రైతుల పేరిట వంద‌ల క్వింటాళ్ల విక్ర‌యాలు

Cotton Corporation Of India: ఓ రైతు నేరుగా సీసీఐకి ప‌త్తి అమ్మాలంటే పెద్ద ఎత్తున నిబంధ‌న‌లు.. తేమ పేరిట కొర్రీలు… ఇలా రైతుల‌ను నానా ఇబ్బందుల‌కు గురి చేసి వారు ప్రైవేటుకు అమ్ముకునేలా చేసే సీసీఐ అధికారులు.. కొంద‌రు రైతుల పేరిట మాత్రం వంద‌ల క్వింటాళ్ల ప‌త్తి అమ్మిన‌ట్లు లెక్క‌లు చూపుతున్నారు. ఒక్క రైతు పేరిట వంద‌ల క్వింటాళ్లు అమ్మ‌డం ఏమ‌టని విజిలెన్స్ అధికారులు ఆరా తీస్తున్నారు.

సీసీఐ కొర్రీలతో పంట ప్రైవేట్‌పరం..
ప్రైవేట్‌ వ్యాపారులు పంటలను ఇష్టారీతిన కొనుగోలు చేస్తారనే ఉద్దేశంతో భారత ప్రభుత్వం పత్తి రైతులకు మద్దతు ధర కల్పించేందుకు భారత పత్తి సంస్థ(సీసీఐ) ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలను ప్రతి ఏటా ఏర్పాటు చేస్తున్నది. కానీ.. ప్రభుత్వ ఉద్దేశం నెరవేరకపోగా పరిస్థితి భిన్నంగా ఉంటోంది. మద్దతు ధర కోసం పంటను సీసీఐ కేంద్రాలకు తీసుకెళ్తున్న రైతులు అక్కడే అదే జిన్నింగ్‌ మిల్లు యజమానికి అడ్డికి పావుశేరుకు అమ్ముకోవాల్సిన దుస్థితి నెలకొంది. ఎన్నో ఆశలతో పంటను సీసీఐ కేంద్రాలకు తీసుకొచ్చిన రైతులకు అనేక చిక్కులు ఎదురవుతున్నాయి. రైతులు తీసుకొచ్చిన పంటకు సంబంధించిన వాహనంలో అడుగడుగునా తేమశాతం నిర్ధారణ యంత్రాలను ఉపయోగించి తిర‌స్క‌రిస్తున్నారు. దీంతో పంటను తిరిగి ఇంటికి తీసుకెళ్లలేక సూపర్‌ క్వాలిటీ ఉన్న పంటను సైతం అదే కేంద్రంలో అదే జిన్నింగ్‌ మిల్లు యజమానికి క్వింటాకు రూ. 6 వేల నుంచి రూ.6,300 వరకు అమ్ముకుంటున్నారు. కావాలని రైతులను ఇబ్బంది పెట్టి మరీ ఎట్టకేలకు మిల్లు ఓనర్లకు పంటను అమ్ముకునే విధంగా సీసీఐ అధికారులు ప్రవర్తిస్తున్నారు.

పేచీల పేరుతో ప్రైవేట్‌లో కొత్త చిక్కులు
ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లాలో 18 మార్కెట్ యార్డుల ప‌రిధిలో 24 సీసీఐ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్లోని పత్తి యార్డులో ఖరీదుదారులు రెండు మూడ్రోజుల నుంచి పేచీల పేరుతో పత్తి రైతులను చిత్తు చేస్తున్నారు. సీసీఐ కేంద్రాల తంతును పసిగట్టిన ప్రైవేట్‌ వ్యాపారులు పాత పద్ధతికి పదును పెట్టారు. పత్తియార్డులో జాతీయ అగ్రీమార్కెట్‌ విధానం(ఈ నామ్‌) అమలులో ఉన్నప్పటికీ ఉదయం 8 నుంచి 9 గంటలలోపే పత్తి ఖరీదుల ప్రక్రియ పూర్తి అవుతున్నది. పంటకు ఎంత ధర సీక్రెట్‌ బిడ్డింగ్‌లో రాబోతుందో కేవలం రెండు గంటల ముందే ప్రతి రైతుకు తెలుస్తుంది. అయితే పంటను పూర్తిగా పరిశీలన చేసి బిడ్‌ చేస్తున్న ఖరీదుదారులు తీరా కాంటాల సమయంలో పంట నాణ్యత లేదని కొర్రీలు పెడుతూ ధరలో కోత పెడుతున్నారు. ఈ నామ్‌ విధానంలో పేచీలకు ఎట్టి పరిస్థితిలో స్థానం లేకపోయినా ఖరీదుదారులు మాత్రం తమ పాత విధానాన్ని మరోమారు తెరపైకి తీసుకొచ్చి సొమ్ము చేసుకుంటున్నారు.

