మా ఇంటికి రాకండి
సంక్రాంతికి పట్టణాల నుంచి పల్లెలకు ఇతర ప్రాంతాలకు తరలివెళ్తుంటారు. హైదరాబాద్ వంటి నగరాలు నిర్మానుష్యంగా మారుతాయి. ఇదే అదునుగా కొందరు దొంగలు తమ చేతివాటం ప్రదర్శిస్తుంటారు. పండుగకు ఊరెళ్లే వారి ఇళ్లల్లో చోరీలకు ప్లాన్ చేస్తుంటారు. అయితే, దొంగల బారి నుంచి కాపాడుకునేలా పోలీసులు ప్రజలకు అవగాహన కల్పిస్తుంటారు. ప్రజలు కూడా తమ ఇండ్లను కాపాడుకునేందుకు పక్క వారికి చెప్పి మరీ వెళ్తుంటారు… ఓసారి ఇటు చూడండి అని… మధ్యమధ్యలో కన్నేయండంటూ పక్కవారికి తమ ఇంటి గురించి ఒకటికి రెండు సార్లు చెబుతారు..
ఇంటి గేటుకు పోస్టర్
అయితే, ఓ ఇంటి యజమాని చేసిన పని మాత్రం నెట్టింట వైరల్‌గా మారింది. ఆయన స్వయంగా రాసి ఇంటికి అంటించిన ఈ నోట్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేయడమే కాదు… నవ్విస్తోంది కూడా… ‘మేము సంక్రాంతికి ఊరికి పోతున్నాం. డబ్బు, నగలూ తీసుకుని వెళ్తున్నాం. మా ఇంటికి రాకండి – ఇట్లు మీ శ్రేయోభిలాషి.’ అనేది ఆ నోట్ సారాంశం. దీన్ని ఇంటి బయట డోర్‌కు అంటించి వెళ్లారు. దీన్ని చూసిన ఓ వ్యక్తి ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరలవుతోంది. దీనిపై నెటిజన్లు సైతం తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. ఇంటి యజమాని కొత్తగా ఆలోచించారని ఒకరు.. ఏకంగా దొంగలకే షాక్ ఇచ్చారంటూ కామెంట్స్ చేస్తున్నారు.