ముందుంది అసలు పరీక్ష

Durgam Chinnaiah: ఎన్నికలు అంటే ముందుగా పార్టీ టిక్కెట్టు సంపాదించాలి. ప్రత్యర్థి పార్టీలతో ఢీకొట్టి గెలవాలి. అప్పుడే అధికారం దక్కుతుంది. ఆ ఎమ్మెల్యే టిక్కెట్టు అయితే సంపాదించారు. ఆయన వచ్చే ఎన్నికల్లో ప్రచారంలో ఢీకొట్టబోతున్నారు. అయితే, ఆయన ఢీకొట్టబోయేది మాత్రం ప్రత్యర్థి పార్టీలను కాదు… ఓ యువతిని… అదేంటి ప్రత్యర్థి పార్టీ కాకుండా యువతిని ఢీకొట్టడం ఏమిటని ఆశ్చర్యపోతున్నారా..?
దుర్గం చిన్నయ్య… ఈ మధ్య కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన రాజకీయ నేత.. ఎమ్మెల్యే.. ఆయన చుట్టూ వివాదాలు ముసిరిన నేపథ్యంలో ఆయనకు టిక్కెట్టు రాదని భావించారు. కానీ, ఆయనకు టిక్కెట్టు వచ్చింది. అధినేత ఆయనకు టిక్కెట్టు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. కొద్ది రోజులుగా దుర్గం చిన్నయ్యకు టిక్కెట్టు ఎట్టి పరిస్థితుల్లో రాదని పెద్ద ఎత్తున చర్చ సాగింది. కొన్ని సందర్భాల్లో ఆయన సైతం తన టిక్కెట్టు విషయంలో టెన్షన్ పడ్డారు. షేజల్ అనే యువతి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తనపై లైంగికంగా వేధింపులకు పాల్పడ్డారని ఆరోపించారు.
ఆమె ఆరోపించడమే కాకుండా, పెద్ద ఎత్తున ఫిర్యాదు సైతం చేశారు. రాష్ట్రంలో, దేశరాజధానిలో షేజల్ చేయని ఫిర్యాదు లేదు. హైదరాబాద్‌లో పార్టీ నేతలు మొదలుకుని, అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు, పోలీసులు, జాతీయ మహిళా కమిషన్, సీబీఐ ఇలా అందరికీ ఫిర్యాదు చేసింది. అంతటితో ఆగకుండా నిరసనలు సైతం చేసింది. తెలంగాణ భవన్, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్, పార్లమెంట్ భవనంతో సహా అన్ని చోట్ల తన నిరసన కార్యక్రమం చేపట్టింది. దీంతో ఈ వ్యవహారం గల్లీ నుంచి ఢిల్లీ దాకా అన్ని చోట్లకు పాకింది. ప్రతి ఒక్కరి చోటా ఇదే విషయమై చర్చ సాగింది.
ఎన్నికల నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన జాబితాలో దుర్గం చిన్నయ్యకు టిక్కెట్టు వస్తుందా..? రాదా..? అనే సందేహాలు మెదిలాయి. వాటన్నింటిన పటాపంచలు చేస్తూ చిన్నయ్యకు టిక్కెట్టు వచ్చింది. ఇప్పటి వరకు అంతా బాగానే ఉంది. కానీ, ఎన్నికల సమయంలో ఆయనకు పెద్ద సవాల్ ఎదురుకానుంది. వాస్తవానికి ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ నుంచి పెద్దగా పోటీ ఉండకపోవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో బెల్లంపల్లి నియోజకవర్గం టిక్కెట్టు ఆశించే వ్యక్తులు దాదాపు ఐదుగురు వరకు ఉన్నారు. వీరిలో ఒక్క గడ్డం వినోద్ తప్ప ఎవరూ కూడా ఆయనకు పోటీ ఇవ్వలేరు. కాదు కూడా. కానీ, ఆయన అసలు ప్రత్యర్థి మాత్రం షేజల్ కానున్నారు.
చిన్నయ్యకు ముచ్చటగా మూడోసారి టిక్కెట్టు వచ్చిన నేపథ్యంలో తనను ఇంతగా వేధించిన దుర్గం చిన్నయ్యను వదిలిపెట్టే ప్రసక్తే లేదని షేజల్ ప్రతినబూనారు. ఆమె న్యాయపరంగా చేసే పోరాటంలో భాగంగా హై కోర్టులో కేసు వేయనున్నట్లు సమాచారం. అదే సమయంలో ఎన్నికల్లో సైతం నియోజకవర్గం మొత్తం గడపగడపకు తిరిగేందుకు ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. ఇంటింటికి తిరిగి తనకు జరిగిన అన్యాయం వివరిస్తానని స్పష్టం చేశారు. దీంతో దుర్గం చిన్నయ్య ప్రత్యర్థి పార్టీల కంటే షేజల్ తోనే పోటీ పడాల్సి ఉంటుందేమో…?