వర్షంలోనూ బారులు తీరిన భక్తులు
Vemulawada: ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ రాజరాజేశ్వరస్వామి వారి దేవస్థానం సోమవారం భక్తులతో రద్దీగా మారింది. శ్రావణమాసం సోమవారం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు తమ ఇష్ట దైవమైన రాజరాజేశ్వరస్వామి వారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ కల్యాణ కట్టలో తలనీలాలు సమర్పించి, ధర్మగుండంలో పవిత్ర స్నానాలు ఆచరించారు. అనంతరం సర్వదర్శనం, ప్రత్యేక దర్శనం క్యూలైన్ల మీదుగా ఆలయంలోకి ప్రవేశించి రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారికి ప్రీతిపాత్రమైన కోడెమొక్కు భక్తులు చెల్లించుకున్నారు.
వర్షంలోనూ క్యూ లైన్లలో భక్తులు
వర్షం కారణంగా రాజరాజేశ్వరస్వామి వారి భక్తులకు ఇబ్బందులు తప్పలేదు. అయినా, భక్తులు అలాగే క్యూలైన్లలో నిలబడి స్వామి దర్శనం చేసుకున్నారు. రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకునే క్రమంలో వారు క్యూలైన్లలో, ఆలయ పరిసరాలలో పలుమార్లు తడిసి ముద్దయ్యారు. బద్దిపోచమ్మ అమ్మవారికి బోనం సమర్పించుకోవడానికి వర్షంలోనే బారులు తీరారు. అనేక ఇబ్బందుల మధ్య వారు బద్ధిపోచమ్మ అమ్మవారిని దర్శించుకుని బోనం మొక్కు సమర్పించారు.