అదిగో పులి… ఇదిగో తోక‌…

Tiger: కొమురం భీమ్ ఆసిఫాబాద్‌ జిల్లాను పులి వణికిస్తున్నది. మనిషి రక్తం రుచి మరిగిన పెద్ద పులి తిరుగుతుండ‌టంతో అటు అధికారులు, ఇటు ప్ర‌జ‌ల‌కు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. కాగజ్‌నగర్‌ మండలంలో ఓ పత్తి చేనులో శుక్రవారం ఓ యువతిని పొట్టనపెట్టుకున్న పెద్ద పులి.. సిర్పూ రు టౌన్‌ దుబ్బగూడ సమీపంలోని పత్తి చేల్లో శనివారం మళ్లీ పంజా విసిరింది. తన పొలంలో పత్తి ఏరుకుంటున్న రౌతు సురేశ్‌ అనే రైతుపై వెనుక నుంచి దాడి చేసింది. ప‌శువుల‌పై సైతం దాడి చేసిన పులి సిర్పూర్ (టి) మండటం ఇటిక్యాల పహాడ్ వాగు ప‌రిస‌ర ప్రాంతాల్లో త‌చ్చాడుతోంది. పులి పాదముద్రలను గుర్తించిన అటవీశాఖ అధికారులు దానిని ఎప్ప‌టిక‌ప్పుడు ట్రాక్ చేస్తున్నారు. పులి మానటరింగ్‌ కోసం 10 ప్రత్యేక బృందాలను, 200 ట్రాప్‌ కెమెరాలను ఏర్పాటు చేశారు. పులి ఆచూకీని గుర్తించేందుకు డ్రోన్‌ను వినియోగించి మహారాష్ట్రకు రెండు కిలో మీటర్ల దూరంలో పులి ఉన్నట్టు గుర్తించారు.

పులి దాడి చేసిన ప్రాంతాలతోపాటు చుట్టుపక్కల గ్రామాల్లో 144 సెక్షన్‌ అమలు చేస్తున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య మాత్రమే పొలం పనులకు వెళ్లాలని సూచిస్తున్నారు. ఉన్న‌తాధికారులు ఎప్ప‌టిక‌ప్పుడు ప‌రిస్థితి స‌మీక్షిస్తూ ప్ర‌జ‌ల‌ను అప్ర‌మ‌త్తం చేస్తున్నారు. అదే స‌మ‌యంలో వారికి మాస్క్‌లు పంపిణీ చేస్తూ వాటిని త‌ల వెన‌క భాగంలో త‌గిలించుకోవాల‌ని సూచిస్తున్నారు. ఇలా, అధికారులు, ప్ర‌జ‌లు పులి సంచారం ప‌ట్ల చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు. నవంబర్‌లో సహజంగా మగ ఆడ పులులు జతకట్టే సమయం అని, తమ జోడు కోసం అడవిలో ఎకువ దూరం ప్రయాణం చేస్తుంటాయని అధికారులు చెప్పారు. ఈ సమయంలో పులులు సహజంగా కొంత ఉద్రేకంతో ఉంటాయని తెలిపారు.

ఇదంతా ఒక్కెత్తు కాగా, కొంద‌రు ఇదిగో పులి అంటే అదిగో తోక అన్న చందంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. మ‌రీ ముఖ్యంగా సోష‌ల్ మీడియాలో ఇత‌ర ప్రాంతాల్లోని ఫోటోలు, పాత వీడియోలు పెడుతూ పులి ఇక్క‌డ తిరుగుతోంది… అక్క‌డ తిరుగుతోంద‌ని ప్ర‌చారం చేస్తున్నారు. ప‌త్తి చేనులో ఉన్న నాలుగు పులులకు సంబంధించి ఓ పాత ఫొటో పెట్టి సిర్పూర్ ప్రాంతంలో తిరుగుతోంద‌ని ప్ర‌చారం చేస్తున్నారు. తాజాగా రెండు పులులు నీళ్లు తాగుతున్న ఓ ఫోటో పెట్టి ద‌హెగాం మండ‌లం రాళ్ల‌గూడ స‌మీపంలో పులులు తిరుగుతున్న‌ట్లు ప్ర‌చారం చేస్తున్నారు.

ఇలా త‌ప్పుడు ప్ర‌చారం చేయ‌డం ప‌ట్ల అధికారులు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. త‌ప్పుడు ప్ర‌చారంతో ప్ర‌జ‌లు భ‌యాందోళ‌న‌ల‌కు గుర‌య్యే అవ‌కాశం ఉన్న నేప‌థ్యంలో క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చ‌రిస్తున్నారు. ఇలాంటి ప్ర‌చారం స‌రికాద‌ని, త‌ప్పుడు ప్ర‌చారం చేయ‌వ‌ద్ద‌ని అట‌వీశాఖ అధికారులు వెల్ల‌డించారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like