తిరుమ‌ల ల‌డ్డూకు మ‌రింత‌ డిమాండ్‌

Tirumala Laddu Prasadam : ఓవైపు తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంపై వివాదంరేగుతున్న వేళ నాలుగైదు రోజులుగా తిరుమలలో లడ్డూ ప్రసాదాలకు డిమాండ్ పెరిగింది. వాస్తవానికి కల్తీ నెయ్యి వివాదం వేళ లడ్డూ ప్రసాదాల విక్రయాలు తగ్గుతాయ‌ని భావించారు. కానీ లడ్డూ విక్రయాలు మాత్రం పెరిగాయి. తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి కలిసిందంటూ ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్ప‌డంతో కలకలం రేగింది. ఈ కల్తీ వివాదంతో లడ్డూ ప్రసాదాల విక్రయాలు తగ్గుతాయని అంచనా వేశారు.. కానీ శ్రీవారి భక్తులు వారి అంచ‌నాలు త‌ల్ల‌కిందులు చేశారు. ఈ నెల 19న 3.59 లక్షలు, 20న 3.17 లక్షలు, 21న 3.67 లక్షల లడ్డూలను కొనుగోలు చేశారు. దీంతో టీటీడీ ప్రస్తుతం రోజుకు మూడున్నర లక్షల నుంచి నాలుగు లక్షల వరకు లడ్డూలను తయారు చేస్తోంది. అలాగే భక్తులు కూడా లడ్డూ ప్రసాదం ఇప్పుడు చాలా రుచిగా ఉందని చెబుతున్నారు. ప్రస్తుతం టీటీడీకి కర్ణాటక నందిని నుంచి నాణ్యమైన నెయ్యి అందుతోంది.. ఈ క్రమంలోనే లడ్డూల నాణ్యత కూడా పెరిగిందని చెబుతున్నారు.

తిరుమలకు సరఫరా చేస్తున్న నెయ్యి కాంట్రాక్టర్ గతంలో తమిళనాడుకు చెందిన ఏఆర్ ఫుడ్స్ కాగా.. వారు సరఫరా చేసిన ఆవు నెయ్యిలోనే జంతునూనెల అవశేషాలు ఉన్నట్లుగా ఎన్‌డీడీబీ రిపోర్టులో వెల్లడైంది. అయితే, తాము స్వచ్ఛమైన నెయ్యినే సరఫరా చేశామని ఏఆర్ ఫుడ్స్ చెబుతోంది. ఈ కల్తీ రిపోర్టులు వచ్చాయన్న కారణంతో ప్రస్తుత ప్రభుత్వం నెయ్యి కాంట్రాక్టర్ ను మార్చినట్లుగా ప్రకటించింది. అంతేకాక, లడ్డూ తయారీలో వాడే పదార్థాల నాణ్యతను కూడా మరింత పెంచామని, తద్వారా సువాసన, రుచి మరింత పెరిగిందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

ప్రస్తుతం తిరుమలలో స్వచ్ఛమైన ఆవు నెయ్యిని వాడ శ్రీవారి లడ్డూ ప్రసాదాలను తయారు చేస్తున్నట్లు టీటీడీ ఈవో శ్యామలరావు స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్నందున, స్వచ్ఛమైన ఆవు నెయ్యిని ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. కొన్ని సంవత్సరాలుగా లడ్డూల నాణ్యత తక్కువగా ఉందని భక్తుల నుండి అభిప్రాయాన్ని స్వీకరించిన తరువాత పోటు కార్మికులతో మాట్లాడిన తరువాత, మొదటిసారిగా నెయ్యి శాంపుల్స్ ను పరీక్ష కోసం బయటి ల్యాబ్‌కు టీటీడీ పంపిందన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like