మావోయిస్టు అగ్రనేత తారక్క లొంగుబాటు
Top Maoist leader surrenders: కొత్త సంవత్సరం మొదటి రోజే మావోయిస్టు పార్టీకి పెద్ద ఎదురుదెబ్బ తాకింది. కేంద్ర కమిటీ సభ్యుడు, అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ సహచరి తారక్క అలియాస్ విమల లొంగిపోయారు. బుధవారం మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఎదుట ఆమె లొంగిపోయారు. ఆమె మావోయిస్టు పార్టీ స్పెషల్ జోనల్ కమిటీ సభ్యురాలిగా ఉన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రానికి చెందిన మల్లోజుల కోటేశ్వర్ రావు, మల్లోజుల వేణుగోపాల్ అన్నదమ్ములు. కోటేశ్వర్ రావు అలియాస్ కిషన్ జీ మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యుడిగా ఉన్న సమయంలోనే పశ్చిమబెంగాల్ లో జరిగిన ఎన్‌కౌంటర్ లో మృతిచెందారు. ఆయన సోదరుడు వేణుగోపాల్ ప్రస్తుతం సెంట్రల్ కమిటీ సభ్యుడిగా పని చేస్తున్నారు. తారక్క అలియాస్ విమల 1983లో పీపుల్స్ వార్ పార్టీలో చేరారు. ఆమెపై నాలుగు రాష్ట్రాల్లో 170కి పైగా కేసులు ఉన్నాయి. ఆమెపై రూ.కోటి రివార్డు ఉంది. ఆమెతో పాటు పది మంది సీనియర్ మావోయిస్టులు లొంగిపోవడం గమనార్హం. దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్(DKSZCM) సభ్యురాలు తారక్క, (CCM సోను @ భూపతి భార్య) DVCM ర్యాంక్‌లోని ముగ్గురు సీనియర్ మావోయిస్టులతో పాటు, ఒక డిప్యూటీ కమాండర్, ఇద్దరు ACM స్థాయి మావోయిస్టులు, నలుగురు ప్లాటూన్ సభ్యులు సీఎం ఎదుట లొంగిపోయారు.
సిడాం విమల చంద్ర అలియాస్ తారక్క అలియాస్ వత్సల మావోయిస్టు పార్టీలో అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చారు. అమెను 1986లో అహేరి LOS సభ్యురాలిగా నియమించారు. 1987లో పెరిమిలికి బదిలీ చేయగా, 1994లో పెరిమిలి LOSలో పార్టీ సభ్యురాలిగా పదోన్నతి పొందారు., 1994లో ACM హోదా, 1995లో పెరిమిలి LOS కమాండర్ గా వ్యవహరించారు. ఆ తర్వాత భమ్రాగఢ్ LOS కమాండర్‌గా పదోన్నతి పొంది 2006 వరకు భామ్రాగఢ్ ప్రాంతంలో AC సెక్రటరీగా పనిచేశారు. 2006లో దక్షిణ గడ్చిరోలి డివిజన్‌లో DVCM (డివిజనల్ కమిటీ సభ్యురాలి)గా పదోన్నతి పొంది 2010 వరకు పనిచేశారు. 2010లో కంపెనీ నంబర్ 09 (నిబ్ కంపెనీ)కి బదిలీ అయ్యి సెప్టెంబర్ 2018 వరకు పనిచేశారు. సెప్టెంబర్ 2018లో రాహికి బదిలీ కాగా, అక్కడ సెప్టెంబర్ 2024 వరకు పనిచేశారు. సెప్టెంబరు 2024లో DKSZCM (దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యురాలి)గా పదోన్నతి పొందిన తారక్క ఇప్పటి వరకు DK వైద్య బృందానికి ఇన్‌ఛార్జ్‌గా పనిచేశారు.