ఆ ముగ్గురి మృతికి కారణమిదే..
Bibipet Mystery Deaths : కామారెడ్డిలో ఎస్ఐ, ఒక మహిళా కానిస్టేబుల్‌తో పాటు మరో వ్యక్తి మృతి చెందిన ఘటనపై పోలీసులు పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. బిక్కనూర్ ఎస్సై సాయికుమార్, బీబీపేట పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న శృతి, బీబీపేటలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న నిఖిల్ ముగ్గురు అడ్డూర్ లోని ఎల్లారెడ్డి పెద్ద చెరువులో పడి మృత్యువాతపడిన ఘటన తెలిసిందే. అయితే, ఈ ముగ్గురివి ఆత్మహత్యలా, ఏవైనా గొడవలు జరిగాయా..? మరెవరైనా హత్య చేశారా..? ఇలా అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేశారు.
ఎస్సై సాయికుమార్, కానిస్టేబుల్ శ్రుతి, నిఖిల్ చెరువులో మునిగిపోవడం వల్లే మరణించారని పోస్ట్‌మార్టం రిపోర్డులో వెల్లడైంది. ముగ్గురి శరీరాలపై ఎలాంటి గాయాలు లేవని వైద్యులు నిర్థారించారు. శ్రుతి, నిఖిల్ ఆత్మహత్య గురించి మాట్లాడుకున్నట్లు వాట్సాప్ సందేశాలు ద్వారా గుర్తించారు. అయితే వీరితో సాయికుమార్‌కు సంబంధం ఏంటనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. ముగ్గురు శరీరాలపై ఎలాంటి గాయాలు లేవని, నీటిలో ఊపిరాడకే మృతిచెందినట్లు వైద్యులు నిర్థారించారు. ముగ్గురూ కలిసే చనిపోయారా..? లేక ఒకరు ఆత్మహత్యకు యత్నిస్తే కాపాడే క్రమంలో మిగతా ఇద్దరూ మరణించారా..? అనే కోణంలో పోలీసులు విచారణ ప్రారంభించారు. ముగ్గురి సెల్‌ఫోన్లు 25 తారీఖున స్విచ్ ఆఫ్ అయినట్లు గుర్తించిన పోలీసులు, భిక్కనూర్ పోలీస్ స్టేషన్ నుంచి వారు మరణించిన అడ్లూర్ ఎల్లారెడ్డి చెరువు వరకూ దారి పొడవునా ఉన్న సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.
ముగ్గురి కాల్‌డేటా, వాట్సప్ చాటింగ్‌లను పరిశీలించగా శ్రుతి, నిఖిల్ మధ్య ఆత్మహత్యకు సంబంధించి సంభాషణ జరిగినట్లు తెలుస్తోంది. వారిద్దరూ నేను చనిపోతానంటే, నేను చనిపోతానంటూ వాట్సప్‌లో చాటింగ్ చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆత్మహత్య చేసుకోవాలనుకున్న విషయాలను సైతం ఎస్సై సాయికుమార్‌తో చర్చించినట్లు తెలుస్తోంది. అయితే సాయికుమార్‌కు చెందిన మూడు సెల్‌ఫోన్లలో రెండు లాక్ అయి ఉన్నాయని, వాటి పరిశీలించిన తర్వాతే మిగతా విషయాలు తెలుస్తాయని పోలీసులు తెలిపారు. ఈ కేసులో నిజాలు నిగ్గుతేల్చేందుకు అడ్లూరు ఎల్లారెడ్డి చెరువు వద్ద పోలీసులు సీన్ రీకన్స్ట్రక్షన్ చేపట్టారు. ముగ్గురు ఎలా చేరుకున్నారనే దానితో పాటు ఇక్కడికే ఎందుకు వచ్చారనే దానిపై ప్రధానంగా దృష్టి సారించారు. 2018 బ్యాచ్‌కి చెందిన పోలీసుల నుంచి ఎస్సై సాయికుమార్ నడపడిక ఇతరత్రా విషయాలను ప్రత్యేక బృందం సేకరిస్తోంది.
మెదక్ జిల్లాకు చెందిన సాయికుమార్‌ది పేద కుటుంబం. కష్టపడి పైకి వచ్చిన ఆయన ఎస్సై ఉద్యోగం తర్వాత 2022లో కర్నూల్ జిల్లా నంద్యాలకు చెందిన మహాలక్ష్మిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి రెండేళ్ల కుమారుడు ఉన్నాడు. మహాలక్ష్మి ప్రస్తుతం ఐదు నెలల గర్భవతి. ఎస్సై సాయికుమార్ ఆత్మహత్య చేసుకునేంత పిరికి వాడు కాదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఇక గాంధారి మండలం గుర్జాల్ గ్రామానికి చెందిన కానిస్టేబుల్ శ్రుతిది కూడా సాధారణ స్థాయి కుటుంబమే. 2014లో కానిస్టేబుల్‌గా ఎంపికైన ఆమె గాంధారిలో ఆరేళ్లు, కామారెడ్డిలో ఏడాది పాటు విధులు నిర్వహించింది. గతంలోనే వివాహమై విడాకులు కూడా తీసుకున్న శ్రుతి మూడేండ్లుగా బీబీపేటలో విధులు నిర్వహిస్తుంది. సాయికుమార్ బీబీపేట ఎస్సైగా ఉన్న సమయంలోనే ఆమెతో పరిచయం ఏర్పడిందని, వీరిద్దరూ చనువుగా ఉండేవారని స్థానికులు చెబుతున్నారు. ఆయన బదిలీపై భిక్కనూరుకు వెళ్లగా, బీబీపేటకు చెందిన నిఖిల్‌తో శ్రుతికి పరిచయం పెరిగింది. నిఖిల్ వయస్సులో శ్రుతి కంటే చిన్నవాడు. వీరు వివాహం కూడా చేసుకోవాలనుకున్నారు. కానీ బీబీపేట కేంద్రంగా మొదలైన వీరి పరిచయాల పర్వం.. చివరకు ముగ్గురి ప్రాణాలను బలి తీసుకుంది.
మొదటగా ఆత్మహత్య చేసుకోవడానికి శృతి చెరువులో దూకింది. శృతి తర్వాత దూకిన నిఖిల్, ఈత రాకపోవడంతో నిఖిల్ గల్లంతయ్యాడు. శృతి కాపాడమని అడగడంతో ఎస్సై సాయి కుమార్ చెరువులోకి దూకినట్లు తెలుస్తోంది. చెరువు పెద్దది కావడంతో సాయి కుమార్ నీట మునిగారు. ముగ్గురికి ఈత రాకపోవడంతో ఊపిరి ఆడక ముగ్గురు మృతిచెందాడని చెబుతున్నారు. కానిస్టేబుల్ శృతిని కాపాడే ప్రయత్నంలో ఎస్సై సాయికుమార్, ఆపరేటర్ నిఖిల్ ఇద్దరు చెరువులోకి దూకినట్లు పోలీసులు గుర్తించారు.