మేనిఫెస్టో ఘ‌నం.. అమ‌లు శూన్యం..

- ఎన్నిక‌ల సంద‌ర్భంగా భారీ మేనిఫెస్టో ప్ర‌క‌టించిన ఎమ్మెల్యే వివేక్
- త‌మ స‌మ‌స్య‌లు ప‌రిష్కారం అవుతాయ‌ని న‌మ్మిన జ‌నం
- ఏడాది కాలంగా ఒక్క ప్ర‌ధాన స‌మ‌స్య ప‌ట్టించుకోని వైనం
- కేవ‌లం మంత్రి ప‌ద‌వి కోసమే తిరుగుతున్నార‌న్న అప‌వాదు
- త్వ‌ర‌గా ఇచ్చిన హామీల ప‌రిష్కారం వైపు అడుగులు వేయాల‌ని కోరుతున్న ప్ర‌జ‌లు
- ఏడాది పాల‌న‌లో ఎమ్మెల్యేల ప‌నితీరుపై నాంది ప్రోగ్రెస్ రిపోర్ట్

ఎన్నిక‌ల్లో గెలిచేందుకు నేత‌లు హామీలు ఇవ్వ‌డం సాధార‌ణ‌మే.. తాము ఏం చేస్తామో..? చేయాల‌నుకుంటున్నామో..? అని ప్ర‌జ‌ల‌కు వివ‌రించి, ప్ర‌చారంలో వాటినే ప్ర‌స్తావిస్తారు. గెల‌వ‌గానే వాటి అమ‌లు కోసం ప్ర‌య‌త్నిస్తారు. అయితే, నేత‌లు భారీగా హామీలు ఇచ్చి వాటిని అమ‌లు చేయ‌కుండా నిర్ల‌క్ష్యం వ‌హిస్తే ఎలా అనేది ప్ర‌శ్నార్థ‌కంగా మారింది. ఇచ్చిన హామీల్లో మొద‌టి ఏడాదిలో అన్నింటిని నెర‌వేర్చ‌క‌పోయినా, క‌నీసం అందులో కొంత వ‌ర‌కైనా పూర్తి చేయాలి క‌దా..? క‌నీసం అటు వైపుగా అడుగులు పడాలి క‌దా అన్న‌ది ప్ర‌జాభిప్రాయం. కానీ, ఇవేమీ ప‌ట్టించుకోకుండా నేత‌లు త‌మ ప‌నుల్లో తాము బిజీ అయ్యారు. తెలంగాణ‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఏర్ప‌డి దాదాపు ఏడాది పూర్త‌వుతున్న సంద‌ర్భంగా ఎమ్మెల్యేల ప‌నితీరుపై ప్ర‌జ‌ల్లో చ‌ర్చ సాగుతోంది.

చెన్నూరు.. ఎన్నిక‌ల సంద‌ర్భంగా పొలిటిక‌ల్ హీట్ పుట్టించిన నియోజ‌క‌వ‌ర్గం.. కేసీఆర్ సొంత మ‌నిషిగా, రాజకీయాల్లో త‌న‌దైన ముద్ర వేసుకున్న బాల్క సుమ‌న్ కు… వేల కోట్ల అధిప‌తిగా, కాకా వార‌సుడిగా పేరొంది ఈసారి ఎన్నిక‌ల్లో ఎలైగానే గెలుపొంది త‌మ వార‌స‌త్వాన్ని నిలుపుకోవాల‌నే త‌ప‌న‌తో బ‌రిలోకి దిగిన గ‌డ్డం వివేక్ మ‌ధ్య పోటీ ర‌స‌వ‌త్త‌రంగా సాగింది. ఆ ఎన్నిక‌ల్లో ఇద్ద‌రు ప్ర‌త్య‌ర్థులు హామీలు గుప్పించారు. అయితే, ఈ విష‌యంలో వివేక్ వెంక‌ట‌స్వామి ఓ పెద్ద మేనిఫెస్టోనే ప్ర‌క‌టించారు. ఇప్ప‌టి వ‌ర‌కు చెన్నూరు నియోజ‌క‌వ‌ర్గం వెన‌క‌బ‌డిపోయింద‌ని తాను అధికారంలోకి వ‌స్తే నియోజ‌క‌వ‌ర్గానికి ఏం చేయ‌గ‌ల‌ను అనే అంశంపై ప్ర‌జ‌ల్లో ప్ర‌చారం చేశారు. వాస్త‌వానికి ఆయ‌న మేనిఫెస్టో చాలా పెద్ద‌గానే ఉండింది. చెన్నూరు నియోజకవర్గం లో 40 వేల మంది యువకులకు ఉద్యోగాలు ఇప్పిస్తాన‌ని హామీ ఇవ్వ‌డం మొదలుకుని, సింగ‌రేణిలో భూగ‌ర్భ‌గ‌నులు తీసుకువ‌స్తాన‌ని ఇలా పెద్ద ఎత్తున ప్ర‌చారం నిర్వ‌హించారు. అయితే, అయ‌న ప్ర‌క‌టించిన మేనిఫెస్టోలో ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క‌టి కూడా అమ‌లుకు నోచుకోక‌పోవ‌డం గ‌మ‌నార్హం.

