కాంగ్రెస్ కబంధ హస్తాల నుంచి ప్రజల్ని కాపాడుకుందాం
-మరో సంకల్ప దీక్ష చేపట్టాల్సిన తరుణం ఆసన్నమైంది
-మళ్లీ సమైక్య పాలన రోజులే గుర్తుకు వస్తున్నాయి
-ప్రజలంతా తిరిగి కేసీఆర్ నాయకత్వాన్ని, ఆనాటి పాలనను కోరుకుంటున్నారు
-అధికార మదంతో వేధించే వారికి తగిన బుద్ధి చెప్తాం
-స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉండండి
-మంచిర్యాల బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్
BRS Diksha Diwas: కాంగ్రెస్ పాలనలో సమైక్య రాష్ట్రం ప్రతి వర్గం, ప్రతి మనిషి బతుకు ఛిద్రం అయ్యిందని, ఇప్పుడు అదే దుస్థితి నెలకొందని, కేసీఆర్ చేసిన దీక్షా దివస్ నుంచి స్ఫూర్తి పొంది.. కాంగ్రెస్ కబంధహస్తాల నుంచి నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలను కాపాడుకోవటానికి మరో సంకల్ప దీక్ష చేపట్టాల్సిన తరుణం ఆసన్నమైందని బీఆర్ఎస్ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ స్పష్టం చేశారు. దీక్షా దివస్ సందర్భంగా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. నవంబర్ 29, 2009న కేసీఆర్ చేపట్టిన నిరాహార దీక్ష తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పిన రోజన్నారు. రాష్ట్ర కల సాకారానికి పునాది వేసిన రోజుగా తెలంగాణ చరిత్రలో నిలిచిపోయే శుభదినమన్నారు. సమైక్య పాలనలోని రోజులే మళ్లీ కనిపిస్తున్నాయన్నారు. కాంగ్రెస్ రాగానే అవే నిర్భంధాలు, అణచివేతలు, అవే దుర్భర పరిస్థితుల నేపథ్యం కనిపిస్తున్నాయన్నారు.
ఆనాడు ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ సాధించిన కేసీఆర్ స్ఫూర్తితో నేడు మళ్లీ రెండు జాతీయ పార్టీల మెడలు వంచాల్సిన పరిస్థితి ప్రతి పౌరునిపై ఉందన్నారు. కాంగ్రెస్‌కు అధికారం ఇస్తే తెలంగాణ మళ్లీ అదే అంధకారమనే పరిస్థితి వచ్చింది. ఒక్క వర్గం కాదు.. సంపన్న వర్గాల నుంచి అట్టడుగు వర్గాల వరకు అందరూ బాధపడుతున్నారని సుమన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రోజు ప్రజలంతా తిరిగి కేసీఆర్ నాయకత్వాన్ని, ఆనాటి పాలనను కోరుకుంటున్నారని గుర్తు చేశారు. దాని కోసం పార్టీ శ్రేణులు కలిసికట్టుగా ముందుకు వెళ్లాల్సిన సందర్భమని గుర్తు చేశారు. తెలంగాణపై కేసీఆర్ ఏ విధంగా చెరగని ముద్ర వేశారో మళ్లీ గుర్తు చేసుకుంటూ రెండు జాతీయ పార్టీలకు బుద్ధి చెప్పేందుకు కదం తొక్కుదామని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ పార్టీకి ప్రజల పక్షాన ఆలోచన లేదని, నిర్బంధం, నియంతృత్వం మీద ఉన్న శ్రద్ధ ప్రజలపై లేదని దుయ్యబట్టారు. రాష్ట్రంలో విధ్వంసం తప్ప వికాసం లేదన్నారు. జిల్లాలో విద్వేష రాజకీయాలు మానుకోవాలని హెచ్చరించారు. బీఆర్ఎస్ కార్యకర్తలు అందరూ మరొకసారి ప్రజల పక్షాన పోరాటానికి సిద్ధం కావాలని, కొమురం భీం చాకలి ఐలమ్మ స్ఫూర్తితో ప్రజల కోసం బలమైన గొంతుకగా నిలవాలని కోరారు. ఒకప్పుడు కల్లోలిత ప్రాంతంగా ఉన్న మంచిర్యాల జిల్లాలో పదేళ్లు ప్రశాంతమైన పరిపాలన అందించాం. ఇప్పుడు జిల్లాలో సబండ వర్గాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
అధికారం ఎవరికి శాశ్వతం కాదు. అధికార మదంతో వేధించే వారికి బుద్ధి చెప్తామని తీవ్రంగా హెచ్చరించారు. స్థానిక సంస్థల ఎన్నికలకు జిల్లా పార్టీ శ్రేణులు అందరూ సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి మంచిర్యాల జిల్లా ఇన్చార్జి తుల ఉమ, మంచిర్యాల మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు, బెల్లంపల్లి మాజీ శాసనసభ్యులు దుర్గం చిన్నయ్య, మంచిర్యాల, చెన్నూర్, బెల్లంపల్లి మూడు నియోజకవర్గాల బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అనుబంధ సంఘాల సభ్యులు పాల్గొన్నారు.