ఎస్ఐ వేధింపులతో యువకుడి ఆత్మహత్యాయత్నం
Youth commits suicide due to harassment by SI: ఎస్‌ఐ వేధింపులు తట్టుకోలేక ఓ మైనర్ బాలుడు ఆత్మహత్యకు యత్నించాడు. మంచిర్యాల జిల్లా కన్నపల్లిలో చోటుచేసుకున్న ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.. మంచిర్యాలలోని ఎన్టీఆర్ నగర్‌కు చెందిన చింతల కృష్ణ మనోహర్ (16) అనే యువకుడు సోమవారం ఉదయం విషం సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు సమాచారం. కుటుంబ సభ్యులు అతడిని చికిత్స నిమిత్తం మంచిర్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాధితుల కథనం ప్రకారం, కన్నపల్లి ఎస్‌ఐ ఆదివారం సాయంత్రం డబ్బు డిమాండ్ చేస్తూ అతనిని, అతని బంధువును సైతం కొట్టాడు. వేధింపులు తట్టుకోలేక కృష్ణ మనోహర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డట్లు బంధువులు చెబుతున్నారు.
గత డిసెంబర్‌లో అక్రమంగా ఆటోలో తరలిస్తున్న ఐదు క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చింతల మనోహర్, చింతల సుధాకర్‌లపై కేసు నమోదు చేసి, ఆటోను సీజ్ చేశారు. అది విడిపించాలంటే తమను డబ్బులు డిమాండ్ చేస్తున్నాడని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. తమను పిలిపించి ఇష్టం వచ్చినట్లు కొట్టడమే కాకుండా, నానా బూతులు తిట్టినట్లు విలేకరులతో తమ గోడు వెల్లబోసుకున్నారు. కన్నపల్లి ఎస్‌ఐ గంగరాములు ఓ వీడియో సైతం విడుదల చేశారు. తాము వారిపై ఎలాంటి వేధింపులు చేయలేదని స్పష్టం చేశారు. ఎలాంటి వేధింపులకు పాల్పడలేదని, పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాకు సంబంధించి ఆటో విడుదల చేయాలని డిమాండ్ చేశాడని తెలిపారు. అది తమ పరిధిలో లేదని చెప్పడంతో అది మనసులో పెట్టుకుని తమపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నాడని ఎస్ఐ స్పష్టం చేశారు.