అద్భుత‌మైన మేనిఫెస్టో.
చెన్నూరు నియోజ‌క‌వర్గానికి (Chennur Constituency) సంబంధించి పూర్తి స్థాయిలో మేనిఫెస్టో ఎంతో ఘ‌నంగా రూపొందించి దానిని ప్ర‌జ‌ల ముందు ఉంచారు. ప్ర‌చారంలో వివేక్ వెంక‌ట‌స్వామి(Vivek Venkataswamy), కాంగ్రెస్ పార్టీ నేత‌లు పెద్ద ఎత్తున ప్ర‌చారం చేశారు. ఆ మేనిఫెస్టోలో ప్ర‌ధాన అంశంగా చెన్నూరు నియోజకవర్గంలో 40 వేల మంది యువకులకు ఉద్యోగాలు క‌ల్పిస్తామ‌ని చెప్పారు. సింగరేణి ఓపెన్ కాస్ట్ లో, జైపూర్ పవర్ ప్లాంట్ లో యువకులకు ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు క‌ల్పిస్తామ‌ని హామీ ఇచ్చారు. అదే స‌మ‌యంలో సింగరేణి అనుబంధ పారిశ్రామిక సంస్థల ఏర్పాటు చేస్తామ‌ని, ఈ ప్రాంతంలో మైనింగ్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు, మందమర్రి, జైపూర్, చెన్నూరులలో మూడు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, సిరామిక్స్ టైల్స్ ఇండస్ట్రీ అభివృద్ధి చేస్తామ‌ని, అగ్రిరీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చెప్పారు. అంతేకాకుండా, చెన్నూరు పట్టణంలో అగ్రికల్చర్ మినీ యూనివర్సిటీ ఏర్పాటుతో పాటు మందమర్రి, రామకృష్ణాపూర్ ఏరియాలో వంద పడకల ప్రభుత్వ దవాఖానలు నిర్మిస్తామ‌ని హామీ ఇచ్చారు. సింగరేణి ప్రాంతంలోని అన్ని ఏరియాల్లో ఇండ్ల పట్టాలు ఇప్పిస్తాన‌ని, సింగరేణిలో కొత్త భూగర్భ గనులను తీసుకొస్తాన‌ని, సింగరేణి కార్మికులకు ఇన్కమ్ టాక్స్ మాఫీతో పాటు సింగరేణిలో ఖాళీగా ఉన్న క్వార్ట‌ర్ల‌ను సింగరేణి కార్మికులకు అందజేస్తానని వెల్ల‌డించారు. కాళేశ్వరం బ్యాక్ వాటర్ సమస్యకు కరకట్టలు నిర్మిస్తామ‌ని, ఏడాదిలో చెన్నూరు నియోజకవర్గంలో ప్రతి జర్నలిస్టుకు ఇండ్ల స్థలాలు ఇప్పిస్తాన‌ని సైతం హామీ ఇచ్చారు. ఇలా ఇంకా చాలా హామీలు వెంక‌ట‌స్వామి త‌న మేనిఫెస్టోలో పొందుప‌రిచారు.

