తోపులాట‌లో కింద‌ప‌డ్డ‌ హ‌రీష్‌రావు అరెస్ట్

Harish Rao: పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రూ. 7 లక్షల కోట్ల అప్పులపై చర్చకు రావాలంటూ మంత్రి జూపల్లి కృష్ణారావు విసిరిన సవాల్‌కు.. కేటీఆర్, హరీశ్‌రావు ఇద్దరూ కలిసి గన్‌పార్క్‌కు రావాలని పిలుపునిచ్చారు. మరోవైపు, గురుకులాల విద్యాశాఖలో జరిగిన అవినీతి, కొనుగోళ్లపై కాంగ్రెస్ మంత్రులు చర్చకు సిద్ధమవడంతో హైదరాబాద్ ఒక్కసారిగా అట్టుడికిపోయింది. ఈ సవాళ్లు, ప్రతిసవాళ్ల నేపథ్యంలో రాజధానిలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది.

గురుకులాల కొనుగోలు ప్రక్రియ మొత్తం నాలుగు శాఖల ఆధ్వర్యంలో పారదర్శకంగా జరిగిందని, బీఆర్‌ఎస్‌ నేతలవి అబద్ధాలని మంత్రి పొన్నం ప్రభాకర్‌ మండిపడ్డారు. పదేళ్లుగా బీఆర్ఎస్ చేసిన ప్రొక్యూర్‌మెంట్‌పై కూడా చర్చకు సిద్ధమా అని ప్రశ్నించారు. సవాల్ నేపథ్యంలోనే మంత్రులు పొన్నం ప్రభాకర్‌, అడ్లూరి లక్ష్మణ్‌, అజారుద్దీన్‌ తదితరులు గన్‌పార్క్‌ అమరవీరుల స్తూపం వద్దకు చేరుకున్నారు. బీఆర్‌ఎస్‌ నేతలను సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో చర్చకు రావాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. మరోవైపు కాంగ్రెస్‌ ప్రభుత్వ అప్పులపై చర్చకు తాము సిద్ధమంటూ బీఆర్‌ఎస్‌ నేతలు కేటీఆర్‌, హరీశ్‌రావు తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు. మంత్రి జూపల్లి చెప్పినట్లు కేటీఆర్ తెలంగాణ భవన్‌లోనే ఉంటారని, తాను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌తో కలిసి గన్‌పార్క్‌కు వెళ్తానని హరీశ్‌రావు ప్రకటించారు.

అయితే హరీశ్‌రావు వాహనాన్ని పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. “సవాల్ విసిరితే అప్పుల లెక్క చెప్పేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. మేము వస్తామంటే ముగ్గురు మంత్రులకు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడం లేదని హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. హరీశ్‌ రావు, బీఆర్ఎస్ నాయకుల బృందాన్ని తెలంగాణ భవన్‌ వద్ద పోలీసులు అడ్డుకున్న స‌మ‌యంలో తోపులాట‌లో హరీశ్‌ రావు కిందపడిపోయారు. దీంతో పోలీసుల తీరుపై బీఆర్‌ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు, బీఆర్‌ఎస్‌ కార్యకర్తల మధ్య తోపులాట చోటు చేసుకోవడంతో ఉద్రికత్త పరిస్థితులు చోటు చేసుకొన్నాయి. పోలీసుల తీరు నిరసిస్తూ తెలంగాణ భవన్ ఎదుట రోడ్డుపై హరీశ్‌ రావు, బీఆర్ఎస్ నాయకులు బైఠాయించి ఆందోళన చేపట్టారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like