పంచాయ‌తీ ఎన్నిక‌లు అప్పుడే…

Local body elections in Telangana: తెలంగాణ‌లో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లు ఎప్పుడు జ‌రుగుతాయి..? ఫిబ్ర‌వ‌రిలో జ‌ర‌గ‌వా..? మ‌రి ఇంకెప్పుడు..? అస‌లు ఈ ఎన్నిక‌లు ఏం అడ్డు వ‌స్తోంది.. ప్ర‌భుత్వం ఏం ఆలోచిస్తోంది… ఎన్నిక‌ల‌కు సంబంధించి నాయ‌కులు ఏం అనుకుంటున్నారు..? ఇంత‌కీ ఫైన‌ల్‌గా ఎన్నిక‌లు జ‌రిగేది ఎప్పుడు… ఇవ‌న్నీ ఇప్పుడు అంద‌రి మ‌దిని తొలుస్తున్న ప్ర‌శ్న‌లు..

ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా ఎన్నిక‌ల ఫీవ‌ర్ న‌డుస్తోంది. ఎన్నికల‌కు సంబంధించి రేపో, మాపో అంటూ సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తుండ‌టంతో అటు నాయ‌కులు, ఇటు ఆశావ‌హులు సిద్ధ‌మ‌వుతున్నారు. అయితే, ఎన్నిక‌లు ఇప్పుడే ఉండ‌వంటూ జ‌రుగుతున్న ప్ర‌చారంతో అస‌లు ఎన్నిక‌లు ఇప్పుడు ఉంటాయా..? ఉండ‌వా..? ఇప్పుడు లేక‌పోతే మ‌రి ఎప్పుడు జ‌రుగుతాయ‌ని ఆరా తీస్తున్నారు. దీనికి తోడు ఎన్నిక‌ల‌కు సంబంధించి తేదీలు కూడా ఖ‌రార‌య్యాని సోష‌ల్ మీడియాలో జ‌రుగుతున్న త‌ప్పుడు ప్ర‌చారం కూడా కొంద‌రు న‌మ్ముతుండ‌టం గ‌మ‌నార్హం. వాస్త‌వానికి తెలంగాణ ప్ర‌భుత్వం ఫిబ్ర‌వ‌రి మొద‌టి వారంలోనే ఎన్నిక‌ల‌కు వెళ్లాల‌ని ప్లాన్ చేసింది. రైతు భరోసా, ఇతర పథకాల అమలు చేసి వెళ్లాల‌ని భావించింది. అయితే, బీసీ రిజర్వేషన్ల అంశం ప్ర‌భుత్వం ఆశ‌ల‌పై నీళ్లు చ‌ల్లిన‌ట్ల‌య్యింది. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ప్రస్తుతం గ్రామీణ స్థానిక సంస్థల్లో బీసీలకు 22 శాతం రిజర్వేషన్లు అమల్లో ఉంది. అయితే ఇచ్చిన హామీ మేరకు 42 శాతానికి పెంచితే రిజర్వేషన్లు 50 శాతానికి మించుతాయి. రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదన్న సుప్రీంకోర్టు తీర్పు దానికి అడ్డుగా మారుతుంది.

ఆల‌స్యం ఎందుకంటే.?
జ‌నాభా మేరకు రిజర్వేషన్లు కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం బీసీ కమిషన్‌ను ఏర్పాటు చేసింంది. కులగణన కూడా పూర్తి చేసింది. ఆయా లెక్కల ప్రకారం బీసీల రిజర్వేషన్ల శాతాన్ని ఖరారు చేస్తూ బీసీ కమిషన్‌ తుది నిర్ణయం తీసుకోవాలి. అనంతరం రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు పంపిస్తే దానికి అనుగుణంగా ఈసీ నోటిఫికేషన్‌ జారీచేస్తుంది. అనంతరం 21 రోజుల్లో ఎన్నికల ప్రక్రియను కంప్లీట్ చేయాలి. దీనికి తోడు గత బీఆర్ఎస్ సర్కార్ అమల్లోకి తెచ్చిన పంచాయతీ రాజ్‌ చట్టం-2018 అమలుపై సందిగ్ధం నెలకొంది. ఈ చట్టంలో ఏమైనా మార్పులు చేస్తే జనాభా ప్రాతిపదికన ఎస్సీ, ఎస్టీ, బీసీ జనరల్‌ సామాజిక వర్గాలకు రిజర్వేషన్లు కేటాయించే అవకాశముందని తెలుస్తోంది. ఇదంతా ఇప్పట్లో జరిగేలా కనిపించడం లేదు.

మే లేదా జూన్‌లో ఎన్నిక‌లు..
పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో పోటీ చేయాల‌నుకుంటున్న ఆశావ‌హుల‌కు ఈ ఆల‌స్యం ఇబ్బందికరంగా మారింది. ఇప్ప‌టికే వారు గ్రామాల్లో ప‌రోక్షంగా ప్ర‌చారం చేసుకుంటున్నారు. కొంద‌రు ముఖ్య‌వారిని పిలిపించుకుని మాట్లాడుతున్నారు. మందులు, విందులు కొన‌సాగుతున్నాయి కూడా. దాదాపు ప‌ది నెల‌లుగా ప్రజల మధ్య ఉండి స్థానిక ఎన్నికల్లో పోటీచేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్న వీరికి నిరాశే మిగులుతోంది. ఒకవేళ ఇవన్ని మార్చి లోపు పూర్తి చేసినా ప‌ద‌వ త‌ర‌గ‌తి, ఇంటర్, డిగ్రీ, ఎంట్రెన్స్ పరీక్షలు జరుగుతాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీచర్లు విధులు నిర్వహించాల్సి ఉంటుంది కాబట్టి మే మొదటి వారం నుంచి ఎన్నికల ప్రక్రియ ప్రారంభిస్తే జూన్ వరకు పూర్తి చేయవచ్చు అని ప్రభుత్వం ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది.

Get real time updates directly on you device, subscribe now.

You might also like