అంగన్‌వాడీలో ఆమె అంటే హడల్
-అంగన్‌వాడీ కేంద్రం సరిగ్గా తీయని టీచర్
-మంచిర్యాలలో రియట్ ఎస్టేట్ వ్యాపారంలో తలమునకలు
-ఎన్నోమార్లు షోకాజ్ నోటీసులు ఇచ్చినా మారని తీరు
-డీడబ్ల్యువో కార్యాలయంలో ఆమె పేరిట ప్రత్యేక ఫైల్
-అయినా చర్యలు తీసుకునేందుకు అధికారుల వెనకడుగు
-ఎమ్మెల్యేలు తనకు తెలుసంటూ అధికారులకు బెదిరింపులు

ఆమె ఓ సామాన్య అంగన్‌వాడీ కార్యకర్త. బడికి రాదు… సెంటర్ తీయదు.. రోజుల తరబడి తీయకున్నా అడిగే నాథుడే ఉండడు.. ఒకవేళ చర్యలు తీసుకోవాలని ఏ అధికారి అయినా అనుకుంటే తనకు ఎమ్మెల్యేలు తెలుసంటూ వారినే బెదిరిస్తుంది… తనకు ఎన్నోమార్లు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. అయినా, చలనం లేదు.. ఫలితం అంతకంటే లేదు. ఆ అంగన్వాడీ టీచర్ పై జిల్లా సంక్షేమాధికారి కార్యాలయంలో ఏకంగా ఫైలు ఉందంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు…
బెల్లంపల్లికి చెందిన ఓ అంగన్‌వాడీ టీచర్ అంటే అందరికి భయమే. అధికారులు చర్యలు తీసుకోకపోగా, ఆ టీచర్ గురించి మాట్లాడటానికి కూడా భయపడుతుంటారు. చొప్పరిపల్లి సెక్టార్‌లో ఉన్న ఆమె సక్రమంగా సెంటర్ తీయదని, నెలల తరబడి ఆబ్సెంట్ అవుతుందని కూడా తెలుసు… కానీ, అటువైపు కన్నెత్తి కూడా చూడరు. తాను కనీసం రికార్డులు సైతం రాయదని కొందరితో రాయించి వారికి డబ్బులు చెల్లిస్తుందని సమాచారం. గతంలో జిల్లాలో పనిచేసిన కొందరు అధికారులకు డబ్బులు, వస్తువులు కొనిచ్చి తనపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆపేలా చేసింది. అధికారులు కొన్నిసార్లు షోకాజ్ నోటీసులు జారీ చేసినా కనీసం పట్టించుకోలేదంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. అధికారులు సైతం కేవలం షోకాజ్ నోటీసులు జారీచేసి సైలెంట్ అయిపోయారంటే ఆ అంగన్వాడీ టీచర్ వారిని ఎలా మేనేజ్ చేసింది అర్ధం చేసుకోవచ్చు.
నాకు ఎమ్మెల్యేలు తెలుసు…
ఆ టీచర్ తనకు బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేంసాగర్ రావు తెలుసంటూ ప్రచారం చేసుకుంటుంది. కొన్ని సందర్భాల్లో కొందరు నేతలతో అధికారులకు ఫోన్లు సైతం చేయిస్తుంది. దీంతో అధికారులు సైలెంట్గా ఉండిపోవడం సర్వసాధారం అయ్యింది. ఇక తాను మంచిర్యాలలో రియల్ ఎస్టేట్ దందాతో కోట్లు సంపాదించింది. ఎవరైనా తన జోలికి వస్తే ఎంత ఖర్చయినా పర్వాలేదు.. చూసుకుంటానని బెదిరిస్తూ ఉంటుంది. దీంతో ఆమె జోలికి వెళ్లేందుకు అధికారులు వెనకడుగు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ టీచర్ ఆడింది ఆట… పాడింది పాటగా మారింది…
ఎన్నోమార్లు షోకాజ్ నోటీసులు ఇచ్చినా మారని తీరు
అయినా కొందరు అధికారులు ఆ అంగన్‌వాడీ టీచర్‌కు షోకాజ్ నోటీసులు అందించారు. ఆమె పేరిట మంచిర్యాల జిల్లా సంక్షేమాధికారి కార్యాలయంలో ఏకంగా ఓ ఫైలే ఉంది. ఒకవేళ ఇక్కడ నోటీసులు ఇచ్చినా ఆ టీచర్ ఉన్నతాధికారులతో మాట్లాడుకుని ఎలాంటి సమస్య రాకుండా చూసుకుంటోంది. దీంతో ఇన్నేండ్లుగా సెంటర్ తీయకుండా రికార్డు సృష్టించింది. ఇక చుట్టు పక్కల ఉన్న కొందరికి మాత్రం నిత్యం సరుకులు అందచేస్తుంది. ఎప్పుడైనా అధికారులు సెంటర్ తనిఖీకి వచ్చినా, విచారణ చేపట్టినా తమకు సరుకులు సక్రమంగా అందుతున్నాయని వారితో చెప్పిస్తుంది. దీంతో అధికారులు దీనిని సాకుగా చూపిస్తూ ఆమెపై చర్యలు తీసుకోకుండా వదిలేస్తున్నారు.
ఇప్పటికైనా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. అదే సమయంలో ప్రజాప్రతినిధులు సైతం ఇలాంటి వారికి అండగా ఉండకుండా చర్యలు తీసుకునేలా అధికారులను ఆదేశించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.