కార్మికుల రికార్డులు సరి చేయండి
టీబీజీకేఎస్ ఉపాధ్యక్షుడు మల్రాజు శ్రీనివాస్‌రాజు

బెల్లంపల్లి ఏరియాలోని సింగరేణి కార్మికుల రికార్డుల్లో ఏవైనా తప్పులు ఉంటే వాటిని వెంటనే సరి చేయాలని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం బెల్లంపల్లి ఏరియా ఉపాధ్యక్షుడు మల్రాజు శ్రీనివాస్‌రాజు కోరారు. ఖైరిగుడ ఓపెన్ కాస్ట్ , సివిల్ డిపార్ట్మెంట్, ఏరియా హాస్పిటల్లో అధికారులకు వినతిపత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్వీస్ బుక్ ,పెన్షన్ ఫారం, కంప్యూటరైజ్డ్, మ్యానువల్ ఈపిఆర్లు , హాస్పిటల్ బుక్ లో సింగరేణి కార్మికుల పేర్లు వివిధ రకాలుగా ఉన్నాయన్నారు. పేర్లు, అక్షర దోషాలు, పుట్టిన తేదీ కూడా కొన్ని సందర్భాల్లో తప్పుగా నమోదయినట్లు వెల్లడించారు. వీటన్నింటని సరిచేసి అన్ని రికార్డులలో ఒకే విధంగా ఉండేలా చూడాలని కోరారు. ఈ మేరకు బెల్లంపల్లి ఏరియా స్థాయి లో , గని లేదా డిపార్ట్మెంట్ స్థాయి అధికారులతో ఒక కమిటీ వేసి ఉద్యోగులందరి పర్సనల్ రికార్డుల్లో ఉన్న వివరాల్లో మార్పులు చేర్పులు చేయాలని కోరారు.
కార్మికుడు అన్‌ఫిట్, పదవీ విరమణ పొందిన, మరణించిన సమయాల్లో రికార్డుల్లో తప్పులు ఉన్నాయని నెలల కొద్దీ తిప్పించుకుంటున్నారని శ్రీనివాస్‌రావు ఆందోళన వ్యక్తం చేశారు. కొన్ని సందర్భాలలో ఉద్యోగం కూడా రాదని చెప్తున్నారని దుయ్యబట్టారు. కార్మికుల రికార్డులు సరిగా ఉంచాల్సిన పర్సనల్ డిపార్ట్మెంట్ అధికారులే కార్మికులకు వ్యతిరేకంగా వ్యవహరించడాన్ని తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం తీవ్రంగా ఖండిస్తున్నదన్నారు. ఏరియా స్థాయిలో వెంటనే జనరల్ మేనేజర్ చొరవ తీసుకుని కమిటీ వేసి కార్మికుల రికార్డులు సరిచేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఫిట్ కార్యదర్శులు వెంకటేశం, వీరన్న, తిరుపతి, రవీందర్ నాయకులు వెంకటేశం, చంద్రశేఖర్, అంజయ్య, నారాయణ, మొగిలయ్య కుమార్, తాటికొండ వెంకటేష్ , కొగిలాల రవీందర్, శ్రీనివాస్ విజ్జన్న, సీతారాం సంతోష్ , గెల్లి రాయలింగు, సోకాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు