కల్వకుంట్ల కోటను బద్దలు కొట్టేందుకే…
యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనరెడ్డి

Congress: కల్వకుంట్ల కోటను బద్దలుకొట్టేందుకే యువపోరాట యత్ర చేస్తున్నట్లు యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనరెడ్డి స్పష్టం చేశారు. యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో చేపట్టిన యువపోరాట యాత్ర సోమవారం సాయంత్రం మంచిర్యాల చేరుకుంది. పట్టణంలోని ఐబి చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రప్రభుత్వం యువత, నిరుద్యోగులు, మహిళల పట్ల అవలంభిస్తున్న నిర్లక్ష్య వైఖరి యువ పోరాట యాత్రలో ఎండగట్టనున్నట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ ను గద్దె దింపితేనే నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయన్నారు. 2023లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, మంచిర్యాల ఎమ్మెల్యేగా కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గెలుపు ఖాయమన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే నిరుద్యోగులకు ప్రతి నెలా రూ.4 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ వస్తే కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఉండవని సీఎం కేసీఆర్ అన్నారని కానీ, ఆ ప్రాతిపదికనే ఉద్యోగులను నియమించుకుంటూ నిరుద్యోగులను మోసం చేస్తున్నారని ప్రభుత్వాన్ని విమర్శించారు.