‘నేను నా గమ్యాన్ని చేరుకున్న’
Chandrayaan-3: మానవుడి ఎన్నో ఏండ్ల కలను సాకారం చేస్తూ ఇస్రో అద్భుతం సృష్టింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టిన మూన్ మిషన్ చంద్రయాన్-3 విజయవంతమైంది. ఇప్పటివరకు ప్రపంచంలో ఏ దేశం చూడని చంద్రుడి దక్షిణ ధ్రువంపై విజయవంతంగా అడుగుపెట్టి ‘చంద్రయాన్-3′ రికార్డు సృష్టించింది. గత వైఫల్యాన్ని మరిపిస్తూ శాస్త్రవేత్తలు చేసిన అలుపెరగని కృషికి ప్రపంచవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. బుధవారం సాయంత్రం 6.04 గంటలకు ల్యాండర్ విక్రమ్ చంద్రుడి దృక్షిణ ధృవంపై సాఫ్ట్ ల్యాండ్ అయ్యింది. అనంతరం ఇస్రోకు ఒక సందేశాన్ని చేరవేసింది. ‘నేను నా గమ్యాన్ని చేరుకున్నా.మీరు (భారత్, ఇస్రో) కూడా’. అన్న మెసేజ్ పంపింది. ఇస్రో దీనిని ధృవీకరించింది. చంద్రయాన్-3 చంద్రుడిపై విజయవంతంగా ల్యాండ్ అయ్యిందని తెలిపింది. ‘భారతదేశానికి అభినందనలు’ అని ట్వీట్ చేసింది.
చంద్రయాన్-3 ప్రయోగాన్ని ఇస్రో ప్రత్యక్ష ప్రసారం చేసింది. బుధవారం సాయంత్రం 5.20 గంటలకు లైవ్ ప్రసారం ప్రారంభమైంది. సాయంత్రం 6.04 గంటలకు ల్యాండర్ విక్రమ్ సురక్షితంగా చంద్రుడి దక్షిణ ధృవంపై సాఫ్ట్ ల్యాండ్ అయ్యింది. దీంతో మూన్ దక్షిణ ధృవంపై కాలుమోపిన తొలి దేశంగా భారత్ చరిత్ర సృష్టించింది. నాలుగు గంటల తర్వాత ల్యాండర్ విక్రమ్ నుంచి రోవర్ బయటకు రానున్నది. సుమారు 14 రోజులపాటు చంద్రుడిపై పలు పరిశోధనలు చేస్తుంది. ఎవరికీ తెలియని చంద్రుడి దక్షిణ ధృవం గుట్టు విప్పనున్నది. అక్కడి నేలలోని ఖనిజాలను గుర్తిస్తుంది. ఆ సమాచారాన్ని ఇస్రోకు పంపుతుంది.