అమ‌లులో వైఫ‌ల్య‌మే..
అయితే, ఆయ‌న ఇచ్చిన ప్ర‌ధాన‌మైన హామీల్లో ఏ ఒక్క‌టి కూడా ఇప్ప‌టి వ‌ర‌కు నెర‌వేర్చ‌లేదు. క‌నీసం అటుగా అడుగులు ప‌డిన సంద‌ర్భాలు కూడా లేవ‌ని ప‌లువురు విమ‌ర్శిస్తున్నారు. ఆయ‌న హామీల్లో క‌నీసం కొన్నింటినైనా నెర‌వేర్చి ఉంటే బాగుండేద‌ని చెబుతున్నారు. నియోజకవర్గంలో 40 వేల మంది యువకులకు ఉద్యోగాలు క‌ల్పిస్తామ‌ని చెప్పిన స‌మ‌యంలో చాలా మంది నిరుద్యోగులు ఆనందం వ్య‌క్తం చేశారు. అదే స‌మ‌యంలో సింగరేణి ఓపెన్ కాస్ట్ లో, జైపూర్ పవర్ ప్లాంట్ లో యువకులకు ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు క‌ల్పిస్తామ‌ని హామీ ఇచ్చారు. అదే స‌మ‌యంలో సింగరేణి అనుబంధ పారిశ్రామిక సంస్థల ఏర్పాటు చేస్తామ‌ని, ఆయ‌న ఇచ్చిన హామీ నెర‌వేరితే నియోజ‌క‌వ‌ర్గంలో అస‌లు నిరుద్యోగం అనేదే ఉండ‌ద‌ని స్థానిక యువ‌త సంతోషం వ్య‌క్తం చేసింది. కానీ ఇప్ప‌టి వ‌ర‌కు అలాంటిదేమీ లేద‌ని నిరాశ‌, నిస్పృహ‌లు వ్య‌క్తం చేస్తున్నారు. ఇక‌, సింగరేణిలో కొత్త భూగర్భ గనులను తీసుకొస్తాన‌ని, సింగరేణి కార్మికులకు ఆదాయ‌పు ప‌న్ను మాఫీ చేయిస్తాన‌ని కూడా ఆయ‌న చెప్పారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఓపెన్‌కాస్టులు త‌ప్ప ఒక్క భూగ‌ర్భ‌గ‌ని కూడా ప్రారంభం కాలేదు. ఇక, సింగరేణి కార్మికులకు ఆదాయ‌పు ప‌న్ను మాఫీ అనేది కేంద్ర ప్ర‌భుత్వ ప‌రిధిలో ఉంటుంది. దాని గురించి కూడా ఒక్క అడుగు కూడా ప‌డ‌లేదు.

ఇండ్ల ప‌ట్టాలు ఇవ్వ‌లేదు… ఆసుప‌త్రులు క‌ట్ట‌లేదు..
సింగరేణి ప్రాంతంలోని అన్ని ఏరియాల్లో ఇండ్ల పట్టాలు ఇప్పిస్తాన‌ని ఇచ్చిన హామీ సైతం ఏ మాత్రం అమ‌లు కావ‌డం లేదు. బీఆర్ఎస్ ప్ర‌భుత్వం హ‌యాంలో మాజీ ఎమ్మెల్యే బాల్క సుమ‌న్ ఆధ్వ‌ర్యంలో ఏడు విడ‌త‌ల్లో 3,359 ఇండ్ల‌కు ప‌ట్టాలు అందించారు. అప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు సింగ‌రేణి ప్రాంతం అటుంచి చెన్నూరు నియోజ‌క‌వ‌ర్గంలోని మంద‌మ‌ర్రి, రామ‌కృష్ణాపూర్ ప్రాంతాల్లో ఇప్ప‌టి వ‌ర‌కు ప‌ట్టాలు అందించ‌లేదు. ప‌ట్టాలు ఇచ్చే స‌మ‌యంలో ప్ర‌జ‌లు దాదాపు 800 వ‌ర‌కు డీడీలు తీశారు. వారికి ప‌ట్టాలు అందించాల్సి ఉండ‌గా, మ‌రో 1000 మంది ద‌ర‌ఖాస్తులు చేసుకోవాల్సి ఉండ‌గా చేసుకోలేదు. వారంతా ఆశ‌గా ఎదురుచూస్తున్నారు. ఇక ఏడాదిలో చెన్నూరు నియోజకవర్గంలో ప్రతి జర్నలిస్టుకు ఇండ్ల స్థలాలు ఇప్పిస్తాన‌ని సైతం హామీ ఇచ్చారు. అది కూడా ఏడాది పూర్త‌వుతున్నా అమ‌లుకు నోచ‌ని హామీగానే మిగిలిపోయింది. ఇక‌, మందమర్రి, రామకృష్ణాపూర్ ఏరియాలో వంద పడకల ప్రభుత్వ దవాఖానలు నిర్మిస్తామ‌ని చెప్పినా, దానిని సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని ప‌లువురు విమ‌ర్శ‌లు వ్య‌క్తం చేస్తున్నారు. ఇక్క‌డి నుంచి మంచిర్యాల జిల్లా కేంద్రానికి వెళ్లాలంటే జ‌నం నానా ఇబ్బందులు ప‌డాల్సి వ‌స్తోంది.

ఇలా చెప్పుకుంటూ పోతే ఇచ్చిన హామీలు ఒక్క‌టి కూడా నెర‌వేర్చ‌క‌పోవడం ప‌ట్ల చెన్నూరు నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌లు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఆయ‌న త‌న మంత్రి ప‌ద‌వి కోసం తిరగ‌డంలోనే కాలాయాప‌న చేస్తున్నార‌ని ప‌లువురు విమ‌ర్శిస్తున్నారు. ఇప్ప‌టికైనా మేనిఫెస్టోలో పొందుప‌రిచిన అంశాల‌పై దృష్టి సారించి వాటిని పూర్తి చేయాల‌ని కోరుతున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like