విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి
-ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలి
-మంచిర్యాల డీసీపీ ఏ.భాస్కర్
.
విద్యార్థి దశ నుంచే ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని, గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు పూర్తిగా దూరంగా ఉండాలని మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్ పిలుపునిచ్చారు. మత్తు అలవాట్లు జీవితాలను నాశనం చేస్తాయని, విద్యార్థులు కష్టపడి చదివి తల్లిదండ్రులకు, సమాజానికి మంచి పేరు తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు. తాండూర్ మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ బీసీ వెల్ఫేర్ బాలుర పాఠశాలను డీసీపీ సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ముఖాముఖిగా మాట్లాడి, వారి సమస్యలు, వసతులు, విద్యా పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులను ఉద్దేశించి డీసీపీ మాట్లాడుతూ కీలక సూచనలు చేశారు.
గంజాయి, డ్రగ్స్ వంటి అలవాట్ల వల్ల వ్యక్తిగత జీవితంతో పాటు కుటుంబాలు, సమాజం తీవ్రంగా దెబ్బతింటాయని హెచ్చరించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేదా సమస్యలు ఎదురైనా వెంటనే ఉపాధ్యాయులు, హాస్టల్ వార్డెన్ లేదా తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లాలన్నారు. ఎవరికీ చెప్పకుండా పాఠశాల లేదా హాస్టల్ నుండి పారిపోవడం వంటి తొందరపాటు నిర్ణయాలు ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోవద్దని స్పష్టం చేశారు. క్రమశిక్షణతో, కష్టపడి చదివితేనే ఉన్నత ఉద్యోగాలు సాధించి ఆర్థికంగా స్థిరపడటంతో పాటు సమాజంలో గౌరవం పొందచ్చన్నారు.
ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి ఏసీపీ ఎస్.వి. కిరణ్ కుమార్, తాండూర్ సీఐ దేవయ్య, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం మరియు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.