సీసీఐ కేంద్రాల వద్ద కొరవడిన నిఘా..
సీసీఐ కేంద్రాల్లో ప్రైవేట్‌ దందా, తేమ శాతం కొర్రీలను క్షేత్రస్థాయిలో చూసే ప్రభుత్వ అధికారులు కరువయ్యారు. వ్యవసాయ శాఖ విస్తరణ అధికారులు ఆయా జిన్నింగ్‌ మిల్లుల వద్ద ఉండి రైతుల సందేహాలను నివృత్తి చేయాలి. ఈ ప్రక్రియను పర్యవేక్షణ చేసేందుకు వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు సైతం నిరంతరం పర్యవేక్షణ చేయాలి. వీరితోపాటు జిన్నింగ్‌ మిల్లుల సమీపంలోని మార్కెట్‌ కమిటీ సెక్రటరీలు, జిల్లా మార్కెటింగ్‌ శాఖ అధికారి నిరంతరం పర్యవేక్షణ చేయాలి. కానీ.. కేవలం మార్కెట్‌ కమిటీకు చెందిన డేటా ఎంట్రీ ఆఫీసర్‌ మినహాయించి సీసీఐ కేంద్రాల్లో ఇతర అధికారుల పర్యవేక్షణ పూర్తిగా కొరవడింది. అలా వచ్చామా, ఇలా వెళ్లామా సోషల్‌ మీడియాలో ఫొటో అప్‌లోడ్‌ చేశామా అన్నట్లు అధికారులు వచ్చిపోతున్నారని, తమ సమస్యలు వినే నాధుడు లేడని రైతులు వాపోతున్నారు.

అస‌లు ద‌గా ఇక్క‌డే…
ఇక సీసీఐలో అధికారులు చేస్తున్న ప‌నులు చూస్తుంటే కండ్లు బైర్లు క‌మ్మాల్సిందే.. మ‌రీ ముఖ్యంగా రైతుల‌కు కొర్రీలు పెట్టి ప్రైవేటు వ్యాపారుల ప‌త్తిని రైతుల పేరిట కొనుగోలు చేస్తున్నార‌నే విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. ఆదిలాబాద్ లో కొంద‌రు రైతుల పేరిట వంద‌ట క్వింటాళ్ల ప‌త్తి విక్ర‌యాలు జ‌రిగిన‌ట్లు గుర్తించారు. ఈ మేర‌కు అధికారులు లెక్క‌లు తీస్తున్నార‌. ఈ మేర‌కు జిల్లాలోని పత్తి కొనుగోళ్లపై సీసీఐ విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. దీంతో విజిలెన్స్ అధికారులు ఈ వ్య‌వహారంపై ఆరా తీస్తున్నారు. రైతుల పేరిట వందల క్వింటాళ్ల పత్తి విక్రయాలపై అనుమానం వ్య‌క్తం అవుతున్నాయి. ఆ రైతుల‌కు వాస్తవానికి భూమి ఎంత ఉంది..? వందల క్వింటాళ్ల పత్తి దిగుబడి నిజమేనా..? అనే కోణంలో విచారణ నిర్వ‌హిస్తున్నారు..

అంత దిగుబ‌డి సాధ్య‌మేనా..?
వాస్త‌వానికి ఒక్క ఎకరాకు సరాసరి 8 క్వింటాళ్ల పత్తిమాత్రమే దిగుబడి వచ్చినట్టు వ్యవసాయశాఖ అంచనా వేసింది. ఒక్క ఎకరాకు 12 క్వింటాళ్ల చొప్పున విక్రయించే నిబంధ‌నలున్నాయి. ఈ నేప‌థ్యంలోనే ఒకే రైతు పేరిట వంద‌ల క్వింటాళ్ల విక్ర‌యాలు ఎలా జ‌రుగుతాయ‌నే విష‌యంలో అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి. ఆదిలాబాద్ అర్బన్ లో ఒక్క రైతు పేరిట 336 క్వింటాళ్ల పత్తి విక్రయం జ‌ర‌ప‌గా, ఆదిలాబాద్‌రూరల్ మండలానికి చెందిన రైతు పేరిట 306 క్వింటాళ్లు, గుడిహత్నూర్ మండలంలో ఒకే ఓ మహిళా రైతు పేరిట 312 క్వింటాళ్లు, జైనథ్ మండలంలోని ఓ రైతు పేరిట 266 క్వింటాళ్లు, తలమడుగు మండలంలో రైతు పేరిట ఏకంగా 280 క్వింటాళ్ల పత్తి విక్ర‌యాలు జ‌రిగిన‌ట్లు గుర్తించారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like