అష్టదిగ్బంధం
ఈ ఫార్ములా రేసు వ్యవహారంలో కేటీఆర్ ను అష్టదిగ్బంధం చేసేలా కనిపిస్తోంది. ఫార్ములా ఈ కార్ కేసులో హైకోర్టులో (Telangana Highcourt) కేటీఆర్‌కు (KTR) చుక్కెదురైన విషయం తెలిసిందే. ఏసీబీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ కేటీఆర్ వేసిన క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు ధర్మాసనం కొట్టివేసింది. ఈ నేపథ్యంలోనే ఆయన చుట్టూ పక్కా ప్రణాళికలు వేసి తప్పించుకోకుంండా ప్రభుత్వం ముందుకు సాగుతోంది.
ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) దూకుడు పెంచింది. ఈ కేసుకు సంబంధించి సుప్రీం కోర్టులో తెలంగాణ సర్కార్ కేవియట్ పిటిషన్‌ను దాఖలు చేసింది. కేటీఆర్ వేసిన క్వాష్ పిటిషన్ హైకోర్టు ధర్మాసనం కొట్టేసిన నేపథ్యంలో ఈ హైకోర్టు తీర్పును కేటీఆర్ సుప్రీంలో సవాలు చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ముందుగానే అలర్ట్ అయిన సర్కార్ సుప్రీంలో కీలక పిటిషన్‌ను దాఖలు చేసింది. తమ వాదనలు వినకుండా కేటీఆర్ పిటీషన్‌పై ఎటువంటి నిర్ణయం తీసుకోవద్దంటూ తెలంగాణ ప్రభుత్వం కేవియట్ పిటిషన్ వేసింది. దీని వల్ల కేటీఆర్ తరపున పిటిషన్ దాఖలైన సమయంలో మధ్యంతర ఉత్తర్వులు లేదా స్టే ఇచ్చే ముందు తెలంగాణ ప్రభుత్వ వాదనలు వినడం తప్పనిసరి అవుతుంది. ఏకపక్ష తీర్పు రాకుండా ఈ కేవియట్ ద్వారా నివారించే అవకాశం ఉంటుంది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు పొందడానికి కేటీఆర్ ప్రయత్నిస్తే కేవియట్ పిటిషన్ ద్వారా తక్షణమే జారీ అయ్యే అవకాశాలు సన్నగిల్లే అవకాశం ఉంటుంది. తెలంగాణ ప్రభుత్వం వాదనలు వినిపించిన తర్వాతే సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది.
ఇక మరోవైపు ఈడీ సైతం కేటీఆర్‌కు మరోసారి నోటీసులు జారీ చేసింది. జనవరి 16న విచారణకు రావాలని ఈడీ ఆ నోటీసులో కోరింది. ఈ కేసులో జనవరి 7న విచారణకు రావాలని ఈడీ తొలుత కేటీఆర్ కు నోటీసు జారీ చేసింది. అయితే హైకోర్టు తీర్పు ఉన్నందున సమయం కోరారు. ఫార్మూలా ఈ కారు రేసులో ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ను కొట్టివేయాలని కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. దీంతో కేటీఆర్ కు ఈడీ జనవరి 7న నోటీసులు జారీ చేసింది.
మరోవైపు ఏసీబీ సైతం తన దూకుడు పెంచింది. తెలంగాణ హైకోర్టు తీర్పుతో ఏసీబీ అధికారులు ఫార్ములా ఈ రేసు కేసులో దూకుడు పెంచారు. ఫార్ములా-ఈ కేసులో పలుచోట్ల ఏసీబీ అధికారులు రంగంలోకి దిగి సోదాలు చేపట్టారు. గ్రీన్‌కో కార్యాలయాల్లో ఏసీబీ తనిఖీలు చేశారు. ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్‌లో సోదాలు నిర్వహించారు. హైదరాబాద్, మచిలీపట్నంలో రికార్డులు పరిశీలిస్తున్నారు. మాదాపూర్‌లోని ఏస్ నెక్స్ట్‌జెన్, ఏస్ అర్బన్ రేస్, మచిలీపట్నంలోని ఏస్ అర్బన్ డెవలపర్స్‌లో తనిఖీలు చేపట్టారు. ఎన్నికల బాండ్ల కొనుగోలు వ్యవహారంలో ఏసీబీ సోదాలు చేసింది. గ్రీన్‌కో, అనుబంధ సంస్థల నుంచి బీఆర్ఎస్ పార్టీకు ఎన్నికల బాండ్లు వెళ్లడంపై ఏసీబీ ఫోకస్ పెట్టింది. రూ. 41కోట్ల ఎన్నికల బాండ్ల కొనుగోలుపై ఏసీబీ ఆరా తీస్తోంది.