దిలావర్పూర్ మండలంలో చిరుత సంచారం
నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలంలో చిరుతపులి సంచారం కలకలం రేపింది. భైంసా, నిర్మల్ జాతీయ రహదారి కాల్వ శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ పరిధిలో సోమవారం అర్ధరాత్రి చిరుత వాహనదారులకు కనిపించింది. అటుగా వెళుతున్న ప్రయాణికులు చిరుత సంచారాన్ని వారి మొబైల్ ఫోన్లలో చిత్రీకరించారు. అటువైపుగా వెళ్లే రైతులు, ప్రయాణికులు జాగ్రత్తగా ఉండాలని దిలావర్పూర్ పోలీసులు తెలిపారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో చిరుతపులులు సంచరిస్తున్నాయి. మంచిర్యాల సమీపంలోని ఏసీసీ క్వారీ అటవీ ప్రాంతంలో సంచరించిన చిరుతపులి సీసీటీవీ కెమెరా ట్రాప్ లో రికార్డు అయ్యింది. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని ఆసిఫాబాద్-కాగజ్‌నగర్ క్రాస్ రోడ్డు సమీపంలో ఎన్‌హెచ్ 363 రోడ్డు దాటుతుండగా చిరుతపులి కనిపించింది. జాతీయ రహదారిపై వాహనదారులు చిరుతపులిని వీడియో తీశారు. రెబ్బెన మండలం అమీన్‌పూర్ గ్రామ అడవుల్లో కొద్దిరోజుల కిందట చిరుతపులి అడవి పందిని చంపింది. అయితే అది పులి అని స్థానికులు భావించారు. సంఘటనా స్థలాన్ని సందర్శించి పగ్‌మార్క్‌లను నమోదు చేసిన అటవీశాఖాధికారులు దానిని చిరుతపులి అని స్పష్టం చేశారు. మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం రాపెల్లి, గుడిపేట గ్రామాల మధ్య అక్టోబర్ 29వతేదీ రాత్రి గొర్రెల గొర్రెల మందపై చిరుతపులి దాడి గొర్రెలను చంపింది.