ఆ వ్యాఖ్యల వెనక ఆంతర్యమేంటి..?
Balka Suman: బాల్క సుమన్.. యువకుడే కానీ రాజకీయాల్లో మాత్రం ఆరితేరిన వ్యక్తి.. తన గురువుగా ముఖ్యమంత్రిని కేసీఆర్ ను చెబుతుంటారు. చెప్పడమే కాదు.. రాజకీయ చాణక్యంలో అలాగే వ్యవహరిస్తుంటారు కూడా. ఉద్యమ సమయంలో ఎంపీగా గెలిచినా, ఎమ్మెల్యేగా విజయం సాధించినా చతురతతో ఎవరికి ఏం ఇవ్వాలో..? ఎవరిని ఎక్కడ పెట్టాలో..? ఎక్కడ తగ్గాలో..? ఎక్కడ నెగ్గాలో తెలిసిన వ్యక్తిగా ఆయనను దగ్గర చూసిన వారు చెబుతారు. గత సింగరేణి ఎన్నికల్లో శ్రీరాంపూర్ ఏరియాలో ఓటమి పాలు కావాల్సిన తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘాన్ని ఒంటిచేతితో గెలిపించారు. ఇలా రాజకీయంగా ఎన్నో ఎత్తుగడలు వేస్తూ ముందుకు సాగుతుంటారు. ఇప్పుడు ఆయన చేసిన ఓ వ్యాఖ్య కలకలం రేపుతోంది. మరీ ముఖ్యంగా ప్రత్యర్థి పార్టీని డైలమాలో పడేస్తూ ఆయన చేసిన ఆ మాటేంటి..? అది ఎందుకు చర్చకు దారి తీస్తోంది.
ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయాలు సైతం ఊపందుకుంటున్నాయి. ఇప్పటికే ముఖ్యమంత్రి తన అభ్యర్థులను ప్రకటించడంతో పాటు వారితో ప్రచారం సైతం చేయిస్తున్నారు. అభ్యర్థులు సైతం సభలు, సమావేశాలతో ముందుకు వెళ్తున్నారు. ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్‌కు బీఆర్ఎస్ టిక్కెట్టు కేటాయిస్తూ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. సుమన్ తన నియోజవర్గానికి వచ్చిన సందర్బంగా కార్యకర్తలు, నేతలు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సుమన్ మాట్లాడుతూ కాంగ్రెస్ లో మన కోవర్టులు ఉన్నారని, వారిని ఏమి అనవద్దని కార్యకర్తలకు హితవు పలికారు.
మీరు కాంగ్రెస్ వాళ్లను ఏమీ అనకండి.. వాళ్లు అక్కడక్కడ తిరుగుతుంటే.. మనోళ్లు అదోటి ఇదోటి అంటున్నరు. వాళ్లను ఏమీ అనొద్దు. వాళ్లూ మనోళ్లే.. గతంలో చెన్నూరు నుంచి నాపై పోటీ చేసిన వెంకన్న(ప్రస్తుతం పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేష్ నేత) మన పార్టీలోకి రాలేదా.. వాళ్లు కూడా వస్తరు. వాళ్లందరు మనోళ్లే. మీకు అసలు విషయం చెప్పాలంటే.. మనమే కొందర్ని పంపించినం కూడా. ఈ విషయం బయట ఎక్కడా చెప్పకుర్రి. నడుస్తయ్… రాజకీయాలనప్పుడు మనం కూడా కొంచెం తెలివి తేటలు వాడాలి కదా.’ అని బాల్క సుమన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
అయితే, ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు జిల్లా వ్యాప్తంగా చర్చకు దారి తీస్తున్నాయి. బాల్క సుమన్ ఎవరిని ఉద్దేశించి అన్నారు… ఆ మాటలు ఎందుకు అనాల్సి వచ్చిందని పలువురు చర్చించుకుంటున్నారు. నిజంగానే కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ కోవర్టులు ఉన్నారా..? లేక కాంగ్రెస్ పార్టీని ఇబ్బందుల్లో పెట్టేందుకు సుమన్ కాకతాళీయంగా ఈ వ్యాఖ్యలు చేశారా….? అన్న దానిపై పలువురు అనుకుంటున్నారు. కొందరు నిజంగానే కాంగ్రెస్‌లో బీఆర్ఎస్ కోవర్టులు ఉన్నారని, అందుకే సుమన్‌కు వ్యతిరేకంగా కనీసం డిపాజిట్ కూడా రాని వ్యక్తిని ఎన్నికల బరిలోకి నిలిపేందుకు సిద్ధం అవుతున్నారని చెబుతున్నారు. మరికొందరు మాత్రం అలాంటిదేమీ ఉండదని చెబుతున్నారు…
ఏదీఏమైనా ప్రభుత్వ విప్ బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. దానిపై కాంగ్రెస్ పార్టీ ఏం సమాధానం చెబుతుందో వేచి చూడాలి మరి…