నకిలీ విత్తనాల దందా గుట్టురట్టు

ఆసిఫాబాద్‌ జిల్లాలో నకిలీ పత్తి విత్తనాల అక్రమ రవాణా గుట్టురట్టైంది. సుమారు రూ.4 లక్షల విలువైన 200 కిలోల నకిలీ పత్తి విత్తనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్‌ చేసి జ్యుడీషియల్‌ రిమాండ్‌కు తరలించారు.

నకిలీ పత్తి విత్తనాల అక్రమ రవాణాపై ఆసిఫాబాద్‌ పోలీసులు కొరడా ఝళిపించారు. ఈ నెల 11న రాత్రి విశ్వసనీయ సమాచారం మేరకు ఆదిలాబాద్‌ X రోడ్‌ వద్ద పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు.

ఈ క్రమంలో అనుమానాస్పదంగా వచ్చిన బ్లాక్‌ కలర్‌ కియా కారును పోలీసులు ఆపి తనిఖీ చేశారు. కారులోని నాలుగు పాలిథిన్‌ బ్యాగుల్లో సుమారు 200 కిలోల అనుమానిత నకిలీ పత్తి విత్తనాలు గుర్తించారు. వీటి విలువ సుమారు రూ.4 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు.

కారులో ఉన్న భీమిని మండలం పెద్దపేట గ్రామానికి చెందిన షేక్‌ సల్మాన్‌.. సిరిసిల్ల జిల్లా మర్రిగడ్డ గ్రామానికి చెందిన అరే వెంకటగోపాల్‌ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ప్రాథమిక దర్యాప్తులో నిందితులు నకిలీ పత్తి విత్తనాలను అధిక దిగుబడినిచ్చే అసలైన విత్తనాలుగా నమ్మించి రైతులకు విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. పెద్ద మొత్తంలో నకిలీ విత్తనాలను కొనుగోలు చేసి, వివిధ ప్రాంతాలకు తరలించి రైతులకు విక్రయిస్తున్నట్లు దర్యాప్తులో ఆధారాలు లభించినట్లు తెలిపారు.

విత్తనాల రవాణాకు ఉపయోగించిన కియా కారు TG19 B 1120తో పాటు మొబైల్‌ ఫోన్‌ పోలీసులు సీజ్‌ చేశారు. ఆసిఫాబాద్‌ జిల్లాలోని వివిధ పోలీస్‌ స్టేషన్ల పరిధిలో నకిలీ పత్తి విత్తనాల అక్రమ రవాణా, విక్రయానికి సంబంధించి నిందితులపై కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. ఇద్దరు నిందితులను అరెస్ట్‌ చేసి న్యాయస్థానం ముందు హాజరుపరచగా కోర్టు జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించింది.

రైతులు విత్తనాలను అధీకృత డీలర్ల వద్ద మాత్రమే కొనుగోలు చేయాలని పోలీసులు సూచించారు. విత్తనాలు కొనుగోలు చేసేటప్పుడు తప్పనిసరిగా బిల్లులు తీసుకోవాలని తెలిపారు. నకిలీ విత్తనాల విక్రయం లేదా అక్రమ రవాణాపై సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు లేదా వ్యవసాయ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు.

You might also like