భక్తిశ్రద్ధలతో ఛట్ పూజలు
Chat worship with devotion:ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో ఛట్ పూజలు భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా బీహార్, ఉత్తర్ ప్రదేశ్, మధ్య ప్రదేశ్ భక్తులు ఈ పండగ ఘనంగా నిర్వహిస్తున్నారు. దీపావళి సందర్భంగా ఈ ఛట్ పూజలు జరుగుతాయి. కాగజ్ నగర్ పట్టణంలోని ఎస్పీఎం క్రీడామైదానంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. కొలను వద్ద దీపాలు వెలిగించి నైవేద్యంగా పండ్లు సమర్పించారు. సూర్యాస్తమయం అయ్యే వరకు ఎలాంటి ఆహారం, పానీయాలు తీసుకోకుండా ఉపవాసంతో పూజలు నిర్వహిస్తారు. ఇంటిళ్లిపాదితోపాటు లోక కల్యాణం కోసం ఏటా ఈ కార్యక్రమం నిర్వహిస్తామని మహిళలు పేర్కొన్నారు
నాలుగు రోజుల పాటు..
ఈ పూజ నాలుగు రోజుల పాటు ఘనంగా జరుగుతుంది. మొదటి రోజు నహాయ్ ఖాయ్, రెండోరోజు ఖర్నా, మూడవ రోజును పెహలా ఆర్ఘ్య్, నాలుగవరోజు పార్నాగా పేర్కొంటారు. ఛట్ పూజ చేసేవారు అత్యంత నిష్ఠగా నహాయ్‌ఖాయ్ ఆచరిస్తారు. ఎక్కువగా మహిళలే ఈ వ్రతాన్ని ఆచరిస్తారు.
ఇది కూడా ప్రకృతి పండగ..
ఛట్ పూజ కూడా తెలంగాణలోలా ప్రకృతికి సన్నిహితమైనది. సకల సృష్టికి ఆధారమైన సూర్యభగవానున్ని ఈ పండుగ సందర్భంగా కొలుస్తారు. మోకాలి లోతు వరకు నీటిలో నిలబడి సూర్యదేవునికి ఆర్ఘ్యప్రసాదాలను సమర్పించడం ఈ పూజ ప్రత్యేకత. వెదురు గంప లేదా చాటలో పళ్లను ఉంచి అస్తమించే సూర్యునికి, ఉదయించే సూర్యునికి ప్రసాదంగా సమర్పిస్తారు. ఈ పూజలో ప్రధాన భాగం నదీతీరాన జరుగుతుంది కాబట్టి ఈ పూజ నదుల శుద్ధీకరణలపై కూడా దృష్టిసారించేలా చేస్తుంది. పండుగ సమయంలో ప్రసాదంగా సమర్పించే బెల్లం, చెరకు, కొబ్బరికాయ, అరటిపళ్లు, పసుపు,అల్లం ఆరోగ్యానికి కూడా మేలుచేస్తుందంటారు వైద్య నిపుణులు.