదే స్థాయిలో వారిపై లైంగిక దాడులు పెరిగాయి. ఇల్లందు ఏరియా పరిధిలోని కోయగూడెం ఓసీలో పనిచేస్తున్న ఓ కార్మికుడి భార్యను తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఇల్లందు బ్రాంచ్ ఉపాధ్యక్షుడు గడ్డం వెంకటేశ్వర్లు వేధింపులకు గురిచేశాడు. తరచూ ఫోన్ చేస్తూ.. అసభ్యకర మాటలతో వెకిలి చేష్టలకు పాల్పడ్డాడు. ఆ మహిళ ఇల్లందు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం బయటకు వచ్చింది. ఆర్జీ 1 ఏరియా వర్క్‌షాప్‌లో టీబీజీకేఎస్ పిట్ సెక్రటరీ స్వామిదాస్ ఓ మహిళా ఉద్యోగిని వేధింపులకు గురి చేశాడు. దీంతో స్వామిదాస్‌ను తోటి కార్మికుల ఎదురుగానే బూటుతో కొట్టింది. విచారణ నేపథ్యంలో రాజీపడాలని, లేకపోతే చంపేస్తామంటున్నారని, సంస్థలో తనకు న్యాయం జరగలేదని ఒంటిపైన పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి సైతం పాల్పడిందంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు.
మందమర్రి ఏరియాలో ఓ టీబీజీకేఎస్ నేత కారుణ్య నియామకం కోసం తన వద్దకు వచ్చిన ఓ యువకుడి భార్యపై కన్నేశాడు. చివరకు ఆమెను లొంగదీసుకోవడంతో విషయం బయటకు వచ్చి పెద్ద రచ్చ జరిగింది. రంగంలోకి దిగిన టీబీజీకేఎస్ నేతలు, టీఆర్ఎస్ నాయకులు యువకుడికి రూ. 30 లక్షల వరకు ముట్టజెప్పి విషయం సద్దుమణిగించారు. వారు కూడా రూ. 10 లక్షల వరకు మింగేశారు. టీబీజీకేఎస్ నేతను షిఫ్టు మార్పించి చేతులు దులుపుకున్నారు. రామకృష్ణాపూర్ ఏరియా ఆసుపత్రిలో టీబీజీకేఎస్ ఫిట్ సెక్రటరీ కృష్ణ ఓ నర్సును లైంగికంగా వేధించాడు. విషయం బయటకు పొక్కడంతో నర్సు ఆత్మహత్యాయత్నం చేసింది. దీంతో కృష్ణను ఇక్కడ నుంచి అధికారులు అతన్ని బదిలీ చేశారు. అయితే తిరిగి కృష్ణ మళ్లీ తన రాజకీయ పలుకుబడితో తిరిగి రామకృష్ణాపూర్ కు వచ్చేశారు. అయితే ఈ కృష్ణ ఓ టీబీజీకేఎస్ నేతకు ప్రియ శిష్యుడు కావడంతో తిరిగి ఆయనకు టీబీజీకేఎస్ ఫిట్ సెక్రటరీగా బాధ్యతలు అప్పగించారు.
ఇలా తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం నేతల అవినీతి, అరాచక పర్వం విషయాల్లో కార్మికులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా పగ తీర్చుకుంటామని స్పష్టం చేస్తున్నారు. మరోవైపు తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం నేతలు అధికారులకు తొత్తులుగా మారారనే ప్రచారం సైతం సాగుతోంది. కార్మికుల సంక్షేమం గురించి ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. రెండేళ్లుగా కనీసం కార్మికుల రక్షణపై సమావేశాలు కూడా జరగడం లేదు. టీబీజీకేఎస్ అధ్యక్షుడు వెంకట్రావ్ కార్మికుల సమస్యలపై కనీసం పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఇవన్నీ ఇంటలిజెన్స్ వర్గాల ద్వారా ముఖ్యమంత్రి దృష్టికి వెళ్లడంతో వ్యతిరేకత పసిగట్టి ఆయన కూడా వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది.
ఇక ఇందులో మరో కారణం కూడా లేకపోలేదని పలువురు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తో తాము కలిసి పోటీ చేసేందుకు సిద్దమని ప్రకటించారు. ఇప్పుడు ఎన్నికలకు వెళితే సింగరేణిలో తాము పోటీ చేస్తామని మద్దతు ఇవ్వాలని సీపీఐ అనుంబంధ సంఘం ఏఐటీయూసీ డిమాండ్ చేసే పరిస్థితి ఉంటుంది. అలా మద్దతు ఇస్తే సింగరేణి వ్యాప్తంగా యూనియన్ నేతలు, కార్యకర్తల నుంచి వ్యతిరేకత వస్తుంది. అయితే, ముఖ్యమంత్రి కేసీఆర్ మునుగోడు ఎన్నికల తర్వాత సీపీఐతో పొత్తల విషయంలో ఎక్కడా ప్రకటించలేదు. కనీసం ఆ వైపుగా ఆలోచిస్తున్న దాఖలాలు కూడా లేవు. దీంతో ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ గతంలో లాగా కలిసి పోటీ చేసి గెలుపొందితే అలా కూడా ఇబ్బందులు తప్పవు. ఇవ్వన్నీ దృష్టిలో పెట్టుకున్న ముఖ్యమంత్రి ఫైనల్స్ ముందు సెమీఫైన్సల్ ఆడి రిస్క్ తీసుకోవడం ఎందుకని… వెనక్కి తగ్గినట్లు సమాచారం.