అమ్మగా మారిన అధికారిణి
* రహదారి లేని ఊరు.. ప్రాణాపాయంలో చిన్నారి
* గిరిజన బాలికను 6 కిలోమీటర్లు మోసుకెళ్లిన వార్డెన్
* వీపునే వాహనంగా మార్చుకున్న ఆశ్రమ పాఠశాల వార్డెన్ హేమ
* మంత్రి సంధ్యారాణి అభినందనలు.. సలాం అంటున్న గిరిజనం
రోడ్డు లేదు.. వాహనం లేదు.. అయినా వెనుదిరగలేదు. విధి ఒకవైపు.. మానవత్వం మరోవైపు. ఆ రెండింటినీ సమానంగా నిలబెట్టిన ఆశ్రమ పాఠశాల వార్డెన్ గాథ ఇది.. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ గిరిజన బాలికకు ఆ వార్డెన్ దేవతలా మారింది. విద్యార్థినిని తన వీపుకు డోలీలా కట్టుకుని ఆరు కిలోమీటర్ల మేర కొండ దారుల్లో కాలినడకన మోసుకెళ్లి ఆసుపత్రిలో చేర్పించి మానవత్వం ఇంకా బతికే ఉందని చాటిచెప్పింది.
రోడ్డు ఉంటే వాహనం వచ్చేది.. వాహనం ఉంటే ప్రయాణం సులభమయ్యేది. కానీ ఏదీ లేకపోయినా ఓ చిన్నారి ప్రాణాన్ని కాపాడాలనే తపన ముందు అన్ని అడ్డంకులు చిన్నవయ్యాయి. తన వీపే అంబులెన్స్‌గా మార్చుకున్న ఓ వార్డెన్ చేసిన సాహసం పార్వతీపురం మన్యం జిల్లాలో మానవత్వానికి చిరునామాగా నిలిచింది. ఆపదలో ఉన్న విద్యార్థినిని కాపాడటానికి ఏ బంధాలు అవసరం లేదని, కేవలం కరుణ ఉంటే చాలని నిరూపించారు. తీవ్ర జ్వరంతో ఉన్న గిరిజన బాలిక ప్రాణాలు కాపాడేందుకు, రహదారి లేని కొండ కోనల్లో ఆ చిన్నారిని తన నడుముకు కట్టుకుని.. ఏకంగా ఆరు కిలోమీటర్ల మేర కాలినడకన మోసుకెళ్లిన ఓ హాస్టల్ వార్డెన్ ఉదంతం ప్రతి ఒక్కరి హృదయాలను కదిలిస్తోంది.
విధి నిర్వహణలో.. మాతృత్వపు ఒడి!
పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం వాడపుట్టి గ్రామానికి చెందిన భువనేశ్వరి అనే బాలిక భద్రగిరి గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలలో 7వ తరగతి చదువుతోంది. తండ్రి లేని ఆ చిన్నారి చిన్నాన్న సంరక్షణలో పెరుగుతోంది. సెలవులకు ఇంటికి వెళ్లిన భువనేశ్వరి తీవ్ర జ్వరం బారిన పడింది. మొదట కురుపాం ఆసుపత్రిలో చూపించినా తగ్గకపోగా, బాలిక పరిస్థితి మరింత క్షీణించింది. గిరిజన సంక్షేమ శాఖ అధికారి రజని ఆదేశాల మేరకు.. ఆశ్రమ పాఠశాల వార్డెన్ హేమ వెంటనే వాడపుట్టి గ్రామానికి చేరుకున్నారు. అక్కడ మంచంపై ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న భువనేశ్వరిని చూసి ఆమె గుండె చలించిపోయింది. క్షణం ఆలస్యమైనా పాప ప్రాణాలకే ప్రమాదమని గ్రహించింది…
దారి లేదు.. కానీ ధైర్యం వీడలేదు!
వాడపుట్టి గ్రామానికి సరైన రహదారి సౌకర్యం లేదు. కనీసం బైక్ వెళ్లేందుకు కూడా వీల్లేని పరిస్థితి. అంబులెన్స్ వచ్చే అవకాశమే లేదు. కానీ వార్డెన్ హేమ వెనకడుగు వేయలేదు. ఆ చిన్నారిని తన సొంత బిడ్డలా భావించి, ఒక గుడ్డతో బాలికను తన నడుముకు, వీపునకు డోలి లాగా గట్టిగా కట్టుకున్నారు. రాళ్లు తేలిన కరుకు దారులు, ఎగుడుదిగుడు కొండ దారుల గుండా సుమారు 6 కిలోమీటర్ల మేర ఆ బాలికను మోసుకుంటూ నెల్లికెక్కువ గ్రామానికి కాలినడకన చేరుకున్నారు. అక్కడి నుంచి వాహనం ఏర్పాటు చేసి హుటాహుటిన పార్వతీపురం జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు.
అక్కడ అలా… ఇక్కడ ఇలా…
ఇటీవల చింతలపూడిలో ఓ హాస్టల్ వార్డెన్.. కేవలం దుప్పటి అడిగిన పాపానికి ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థినిని అర్థరాత్రి వేళ నిర్దాక్షిణ్యంగా బయటకు గెంటేసిన ఘటన మరవకముందే.. వార్డెన్ హేమ చూపిన ఈ ఔదార్యం విధి నిర్వహణలో ఆమెకున్న నిబద్ధతకు, మానవత్వానికి మచ్చుతునకగా నిలిచింది. ప్రస్తుతం భువనేశ్వరి జిల్లా ఆసుపత్రి ఐసీయూలో చికిత్స పొందుతోంది. వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తుండటంతో బాలిక ప్రాణాపాయం నుండి బయటపడి, ఆరోగ్యం స్థిరంగా ఉన్నట్లు తెలుస్తోంది. గిరిజన బాలిక ప్రాణాలు కాపాడిన వార్డెన్ హేమ సాహసం, సేవాభావం గురించి తెలుసుకున్న రాష్ట్ర మంత్రి సంధ్యారాణి అభినందించారు.
కేవలం ఉద్యోగ బాధ్యతగానే కాకుండా, కన్నతల్లిలా మారి విద్యార్థినిని కాపాడుకున్న వార్డెన్ హేమపై అటు సోషల్ మీడియాలో, ఇటు ప్రజల్లో ప్రశంసల జల్లు కురుస్తోంది. “శభాష్ హేమ.. మీలాంటి వారే సమాజానికి ఆదర్శం” అంటూ నెటిజన్లు నీరాజనాలు పలుకుతున్నారు.