మహిళా అఘోరీ కథ సుఖాంతం
-రెండు నెలల పాటు కర్ణాటక, కేరళ ఆలయాలకు వెళ్తా
-తిరిగి తెలంగాణకే వచ్చి ఇక్కడే ఉంటానన్న అఘోరీ
Lady Aghori: కొద్ది రోజులుగా తెలంగాణలో హాట్ టాపిక్‌గా మారిన మహిళా అఘోరీ కథ సుఖాంతం అయ్యింది. రాత్రిపూట పోలీసులు ఆమెను సరిహద్దులు దాటించడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. మహిళా అఘోరీ తెలంగాణలో పలు ఆలయాలు సందర్శిస్తూ వచ్చింది. ఈ నెల 1న ఆత్మార్పణ చేసుకుంటానని ప్రకటించడంతో తెలంగాణ వ్యాప్తంగా కలకలం రేగింది. ప్రకటనతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఆమెను సొంత గ్రామమైన మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం కుశ్నపల్లికి భారీ భద్రత మధ్య తరలించారు. అనంతరం అఘోరీని తల్లిదండ్రులకు అప్పగించారు. అదే సమయంలో ఆత్మార్పణ ప్రకటనతో ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా భారీగా మోహరించారు. అదే సమయంలో గ్రామంలో పోలీసుల ఆంక్షలు సైతం కొనసాగాయి.
తాజాగా, శుక్రవారం అఘోరీ తల్లిదండ్రులు బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్‌ను కలిశారు. తాను అన్నటింటిని పరిశీలిస్తానని ఆత్మార్పణ విషయంలో సంయమనం పాటించాలని ఆయన కోరారు. అదే సమయంలో, బెల్లంపల్లి ఏసీపీకి సైతం పరిస్థితి వివరించారు. ఈ నేపథ్యంలోనే మహిళా అఘోరీని ఇక్కడ నుంచి తరలించాలని నిర్ణయం తీసుకున్నారు.ఆమె సైతం అందుకు ఒప్పుకోవడంతో మంచిర్యాల పోలీసులు జగిత్యాల వరకు తీసుకువెళ్లి అక్కడ వదిలేశారు. మహిళా అఘోరీ కర్ణాటక వైపునకు వెళ్లానని చెప్పడంతో అటు వైపు తీసుకువెళ్లారు. బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్, నెన్నల ఎస్ ఐ ప్రసాద్ ఆధ్వర్యంలో ఆమెను తరలించారు. కార్తీకమాసం కావడంతో కర్ణాటక, కేరళ ప్రాంతాల్లోని ఆలయాల్లో పూజలు నిర్వహించి రెండు నెలల తర్వాత ఇక్కడకే వస్తానని మహిళా అఘోరీ స్పష్టం చేశారు.