మహిళల రక్షణకే “అభయ”
-మహిళకు అండగా రామగుండం కమిషనరేట్ పోలీస్ భరోసా
-రామగుండం కమిషనరేట్ పరిధిలోని 1000 ఆటోలకు క్యూ ఆర్ కోడ్
Ramagundam Police Commissionerate:రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో ప్రయాణికులు ముఖ్యంగా మహిళలు సురక్షితంగా ప్రయాణించేందుకు అభయ యాప్ ఆవిష్కరించామని పోలీస్ కమిషనర్ రెమా రాజేశ్వరి స్పష్టం చేశారు. బుధవారం “అభయ” (సేఫ్ఆటో) మొబైల్అప్లికేషన్అధికారులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆపద సమయంలో అభయ్ యాప్ సద్వినియోగం చేసుకొని జరగబోయే ప్రమాదాలు నివారించవచ్చన్నారు. ప్రయాణ సమయాల్లో ఆకతాయిగా వ్యవహరించే డ్రైవర్ల ఆటకట్టించేందుకు వాహనాలకు క్యూఆర్తో కూడిన యూనిక్ నెంబర్లు ఏర్పాటు చేశామన్నారు. ఆటోలకు క్యూఆర్ కోడ్‌తో మహిళల భద్రతకు భరోసా కలుగుతుందని స్పష్టం చేశారు.
మహిళలు ఏ సమయంలోనైనా సురక్షితంగా ప్రయాణించేందుకు ఉపయోగపడుతుందన్నారు. ప్రయాణికులను ఆటో డ్రైవర్లు తప్పదోవ పట్టించినా, మార్గం మళ్లించినా, అసభ్యంగా ప్రవర్తించినా, మద్యం తాగి వాహనం నడిపినా, నిబంధనలకు విరుద్ధంగా ఎక్కువ మందిని ఎక్కించుకున్నా, రాష్ డ్రైవింగ్ చేసినా వెంటనే మీ మొబైల్ ఫోన్లో అభయ అప్లికేషన్ ఓపెన్ చేసి ఆయా వాహనాల్లో పోలీస్ శాఖ ఏర్పాటు చేసిన క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేయాలన్నారు. వెంటనే మీరు ప్రయాణిస్తున్న వాహనం యొక్క లైవ్ లొకేషన్ కమాండ్ కంట్రోల్ సెంటర్ కి చేరుతుందని. పోలీస్ సిబ్బంది అప్రమత్తమై వాహనాన్ని ట్రేస్ చేసి దగ్గర్లో ఉన్న పోలీస్ అధికారులకు సమాచారం ఇస్తారని వెల్లడించారు. సంబంధిత పోలీసు సిబ్బంది అక్కడికి చేరుకుని ఆకతాయిల పని పడతారని స్పష్టం చేశారు.
ఇలా ఆధునిక సాంకేతిక క్యూఆర్ కోడ్ ఉండడం వల్ల డ్రైవర్లు తప్పు చేసేందుకు సైతం భయపడతారని, ప్రయాణికులకు సైతం తాము సురక్షితంగా చేరతామనే నమ్మకం కలుగుతుందన్నారు. డీసీపీలు వైభవ్ గైక్వాడ్, సుధీర్ కేకన్, అడిషనల్ డీసీపీ ఏఆర్ రియాజ్ హుల్ హాక్, ఏసీపీలు తులా శ్రీనివాసరావు, తిరుపతిరెడ్డి, మోహన్, సదయ్య, వెంకటేశ్వర్లు, మల్లారెడ్డి, నరసింహులు, ఈవో నాగమణి, ఏఆర్ ఏసిపిలు సుందర్రావు, మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.
క్యూఆర్ కోడ్/యూనిక్ నెంబర్ ఇవ్వడం వలన ఉపయోగాలు
1.Q.R. Code (క్విక్ రెస్పాన్స్) విధానంలో ఆటో యజమాని/డ్రైవర్ కి సంబంధించిన పూర్తి వివరాలు ఉంటాయి.
2.ఆ వాహనం యొక్క పూర్తి వివరాలు స్థానిక పోలిస్ స్టేషన్ కి కమాండ్ కంట్రోల్ రూమ్ కి అనుసంధానం చేస్తారు.
3.ఆటో లో డ్రైవర్ కి వెనుక భాగంలో క్యూ ఆర్ కోడ్/యూనిక్ నెంబర్ బోర్డు అమరుస్తారు.
స్మార్ట్ ఫోన్ ఉన్న వారు క్యూ ఆర్ కోడ్ స్కానర్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి. వాహనం ఎక్కే ముందు ప్రయాణికులు డిజిటల్ బోర్డ్ క్యూ ఆర్ కోడ్ ని స్కాన్ చేయగానే ఆటో యజమాని/డ్రైవర్ యొక్క వివరాలు వస్తాయి.
4.ఇందులో అత్యవసర కాల్/టెక్స్ట్ మెసేజ్ పంపడం, ట్రేస్ మై లొకేషన్, , ఎమర్జెన్సీ కంప్లైంట్, రేటింగ్ అంశాలు ఉంటాయి.
5.ప్రయాణికులకు ఆపద సంభవిస్తుంది అనుకునే సమయంలో కాల్ చేస్తే కమాండ్ కంట్రోల్ రూమ్ కి , స్థానిక పోలీస్ స్టేషన్ కి వారి లైవ్ లోకేషన్, సమాచారం వెళుతుంది.
6.వెంటనే స్థానిక పోలీసులు అప్రమత్తమై ఆపదలో ఉన్న వారిని రక్షిస్తారు.
7. మద్యం సేవించి వాహనం నడిపిన, రాష్ డ్రైవింగ్ చేసిన, ప్రయాణికులతో దురుసుగా, అసభ్యకరంగా ప్రవర్తించిన, సెల్ ఫోన్ డ్రైవింగ్, స్మోకింగ్ చేస్తూ వాహనం నడిపిన, రాంగ్ రూట్ లోడ్రైవింగ్ చేసిన, పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకొనిన, అనుమానస్పదంగా వ్యవహరించిన ఆకతాయి డ్రైవర్ల ఆటకట్టించవచ్చును.
8.ప్రయాణీకులు వారి వస్తువులను వాహనం లో మరిచిపోయిన ఈ విధానం ద్వారా సులభంగా తెలుసుకోవచ్చును.