సుప్రీం కోర్టులో చంద్రబాబుకు భారీ ఊరట

AP Chief Minister Nara Chandrababu Naidu: ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ఇవాళ సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. కూటమి ప్రభుత్వానికి సారధిగా ఉన్న చంద్రబాబుపై గతంలో వైసీపీ హయాంలో సీఐడీ నమోదు చేసిన కేసుల్ని సీబీఐకి బదలాయించాలంటూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు ఇవాళ తన తీర్పును ప్రకటించింది. దీంతో ఈ కేసుల్ని సీబీఐకి అప్పగించే వీలు లేకుండా పోయింది. వీటిపై సీఐడీ దర్యాప్తు మాత్రం కొనసాగనుంది.
వైసీపీ హయాంలో మాజీ సీఎం చంద్రబాబుపై స్కిల్ డెవలప్మెంట్ కేసు మొదలు ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ వరకు పలు కేసులు నమోదయ్యాయి. తర్వాత ఆయన బెయిల్ పై విడుదలై ఏపీ ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. ఈ క్రమంలోనే చంద్రబాబుపై నమోదైన సీఐడీ కేసులను సీబీఐకి బదిలీ చేయాలంటూ సుప్రీం కోర్టులో హైకోర్టు న్యాయవాది బి.బాలయ్య పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు కొట్టి వేసింది. పిటిషనర్ పై సుప్రీం కోర్టు ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదొక పనికిమాలిన పిటిషన్, ఈ కేసు వాదించడానికి ఎలా వచ్చారంటూ పిటిషనర్ తరఫు న్యాయవాది మణిందర్ సింగ్ పై సుప్రీం కోర్టు ధర్మాసనం ఫైర్ అయింది. ఇది తప్పుడు పిటిషన్ అని, ఈ పిటిషన్ గురించి ఒక్క మాట మాట్లాడినా భారీ జరిమానా విధిస్తామని పిటిషనర్ ను సుప్రీం కోర్టు హెచ్చరించింది. సుప్రీం కోర్టు తాజా నిర్ణయంతో చంద్రబాబుకు భారీ ఊరట లభించినట్లయింది.
కాగా, జగన్ సీఎంగా పగ్గాలు చేపట్టింది మొదలు చంద్రబాబుపై ఏకంగా 22 కేసులు నమోదయ్యాయి. 2020లో 5, 2021లో 9, 2022లో 2, 2023లో 6 కేసులు పెట్టారు. మంగళగిరిలోని సీఐడీ పోలీస్‌స్టేషన్‌లో 2023లో రెండు, 2022లో ఒకటి, 2021లో మూడు, 2020లో రెండు మొత్తం 8 కేసులు నమోదయ్యాయి. ఉచిత ఇసుక పాలసీలో అవకతవకల ఆరోపణల కేసు, సీఆర్‌డీఏ, రాజధాని, ఇన్నర్ రింగు రోడ్డు మాస్టర్‌ప్లాన్ నిర్ణయాల్లో అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు కేసు, స్కిల్ డెవలప్మెంట్ కేసు, ఏపీ ఫైబర్‌నెట్, ఎసైన్డ్ భూములు, అధికార దుర్వినియోగం వంటి ఆరోపణలతో చంద్రబాబుపై సీఐడీ కేసులు నమోదు చేసింది.