టమాటలు అమ్మి… ఆ రైతు కోటీశ్వరుడయ్యాడు..
నెల రోజుల్లో కోటిన్నర సంపాదించిన రైతు
Tomato: టమాటా ధరలు చిరుత కంటే వేగంగా పరుగెడుతున్నాయి. పలు చోట్ల కిలో టమాటా రూ.130 నుంచి 150 కూడా పలుకుతున్నాయి. టమాటా పండించిన రైతులు భారీ లాభాలు కళ్లజూస్తున్నారు. దీనికి ప్రత్యక్ష ఉదాహరణగా నిలిచాడు మహారాష్ట్రకు చెందిన ఓ రైతు. మహారాష్ట్రలోని పూణె జిల్లా జూన్నార్ కు చెందిన తుకారాం భాగోజీ గయాకర్ అనే రైతు 30 రోజుల్లో టమాటాల ద్వారా కోటిన్నర సంపాదించాడు.
తుకారాంకు 18 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. అందులో 12 ఎకరాల్లో టమాట సాగు చేశాడు. రేటు ఆకాశాన్నంటిన సమయంలో ఈ టమాటాలు చేతికొచ్చాయి. అలా నెల రోజుల్లో దశలవారీగా 13వేల టమాట డబ్బాలను అమ్మి, అక్షరాలా కోటి 50 లక్షల రూపాయలు సంపాదించాడు. ధర బాగా ఎక్కువగా రోజుల్లో సింగిల్ డేలో 900 డబ్బాలు అమ్మి, 18 లక్షల రూపాయలు సంపాదించింది ఈ కుటుంబం.
తుకారాం కోడలు సోనాలి మొక్కలు నాటడం, పంట కోయడం, ప్యాకేజింగ్ చేయడం వంటి పనులను నిర్వహిస్తుండగా, అతని కుమారుడు ఈశ్వర్ విక్రయాలు, నిర్వహణ, ఆర్థిక ప్రణాళిక నిర్వహిస్తున్నాడు. మార్కెట్‌కు అనుకూలమైన పరిస్థితులు నెలకొనడంతో మూడు నెలలుగా శ్రమించి మంచి లాభాలు పొందారు. అయితే ఈ ప్రాంతంలో తుకారం కుటుంబం మాత్రమే కాకుండా, దాదాపు చాలామంది రైతులు కోటీశ్వరులయ్యారు. జున్నార్ వ్యవసాయ ఉత్పాదక మార్కెట్ కమిటీ ద్వారా 100 మంది మహిళలు, 2 నెలల్లో 80 కోట్ల రూపాయల టమాటాలు అమ్మారు.
ఇలా టమాటలు అమ్మి లక్షాధికారులైన రైతులు కేవలం మహారాష్ట్రలోనే లేరు. కర్ణాటకలోనూ ఉన్నారు. కోలార్‌కు చెందిన ఓ రైతు కుటుంబం ఈ మధ్యే టమాట బాక్సును రూ. 2000 చొప్పున అమ్మి రూ. 38 లక్షలతో ఇంటికి తిరిగి వెళ్లింది.