తిరుపతిలో వర్ష బీభత్సం… విరిగిపడిన కొండచరియలు
రోడ్లన్నీ జలమయం - 2 రోజులు స్కూల్స్ సెలవు

చిత్తూరు : జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇక తిరుపతిలో గురువారం తెల్లవారుజాము నుంచి కురుస్తున్న భారీ వర్షాలు బీభత్సాన్ని సృష్టించాయి. తిరుపతిలో రహదారులన్నీ జలమయమయ్యాయి. తిరుపతి నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రైల్వే అండర్ బ్రిడ్జ్ లు వర్షపు నీటితో మునిగిపోయాయి.
తిరుపతిలో వర్ష బీభత్సం..
తిరుపతి నగరంలోని వెస్ట్ చర్చి, తూర్పు పోలీస్ స్టేషన్ వద్దనున్న అండర్ బ్రిడ్జ్‌లు పూర్తిగా వర్షపు నీటితో నిండిపోయాయి. నగరంలోని కరకంబాడి మార్గంలోనూ భారీగా వరద నీరు చేరింది. రహదారులు పూర్తిగా జలమయం కావడంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో ప్రజలు కదలలేని పరిస్థితి నెలకొంది. భారీ వర్షాల కారణంగా రేణిగుంటలో దిగాల్సిన విమానాలు బెంగళూరు, హైదరాబాద్‌కు మళ్లిస్తున్నారు.
విరిగిపడిన కొండచరియలు, పాఠశాలలకు సెలవు
భారీ వర్షాల తిరుమల రహదారిలో కొండచరియలు విరిగిపడ్డాయి. తిరుమల రెండో కనుమదారిలో హరిణి వద్ద రాళ్లు పడ్డాయి. భారీ వర్షంతో పాపవినాశనం రహదారిని తిరుమల తిరుపతి దేవస్థానం మూసేసింది. భక్తులకు ఇబ్బందులు లేకుండా చేసేందుకు సిబ్బంది రాళ్లను తొలగిస్తున్నారు. మరోవైపు భారీ వర్షాల నేపథ్యంలో చిత్తూరు జిల్లా వ్యాప్తంగా గురు, శుక్రవారాల్లో అన్ని విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు జిల్లా కలెక్టర్ హరినారాయణన్.
భారీ వరదతో కపిలతీర్థం
భారీ వర్షాలతో కపిలతీర్థం పొంగిపొర్లింది. గురువారం ఉదయం నుంచి కురుస్తున్న వర్షాలతో వరదనీరు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. కాగా, కుండపోతవర్షాలకు తిరుమలలోని జలాశయాలన్నీ నిండు కుండల మారాయి. భారీగా వర్షం పడుతుండటంతో భక్తులు ఇబ్బందులకు గురి అవుతున్నారు. శ్రీవారి దర్శనానికి వైకుంఠం కాంప్లెక్స్‌కు వెళ్లే భక్తులతో పాటుగా దర్శనం తర్వాత బయటకు వచ్చే భక్తులు వసతి గదులకు చేరుకునేందుకు ఇబ్బందులకు గురి అవుతున్నారు.
ఘాట్ రోడ్ లో వరదనీరు
భారీ వర్షాలతో తిరుమల ఘాట్ రోడ్లపై వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలు చోట్ల రోడ్లపై రాళ్లు రోడ్లపై పడ్డాయి. కాగా,వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలన్ని జలమయం అయ్యాయి. శ్రీవారి ఆలయ పరిసరాలు, మాఢ వీధులు, లడ్డూ వితరణ కేంద్రం, తిరుమల రహదారులు వర్షపు నీరు భారీగా చేరుకోవడంతో వర్షపు నీటిని బయటకు పంపే ప్రయత్నం చేస్తున్నారు టీటీడీ సిబ్బంది.. తిరుమల ఘాట్ రోడ్డులో భారీగా వర్ష కారణంగా కొండలో గట్టిగ ఉండే మట్టి పూర్తిగా మెత్తబబడంతో కొండ చరియలు విరిగిపడుతున్నాయి. మొదటి, రెండవ ఘాట్ రోడ్డులలో ప్రయాణించే ప్రయాణికుల అప్రమత్తంగా వ్యవహరించాలని సూచిస్తోంది టీటీడీ విజిలెన్స్.
భీకరంగా జలపాతం
తిరుపతి మాల్వాడి గుండంలో మునుపెన్నడూ చూడని విధంగా భీకర జలపాతం దర్శనమిచ్చింది.తిరుమలలోని యాత్ర ప్రదేశాలు వీక్షించేందుకు కూడా భక్తులు మక్కువ చూపడం లేదు. వసతి గదుల్లోనే భక్తులు పరిమితం అవుతున్నారు. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అలిపిరి నకడమార్గం., శ్రీవారి మెట్టు మార్గాన్ని మూసివేశారు టీటీడీ అధికారులు.
వెనుదిరిగిన విమానాలు
భారీ వర్షాల నేపథ్యంలో రేణిగుంట విమానాశ్రయంలో విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో విమానాలు రేణిగుంట రాకుండానే తిరిగి హైదరాబాద్ వెళ్తున్నాయి. హైదరాబాద్-రేణిగుంట ఇండిగో విమానాన్ని విమానాశ్రయ అధికారులు బెంగళూరు మళ్లించారు.