సింగరేణికి ఆల్‌టైం రికార్డు లాభాలు
-2022-23 లో లాభాలు రూ.2,222 కోట్లు
-గత ఏడాదితో పోలిస్తే 81 శాతం వృద్ధి
-కోల్ ఇండియాతో సహా మహారత్న కంపెనీలన్నిటికన్నా సింగరేణి నెంబర్ వన్
-ప్రతికూల పరిస్థితుల్లో కూడా గరిష్టంగా అమ్మకాలు, లాభాలు
Singareni: సింగరేణి సంస్థ 2022-23 ఆర్థిక సంవత్సరంలో తన చరిత్రలోనే అత్యధికంగా 33,065 కోట్ల రూపాయల టర్నోవర్ తో రూ.2,222 కోట్ల నికర లాభాలను ఆర్జించి సరికొత్త రికార్డు సృష్టించింది. సింగరేణి సంస్థ గత ఆర్థిక సంవత్సరం 2022 -23లో బొగ్గు అమ్మకాలు, విద్యుత్ అమ్మకాల ద్వారా మొత్తం రూ.3,074 కోట్ల స్థూల లాభాలను ఆర్జించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఇతర ట్యాక్స్‌ల చెల్లింపుల అనంతరం రూ.2,222 కోట్ల నికర లాభాలను ఆర్జించింది. సింగరేణి చరిత్రలోనే ఇది ఆల్ టైం రికార్డ్. అంతకుముందు ఆర్థిక సంవత్సరం 2021-22 లో సింగరేణి సాధించిన నికర లాభాలతో రూ.1,227 పోలిస్తే 2022-23లో సాధించిన లాభాలు 81 శాతం అధికం. టర్నోవర్ కూడా 2021-22 సంవత్సరంలో సాధించిన రూ. 26,585 కోట్లపై గత ఆర్థిక సంవత్సరం(2022-23)లో సాధించిన రూ.33,065 టర్నోవర్ 24 శాతం అధికం.
గత ఆర్థిక సంవత్సరం(2022-23) సింగరేణి సాధించిన టర్నోవర్ లో బొగ్గు అమ్మకం ద్వారా రూ28, 650 కోట్లు, విద్యుత్ అమ్మకం ద్వారా రూ4,415 కోట్లను గడిచింది. శుక్రవారం సంస్థ ఛైర్మన్, ఎండీ ఎన్. శ్రీధర్ వివరాలను ప్రకటించారు. ప్రతికూల పరిస్థితుల్లో కూడా అధికోత్పత్తికి కృషి చేసి అత్యధిక టర్నోవర్, లాభాలు సాధించిన కార్మికులు, ఉద్యోగులు, అధికారులకు, యూనియన్ నాయకులకు అభినందనలు తెలిపారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు 2013-14 సంవత్సరంతో పోల్చితే సింగరేణి సంస్థ లాభాలు 430 శాతం వృద్ధిని సాధించాయి. 2013-14లో సింగరేణి రూ.419 కోట్ల నికర లాభాలు సాధించగా.. గత ఆర్థిక సంవత్సరం రూ.2,222 కోట్ల సాధించి అత్యధిక వృద్ధి నమోదు చేసింది. ఇదే కాలంలో దేశంలోని వివిధ మహారత్న కంపెనీలు సాధించిన లాభాల వృద్ధి కన్నా కూడా సింగరేణి సాధించిన వృద్ధి చాలా ఎక్కువగా ఉంది. సింగరేణి సంస్థ 430 శాతం వృద్ధితో మొదటి స్థానంలో ఉండగా.. 241 శాతం వృద్ధితో పవర్ గ్రిడ్ కార్పొరేషన్ రెండవ స్థానంలో, 114% వృద్ధితో పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ మూడో స్థానంలో, 86% వృద్ధితో కోల్ ఇండియా నాలుగవ స్థానంలో ఉంది.